YSRCP Leader 982 Acres Land Grabbing in Chittoor District : చిత్తూరు జిల్లాలో దశాబ్దాలుగా వివాదంలో ఉన్న భూములు వైఎస్సార్సీపీలో కీలకంగా వ్యవహరిస్తున్న ఓ పెద్దాయన అనుచరుల చేతుల్లోకి వెళ్లాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అధికారులు అడ్డగోలు నిర్ణయాలు తీసుకుని భూములు దోచుకోవటానికి వారికి సహకరించారు. ప్రభుత్వం మారినా వారు మాత్రం వైఎస్సార్సీపీ విధేయులుగానే కొనసాగుతున్నారు.
చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం రాగానిపల్లిలో ఏకంగా 982 ఎకరాల భూములను వైఎస్సార్సీపీ నేతలు దోచుకున్నారు. మొత్తంగా వాటి విలువ 100 కోట్ల రూపాయలకు పైనే! రెవెన్యూ దస్త్రాల్లో అనాధీనం (ప్రభుత్వ భూములు) పేరుతో నమోదైన ఆ భూముల్ని గతంలో పనిచేసిన కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు కాపాడుతూనే వచ్చారు. కానీ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పనిచేసిన అధికారులు మాత్రం ‘పెద్దాయన’ అండ చూసుకుని రెచ్చిపోయారు. మొత్తం భూముల్ని పట్టా భూములుగా తేల్చేశారు. తద్వారా 600 ఎకరాలకుపైగా భూముల్ని పెద్దాయన అనుచరుల చేతుల్లోకి వెళ్లిపోయేలా చేశారు.
గత ప్రభుత్వంలో చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పనిచేసి ఇటీవల తిరుపతి జిల్లా కలెక్టర్‌గా నియమితులైన ఎస్ వెంకటేశ్ ఒక్క ఆర్డర్‌తో దశాబ్దాలుగా వివాదాస్పదంగా ఉన్న 982 ఎకరాల భూమిని ఇలా ప్రైవేటు వ్యక్తుల పరం చేశారు. ఆ తర్వాత నిషేధిత జాబితా 22ఏ నుంచి వాటిని తొలగించారు. ఈ వ్యవహారంలో మరో ఇద్దరు కలెక్టర్లూ పని చేశారు. పట్టా భూముల కోసం రెవెన్యూ స్థాయిలో ఒత్తిడి తెచ్చి 22 ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించిందీ వారే. ఈలోగా ప్రభుత్వం మారింది. వైఎస్సార్సీపీ హయాంలో పెద్దాయన విధేయులుగా అక్కడే విధులు నిర్వహిస్తున్న కొందరు అధికారులు మొత్తం భూముల్ని ఇటీవలే వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేశారు. ఇవన్నీ చూసి ఏ ప్రభుత్వం ఉన్నా పెత్తనం మాత్రం వైఎస్సార్సీపీ వీర విధేయ అధికారులదే అని టీడీపీ, జనసేన వర్గాలు మండిపడుతున్నాయి.
విశాఖలో వైసీపీ నేతలు రూ.3వేల కోట్ల భూ కుంభకోణం చేశారు-జనసేన నేత పీతల - Land Scam In YCP Government
పుంగనూరు జమిందారు పట్టా నుంచి మొదలు : రాగానిపల్లిలోని 982 ఎకరాల 49 సెంట్ల భూమికి 1907లో అప్పటి పుంగనూరు జమిందారు మహదేవరాయలు పేరుతో పట్టా ఇచ్చారు. 1948 ఎస్టేట్ ఎబాలిషన్ చట్టం (Estate Abolition Act) ప్రకారం ఈ భూమిని ప్రభుత్వం పుంగనూరు జమిన్ ఎస్టేట్‌లో భాగమని ప్రకటించి, స్వాధీనం చేసుకుంది. అనంతరం సెటిల్‌మెంట్ అధికారులు దీనిపై సుమోటోగా విచారణ చేసి, ఈ భూమికి మహదేవరాయలు కుమారుడు శంకరరాయలు పేరుతో 1958 ఫిబ్రవరి 27న రఫ్ పట్టా ఇచ్చారు. అనంతరం ఆయన ఆ భూములను వెంకటస్వామి, రెడ్డెప్పరెడ్డికి విక్రయించారు. రైత్వారీ పట్టాలు వచ్చాయి. తర్వాత ఈ భూమి పలుమార్లు చేతులు మారింది. రిజిస్ట్రేషన్లు కూడా జరిగాయి.
1973 డిసెంబరులో సెటిల్‌మెంట్ డైరెక్టర్ ఈ భూమి అనుభవదారులకు నోటీసులిచ్చారు. జమిందారు పట్టా జారీ నిబంధనలకు విరుద్ధమని అది సాగు భూమి కాదని అడవిగా ఉందని పేర్కొన్నారు. సాగుభూమిగా మార్చడానికి 1908 నాటి ఎస్టేట్స్ ల్యాండ్ చట్టం( Estate Land Act) ప్రకారం అప్పటి కలెక్టర్ అనుమతి ఇవ్వలేదని పేర్కొన్నారు. 1977 ఫిబ్రవరి 24న(24-02-1977) శంకరరాయలుకు ఇచ్చిన పట్టాను రద్దు చేశారు.
ఆలయ భూమిని కబ్జా చేసిన మాజీ మంత్రి కన్నబాబు అనుచరులు - YCP Leaders Occupied Temple Land
ఏకపక్షంగా ఉత్తర్వులిచ్చిన సంయుక్త కలెక్టర్ : వెంకటస్వామి, రెడ్డెప్పరెడ్డి వారసులు ఈ భూమిపై హక్కుల కోసం కోర్టుల్లో పిటిషన్లు, అప్పీళ్లు వేశారు. చివరగా దీనిపై 2022లో చిత్తూరు జాయింట్ కలెక్టర్ వెంకటేశ్ విచారణ చేపట్టారు. 1907లో రఫ్‌పట్టాను ధ్రువీకరించారని దీన్ని మళ్లీ విచారించి పట్టా ఇవ్వక్కర్లేదని పేర్కొన్నారు. 1908 ఎస్టేట్స్ ల్యాండ్ చట్టానికి ముందే పుంగనూరు జమిందారు పట్టా ఇచ్చారని ఆ అధికారం ఆయనకు ఉందని చెప్పారు. దీనిపై అనేక లావాదేవీలు జరగడం ద్వారా పట్టాభూమిగా గుర్తించారని జేసీ తేల్చారు. ఇవి వ్యవసాయ భూములే అని తోటలు పెంచుతున్నారని, అధికారులు శిస్తు వసూలు చేశారని, విద్యుత్తు కనెక్షన్ ఇచ్చారని వివరించారు.
1907లో రఫ్ పట్టా ఇచ్చినా వారు 1948 ఎస్టేట్ ఎబాలిషన్ చట్టం ప్రకారం1945 జులై 1 నాటికి భూమి మీద తామే ఉన్నామని సెటిల్‌మెంట్ ఆఫ్ ఆపరేషన్స్ (Settlement of operations) వద్ద శాశ్వత పట్టా తీసుకోవాలి. అలా తీసుకోలేదు. ఒకరి పేరుతో 982 ఎకరాల భూమి ఉంటే అది 1976 ల్యాండ్ సీలింగ్ చట్టం(Land Ceiling Act) పరిధిలోకి వస్తుంది. కానీ ఈ భూమి రాలేదు. రఫ్ పట్టా చెల్లదని గతంలో న్యాయస్థానాలు కూడా తీర్పు ఇచ్చాయి. అయినా అప్పటి జేసీ వెంకటేశ్ రఫ్ పట్టా చెల్లుతుందని, కొత్త పట్టా అవసరం లేదని తేల్చేశారు. దీనికి అనుగుణంగా కలెక్టర్ నిషేధిత జాబితా (22ఏ) నుంచి వాటిని తొలగించారు.
కొత్త ప్రభుత్వంలోనూ తగ్గకుండా, పెద్దాయన అనుచరులకు పందేరం : ఈ వ్యవహరంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైఎస్సార్సీపీ విధేయ అధికారులు వెనక్కి తగ్గలేదు. పెద్దాయనకు అనుకూలంగా వెబ్‌ల్యాండ్‌లో మార్పులు చేశారు. 22వ సర్వే నంబరు విస్తీర్ణం 982.49 ఎకరాలు కాగా వెబ్‌ల్యాండ్‌లో అనాధీనం(ప్రభుత్వ భూములు) అని చూపిస్తోంది. అదే సర్వే నంబరులో సబ్‌డివిజన్ (Sub Division) కింద పలువురి పేర్లతో ఆన్‌లైన్ చేశారు. సర్వే నంబరు మొత్తం విస్తీర్ణానికి మించి రెట్టింపు నమోదైంది. అధికారులెంత అడ్డగోలుగా పనిచేశారో చెప్పడానికి ఇదే నిదర్శనం. వెబ్‌ల్యాండ్‌లో పేర్లు నమోదు చేసిన వారిలో పూర్వీకుల నుంచి హక్కుకోసం పోరాడుతున్న వారి వారసులు ఏడుగురు మాత్రమే అని స్థానికులు తెలిపారు. మిగిలిన వారంతా పెద్దాయన అనుచరులేనని, వారికే 600 ఎకరాల వరకు కట్టబెట్టారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సమగ్ర విచారణ చేయిస్తే ఈ భూ దందాలో అప్పటి ఐఏఎస్ అధికారులతోపాటు రెవెన్యూలోని వివిధస్థాయి అధికారుల పాత్ర వెలుగులోకి వస్తుంది.