Houses for the poor are pending : వాళ్లంతా నలభై ఏళ్ల నుంచి ఈ ప్రాంతంలోనే జీవిస్తున్నారు. తుఫానులు, వరదలు వచ్చే క్రమంలో తమ ఇళ్లు మొత్తం మునిగిపోతే పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్న పేదలు. వరదల నుంచి రక్షణ కోసం రక్షణ గోడ నిర్మించామని చెబుతున్న పాలకులు నివాస ఇళ్లకు పట్టాలు ఇవ్వడం లేదు. రక్షణ గోడ పూర్తయ్యి ఏళ్లు గడుస్తున్నా తమ ఇళ్లకు పట్టాలు ఇవ్వడం లేదని విమర్శిస్తున్నారు. ఇంటిపన్ను, కరెంట్ బిల్లు, చెత్తపన్నుల మోత మోగిస్తున్న పాలకులు తమ సమస్యలు పరిష్కారం చేయడం లేదని మండిపడుతున్నారు. ప్రస్తుతం కొంత మంది ఇళ్లు వీఎంసీ సిబ్బంది తొలగిస్తున్నారు. మరికొంత మంది కృష్ణానది వరదల్లో ఇళ్లు కోల్పోయి నిరాశ్రయులు అయ్యారు. తిరిగి ఇళ్లు కట్టుకోలేక తమ బందులు, కుటుంబ సభ్యుల ఇళ్లలో తలదాచుకున్నారు. దీంతో దిక్కుతోచని పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్నారు.
విజయవాడ కృష్ణానది పరివాహక ప్రాంతాలైన రామలింగేశ్వర నగర్ లోని కొన్ని ప్రాంతాలు, భూపేశ్ గుప్తా నగర్, తారకరామా నగర్, రణదివే నగర్, గాంధీ కాలనీ వంటి ప్రాంతాల్లో గత నలభై ఏళ్లుగా నివాసం ఉంటున్న వారికి పట్టాలు మంజూరు చేయడంలో పాలకులు విఫలమయ్యారు. ఎన్నికల ముందు తమ కాలనీలకు వచ్చి తమ ఇళ్లకు పట్టాలు మంజూరు చేస్తామని హామీలు ఇచ్చిన నేతలు అధికారంలోకి వచ్చాక ఆ హామీలు పట్టించుకోవడం లేదని స్థానికులు చెబుతున్నారు. కృష్ణా నది పరివాహక ప్రాంతంలో నివాసం ఉంటున్న ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గతంలో కృష్ణానదికి వరద వచ్చే క్రమంగా ఈ ప్రాంతాల్లో ఇళ్లు చాలా వరకు నీటి మునిగిపోయేవి. దీని నుంచి రక్షణ కల్పించడానికి రక్షణ గోడని ప్రభుత్వం నిర్మించింది. ఇంత వరకు బాగానే ఉన్నా ఈ ప్రాంత ప్రజలకు ఇంటి పట్టాలు ఇవ్వడంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోంది. దీంతో చిన్న రేకుల ఇళ్లు, పూరి గుడెసెల్లో కాపురం ఉంటూ జీవనం సాగిస్తున్నారు.
కృష్ణమ్మా... మా కష్టాలు ఎప్పుడు తీరేనమ్మ..?
తమకు ఎన్నికల ముందు ఇంటికి పట్టాలు ఇస్తామని వైఎస్సార్సీపీ నాయకులు చెప్పారని అధికారంలోకి వచ్చాక ఆ మాట మరిచారని స్థానికులు విమర్శిస్తున్నారు. ఏళ్ల తరబడి అదే ప్రాంతంలో నివాసం ఉంటున్నా ఇంటి పన్ను, విద్యుత్ బిల్లు చెల్లిస్తున్నా ఇంటి పట్టాలు మాత్రం ప్రభుత్వం మంజూరు చేయడం లేదు. మరికొంత మందికి ఇళ్లు ఖాళీ చెయ్యాలని వీఎంసీ సిబ్బంది బెదిరిస్తున్నారు. మరికొంత మంది అప్పులు చేసి చిన్నపాటి గుడెసెలు వేసుకుంటే వాటిని కూల్చేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా నది నుంచి రక్షణ కోసమే రక్షణ గోడ నిర్మించామని గొప్పలు చెప్పుకుంటున్న వైసీపీ పెద్దలు తాము నివాసం ఉంటున్న ఇళ్లు ఖాళీ చేయమని చెప్పడం అన్యామని విమర్శిస్తున్నారు.
ఇక్కడ స్థలాలకు పట్టాలు ఇవ్వని ప్రభుత్వం ఇతర ప్రాంతాల్లోనైనా ఇళ్ల స్థలాలు తమకు కేటాయించడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నచిన్న పూరిగుడెసెల్లో జీవిస్తన్న తమపై పన్నుల మోత మోగిస్తున్న జగన్ ప్రభుత్వం తమకు పట్టాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తున్నారు. తామంతా రెక్కాడితే గానీ డొక్కాడని పేదలమని ఉన్నట్టుండి తమ ఇళ్లు తొలగిస్తే ఎలా బతికాలని ప్రశ్నిస్తున్నారు. తాము ఇంటి పనులు, కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని తమకు పట్టాలు ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వానికి కోరుతున్నారు. ఇతర ప్రాంతాల్లోనూ తమకు ఇళ్లు ఇవ్వకుండా ఇక్కడా ఉన్న ఇళ్లకు పట్టాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం ఎంత వరకు సమంజసమని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. వారమంతా తమకు పని ఉండడం లేదని ఏదో వచ్చిన చాలీచాలని వేతనాలతో బతుకెళ్లదీస్తున్నామని తమపట్ల ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించకుండా పట్టాలు మంజూరు చేయాలంటున్నారు.