YSRCP Chief Jagan Cheating with Promises : పంచ పాండవులు ఎంత మంది అని అడిగితే నలుగురు అని చెప్పి, మూడు వేళ్లు చూపించాలనుకుని, రెండు వేళ్లు చూపించబోయి, చివరికి ఒక్క వేలు పైకెత్తాడట. అసమర్ధత, అజ్ఞానం, అమాయకత్వానికి నిదర్శనంగా చెప్పుకొనే ఈ సందర్భం ఇప్పుడు జగన్ హామీల విషయంలోనూ గుర్తొస్తోంది.
'ఎన్నికల మ్యానిఫెస్టో మాకు బైబిల్, ఖురాన్, భగవద్గీత లాంటిది. ప్రతి రోజూ మ్యానిఫెస్టోను చూసుకుంటూ ఏకంగా 99 శాతం వాగ్దానాలను అమలు చేసింది మీ జగన్, వైఎస్సార్సీపీ మాత్రమే అని చెప్పడానికి గర్వపడుతున్నా.'
అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలో అందుకున్న ఇదే రాగాన్ని ఇప్పుడు ఎన్నికల సమయంలోనూ ఆలపిస్తున్నారు. జగన్ 99శాతం హామీలు అమలు చేశామని చెప్తున్నా సబ్బండ వర్గాలు మాత్రం మరి మా సమస్యల మాటేంటి ? మాకిచ్చిన హామీల గతేంటి ? అని ప్రశ్నిస్తున్నాయి. ఒక్క బటన్ నొక్కుడు తప్ప చేసిన అభివృద్ధి ఏదీ ? అని నిలదీస్తున్నాయి.
'దళితులకు 27 సంక్షేమ పథకాలను దూరం చేసిన ఘనత సీఎం జగన్‌కే దక్కింది'
వ్యాపారానికి ఏ మాత్రం తీసిపోని లాజిక్ : ఛార్మ్ ప్రైసింగ్ (Charm pricing) మార్కెట్, షాపింగ్ మాల్స్‌లో వస్తువుల ధరలు 49, 99, 999, 9999 ఇలా ఆకర్షణీయంగా కనిపిస్తుంటాయి. ఒక వస్తువుని రూ.100 విక్రయించాలనుకునే వ్యాపారి ఒక్క రూపాయి తగ్గించి దాని ధరను రూ.99గా మార్చి వినియోగదారులను ఆకట్టుకుంటాడు. వినియోగదారులను ఆకట్టుకునేందుకు వ్యాపారులు చేసే మాయ ఇది. 'బాటా రేట్'గా మార్కెట్లో ప్రచారంలో ఉన్న ఈ లాజిక్‌ను జగన్ కూడా తనదైన శైలిలో రాజకీయాలకు వాడుకుంటూ రాష్ట్ర ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నాడు.
ఆ ఒక్కటి ఏమిటో?! : 99శాతం హామీలు అమలు చేశామంటూ గొప్పలు చెప్తున్న జగన్ మిగిలిన ఆ ఒక్కటేమిటో ఎక్కడా చెప్పడం లేదు. 'సీపీఎస్ (CPS) రద్దు, మద్యపాన నిషేధం' హామీలు మాత్రమే అమలుకు నోచలేదని జగన్ పదే పదే డప్పు కొడుతున్నా పెండింగ్ సమస్యలతో ఉద్యోగులు ఎందుకు రగిలిపోతున్నట్టు? జాబ్ క్యాలెండర్ ఏమాయె? అని నిరుద్యోగులు ఎందుకు నిలదీస్తున్నట్టు? మద్య నిషేధం (Alcohol prohibition) హామీ ఏమైందని అక్క, చెల్లెమ్మలు ఎందుకు ప్రశ్నిస్తున్నట్టు? కరువు, కరెంటు కోతలపై అన్నదాతలు ఎందుకు కన్నీళ్లు పెట్టుకుంటున్నట్టు? హామీల అమలు చేయండి జగనన్నా అని ఆశా కార్యకర్తలు, అంగన్వాడీలు రోజుల తరబడి ఎందుకు పోరాడినట్టు?
'రాష్ట్రమంతా కరవు తాండవం' - నదుల అనుసంధానంపై ఊసెత్తని వైఎస్సార్సీపీ ప్రభుత్వం
రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల ఆశలను తాకట్టు పెడుతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం.. ఏడాదిలో 341రోజులు అప్పులు చేస్తోందని కాగ్ కడిగి పారేయడం వాస్తవం కాదా? అప్పులు తీసుకురావడం.. బటన్ నొక్కడం తప్ప చేసిన అభివృద్ధి మచ్చుకైనా కనిపిస్తోందా? సంక్షేమం పేరుతో డబ్బు పంపిణీ తప్ప జీవితంలో నిలదొక్కుకునేలా ఆర్థిక ప్రోత్సాహం కల్పించారా? స్వయం ఉపాధి కల్పించేలా గత ప్రభుత్వాలు రూపొందించిన పథకాలకు పాతరేయడం నిజం కాదా?
నాలుగేళ్లలో పెరిగిన ఆర్టీసీ బస్ చార్జీలు, పేద, మధ్య తరగతి వర్గాలకు గుదిబండలా మారిన విద్యుత్ బిల్లులు, ఎక్కడా లేని చెత్త పన్నులు, విపరీతంగా పెంచిన మద్యం ధరలు.. ఆఖరికి తిరుపతి(Rooms in Tirupati)లో దైవ దర్శనానికి వెళ్లే భక్తులు కూడా చేతి చమురు వదిలించుకోవాల్సిందే. ఒక్క రోజుకు ఒక గదికి 150 రూపాయలు ఉన్న అద్దె ఇప్పుడు 17వందలు. రూ.200 ఉన్న పెద్ద గది అద్దె ఇప్పుడు 2,200కు పెంచడం నిజం కాదా?
ముఖ్యమంత్రి జగన్‌కు ముగ్గురు ముద్దుబిడ్డలు : ఆనం వెంకటరమణారెడ్డి
పెరిగిన దాడుల సంస్కృతి : 'ఒక్క అవకాశం' నినాదం.. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. కీలక పదవులన్నీ ఒక్క వర్గానికే పరిమితం చేశారు. తననే నమ్ముకుని, దివంగత వైఎస్సార్‌పై అభిమానంతో పార్టీ ఆవిర్భావం నుంచి తనవెంటే కలిసి నడిచిన ఏ ఒక్కరికీ సముచిత గౌరవం ఇవ్వలేదు. తాడేపల్లి ప్యాలెస్‌లో 'ఆ నలుగురి'కి తప్ప మరొకరికి ప్రవేశం కూడా కల్పించలేదు. కోడి కత్తి కేసు, గ్రామాలకు విస్తరించిన ఫ్యాక్షన్ దాడులు, హతమార్చి డెడ్ బాడీలను డోర్ డెలివరీ ఇచ్చేదాకా పెరిగిపోయిన దళితులపై దాడుల సంస్కృతి దాచితే దాగేనా?
చర్చకు సిద్ధం అంటున్న టీడీపీ : 99 శాతం హామీలు జగన్ రెడ్డి ఎక్కడ, ఎప్పుడు నెరవేర్చారో ప్రజల ముందే తేల్చుకోవడానికి తాము సిద్ధమని టీడీపీ నేతలు సవాల్ చేస్తున్నారు. బహిరంగ చర్చకు ఎప్పుడు, ఎక్కడికి వస్తారో ముఖ్యమంత్రే చెప్పాలంటున్నారు. 730 హామీలు ఇచ్చి 109 మాత్రమే అమలు చేసిన జగన్ 15 శాతం హామీలు అమలు చేసి 85 శాతం ఎగ్గొట్టారని ఆరోపిస్తున్నారు.