YCP leaders obstructing development programs: ప్రజావేదిక ధ్వంసం మొదలు స్థానిక ఎన్నికల్లో అరాచకం, హత్యలు, ప్రతిపక్ష కార్యాలయాలపై దాడులు ఒకటేమిటి, జగన్ లక్షణాలన్నీ ఆ పార్టీ శ్రేణులు పుణికిపుచ్చుకున్నాయి. చంద్రబాబుకు ఎక్కడ పేరు వస్తుందోనని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మాణం చేపట్టిన అమరావతిని, పోలవరాన్ని సైతం జగన్ పక్కన పెట్టేశాడు. అదే పంథాను వైసీపీ శ్రేణులు అనుసరిస్తున్నాయి. ప్రభుత్వం పట్టించుకోకున్నా సొంత నిధులతో చేపట్టిన పనులను సైతం అడ్డుకుంటున్నారు.
అమ్మ పెట్టదు అడుక్కు తిననివ్వదన్నట్లు రాష్ట్రాన్ని వారు అభివృద్ధి చేయరు, ఎవరైనా కాస్త సాయం చేస్తున్నా ఊరుకోరు. పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన ఆర్థిక సంఘం నిధులు మళ్లించి గ్రామీణాభివృద్ధికి జగన్ ప్రభుత్వం ద్రోహం చేసింది. అధ్వానమైన రహదారులు, మురుగు కాలువలు, తాగునీరు ఇలా అనేక సమస్యలతో ప్రజలను సీఎం జగన్ కష్టాల్లోకి నెట్టేశారు. వీరి బాధలు చూసిన ప్రతిపక్ష తెలుగుదేశం నేతలు, కొంతమంది వ్యక్తులు ఏదైనా ఊరికి సాయం చేద్దామని ముందుకొస్తే, స్థానిక వైసీపీ నాయకులు అడ్డుకుంటున్నారు. ఎక్కడ వారికి పేరు వస్తుందేమోనని అరాచకం సృష్టిస్తున్నారు. వేసవి ప్రారంభంతోనే ప్రజలు తాగునీటికి అల్లాడుతున్నారు. దాహాం కేకలతో మహిళలు బిందెలు పట్టుకుని రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నా, ప్రభుత్వంలో చలనం లేదు. మురుగు కాల్వలు పూడికి తీయక దోమలతో ప్రజలు అవస్థులుపడుతున్నారు. ప్రజల కష్టాలు చూసి తెలుగుదేశం సర్పంచులు, ఆ పార్టీ నేతలు, సానుభూతిపరులు ముందుకొస్తున్నారు. దీంతో వారిపై స్థానిక వైపాకా నేతలు దౌర్జన్యానికి దిగుతున్నారు. ప్రతిపక్షానికి ఎక్కడ మంచిపేరు వస్తుందేమోనని చేసిన పనులను తొలగించడం విశేషం.
రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ ఎంపీల్యాడ్స్ నుంచి ఇచ్చిన 5 లక్షల నిధులతో వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ మండలంలో చేపట్టిన ఆర్వో ప్లాంట్ల ఏర్పాటు చేయనీయకుండా వైసీపీ మహిళా నేతలు అడ్డుకున్నారు. ఐదు ఆర్వో ప్లాంట్ల నిర్మాణాన్ని అడ్డుకుని, కట్టిన గోడలను కూల్చేశారు. పైగా తనపై దౌర్జన్యం చేశారని సేవ చేయటానికి వచ్చినవారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్న స్థలాన్ని కబ్జా చేయడానికే మహిళా నేత ఈ దౌర్జన్యానికి పాల్పడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా కొమడవోలు, చొదిమెళ్ల జగనన్న లేఅవుట్లలోని ఆరువేల ఇళ్ల పునాదుల్లో మెరక చేసేందుకు పేదలు దగ్గర్లోనే మట్టి తవ్వకాలు చేపట్టారు. వీటికి కలెక్టర్ కూడా అనుమతి ఇచ్చారు. అయినా ఆ తవ్వకాలను ఆపేయాల్సిందేనని వైసీపీ నేతలు గొడవ చేశారు. ఒక్కో మట్టి లారీకి 500 చొప్పున కప్పం కట్టాలని హుకుం జారీచేశారు.
అనంతపురం జిల్లా లేపాక్షి మండలంలో వర్షాలకు దెబ్బతిన్న బయన్నపల్లి కల్వర్టుని సొంత నిధులతో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పునర్నిర్మించే పనులను వైసీపీ నేతలు అడ్డుకున్నారు. తమ ఆధ్వర్యంలోనే కల్వర్టుని పునర్నిర్మిస్తామని అప్పటివరకు వేచి ఉండాల్సిందేనన్నారు. ప్రకాశం జిల్లా రావెళ్లవారిపాలెం కస్తూర్బా పాఠశాల అభివృద్ధి చేసే పనుల టెండర్ రాలేదన్న అక్కసుతో వైసీపీ నాయకులు అడ్డంకులు సృష్టించారు. 95 లక్షల పనులను పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రుల కమిటీ ఆధ్వర్యంలో చేయించాలని అధికారులు నిర్ణయించారు. పనుల కోసం ఒత్తిడి చేసిన వైసీపీ నేతల పన్నాగం ఫలించకపోవడంతో అవరోధం కలిగించారు. మెటీరియల్ పాఠశాల వద్దకు రాకుండా రహదారిని తవ్వించేశారు. మరో రెండు చోట్ల రహదారులకు అడ్డంగా మట్టి కుప్పలు పొసి అడ్డంకులు సృష్టించారు.
సత్యసాయి జిల్లా ఉప్పరపల్లి ఎస్సీ కాలనీలో సిమెంట్ రహదారి ఏర్పాటుకు ఎమ్మెల్యే బాలకృష్ణ విజ్ఞప్తిపై లోక్‌సభ సభ్యుడు కేశినేని నాని ఎంపీ ల్యాడ్స్ ఆరున్నర లక్షలు కేటాయించారు. రోడ్డు నిర్మాణం పూర్తయ్యాక మిగిలిన నిధులతో గుత్తేదారు నాయనపల్లి ఎస్సీ కాలనీ సప్లమ్మ దేవాలయం వద్ద సిమెంట్ రహదారి నిర్మాణం చేపట్టగా వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మా పాలనలో రోడ్డు వేయడానికి మీరెవరంటూ గుత్తేదారుని దూషించడంతో మనస్తాపానికి గురైన ఆయన వేసిన రోడ్డుని కొన్ని రోజుల్లోనే తొలగించారు. అనంతపురం జిల్లా నుసికొట్టాలలో రోడ్డు అధ్వానంగా ఉందని స్థానికులు తెలుగుదేశం నేత సురేంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ఆయన తన సొంత నిధులతో జేసీబీలతో ముళ్ల చెట్లను తొలగించి గుంతల్లో మట్టి వేయించారు. అధికారులను రంగంలోకి దించి వైసీపీ నేతలు ఆ పనులకు ఆటంకం సృష్టించారు. ప్రకాశం జిల్లా మారెళ్లలో పంచాయతీ నిధులతో సిమెంట్ రోడ్లు, కాలువలు నిర్మించేందుకు సర్పంచ్ చేసిన ప్రయత్నాలను వైసీపీ నాయకులు ముందుకు సాగనివ్వలేదు.