Vigilance Department Actions Against YSRCP Leader Frauds: గుంటూరు జిల్లా పేరేచర్లలో పేదల ఇళ్ల నిర్మాణం పేరిట రాక్రీట్ సంస్థ చేసిన మోసంపై విజిలెన్స్ విభాగం చర్యలకు ఉపక్రమించింది. పేరేచర్లలోని జగనన్న కాలనీలో 5,451 ఇళ్ల నిర్మాణానికి రాక్రీట్ సంస్థకు అనుమతి ఇచ్చారు. అయితే నిర్మాణాలు చేయకుండానే బిల్లులు చేసుకున్నట్లు తేలింది. గుత్తేదారు రూ.20 కోట్ల వరకు బిల్లులు పెట్టగా ఇందులో రూ. 16 కోట్లు చెల్లించేశారు. ఇందులో దాదాపుగా రూ. 2.24 కోట్ల బిల్లులకు తప్పుడు ఫొటోలు పెట్టి డబ్బులు తీసుకున్నట్లు తేలింది.
రాక్రీట్ సంస్థ వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి కుటుంబానికి చెందినది. అప్పటి సీఎం జగన్‌తో ఉన్న సాన్నిహిత్యంతో ఇళ్ల నిర్మాణం కాంట్రాక్ట్ పొందారు. ఇళ్ల నిర్మాణం మరీ నాసిరకంగా చేపట్టారనే ఆరోపణలు ఉన్నాయి. మరికొన్ని ప్రారంభించకుండానే బిల్లులు చేసుకున్నారు. ఈ వ్యవహారంపై కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. రాష్ట్రంలో 9 చోట్ల ఇలాగే కాంట్రాక్ట్ తీసుకుని మోసం చేసినట్లు తేలింది. పేరేచర్ల జగనన్న కాలనీలో దస్త్రాల్లో చూపించిన లెక్కలకు క్షేత్రస్థాయి వాస్తవాలకు అసలు పొంతనే లేదు. ఈ కాలనీలో వందలాది స్థలాలు ఇప్పటికీ ఖాళీగానే ఉన్నాయి.
అప్పుడు అధికారమే అండగా చెలరేగిపోయిన రాక్రీట్ సంస్థ ఆడిందే ఆటగా పెత్తనం సాగించి, ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండానే బిల్లులు నొక్కేసింది. ఈ అక్రమాలకు సహకరించిన గృహ నిర్మాణశాఖ సిబ్బంది కూడా ఇరుక్కుపోయారు. మొత్తం 46మంది అధికారులు, ఉద్యోగులకు విజిలెన్స్ విభాగం చర్యలకు సిఫార్సు చేసింది. వీరిలో గృహ నిర్మాణశాఖ అధికారులతోపాటు గుంటూరు నగరపాలకసంస్థలోని సచివాలయ ఎమినిటీస్ సెక్రటరీలు ఉన్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు హడావుడిగా పనులు చేపట్టి బిల్లులు చేసుకున్నట్లు తేలింది. తమపై ఒత్తిడి తెచ్చి బిల్లులు చేయించున్నారని కొందరు ఉద్యోగులు విజిలెన్స్ అధికారులకు వాంగ్మూలం ఇచ్చారు.
అప్పటి అధికార పక్ష ఎమ్మెల్యేకు చెందిన సంస్థ కావడంతో ఏమైనా చేస్తారన్న భయంతోనే బిల్లులు చెల్లించినట్టు కొందరు ఉద్యోగులు అంగీకరించారు. కొన్ని ఇళ్ల పునాదులు తవ్వితే గోడలు నిర్మించామని, గోడల దశలో ఉంటే స్లాబ్ వరకూ పనులయ్యాయని ఇలా పొంతన లేకుండా అడ్డగోలుగా రాక్రీట్ సంస్థ బిల్లులు చేజిక్కించుకుంది. ఈ సంస్థ తమను మోసగించిందని లేఔట్ పరిశీలనకు వచ్చిన రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి కొలుసు పార్థసారథికి కొంతమంది లబ్ధిదారులు ఫిర్యాదు చేశారు. ఈ అక్రమాలను చూస్తూ ఊరుకోబోమని వారు తిన్న మొత్తాన్ని రికవరీ చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.
ఎదురుదాడులకు దిగితే తాటతీస్తా - ప్రతి నెలా 'పేదల సేవలో' : సీఎం చంద్రబాబు - CM Chandrababu Tour