TDP Will Join the Union Cabinet : కేంద్ర క్యాబినెట్‌లో 2 మంత్రి పదవులు, మరో రెండు సహాయ మంత్రి పదవులు లభించే వీలుందని తెలుగుదేశం పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎన్‌డీఏ నేతలతో కలిసి రాష్ట్రపతితో భేటీ అయ్యేందుకు గురువారం రాత్రి దిల్లీకి వెళ్లిన చంద్రబాబు మంత్రి పదవులు, శాఖల గురించి ఇవాళ బీజేపీ అగ్రనేతలతో చర్చించనున్నారు. ఈ నెల 9న మోదీతో పాటే తెలుగుదేశం సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశముంది.
కేంద్రమంత్రిగా రామ్మోహన్‌నాయుడు? : తెలుగుదేశం నుంచి లోక్‌సభకు గెలుపొందినవారిలో బలహీనవర్గాలకు చెందినవారు అత్యధికంగా ఆరుగురున్నారు. వీరిలో వరుసగా మూడోసారి గెలుపొందిన శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడి పేరు మంత్రి పదవికి ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన తండ్రి దివంగత నేత ఎర్రన్నాయుడు కేంద్ర మంత్రిగా పని చేశారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. ఆయన మరణం తర్వాత రామ్మోహన్‌నాయుడు రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఆయన బాబాయి అచ్చెన్నాయుడు, మామ బండారు సత్యనారాయణమూర్తి, బావ ఆదిరెడ్డి వాసు తాజా ఎన్నికల్లో శాసనసభకు ఎన్నికయ్యారు. హిందూపురం నుంచి రెండోసారి గెలిచిన పార్థసారధి సీనియర్ అయినప్పటికీ రామ్మోహన్‌నాయుడి వైపు మొగ్గు కనిపిస్తోంది.
TDP to Join NDA Cabinet at Centre : ఎస్సీ వర్గానికి చెందినవారిలో ముగ్గురు ఉండగా అందరూ తొలిసారి ఎన్నికైనవారే. వీరిలో అమలాపురం ఎంపీ హరీష్ మాధుర్ లోక్‌సభ స్పీకర్‌గా పనిచేసిన దివంగత బాలయోగి కుమారుడు. గత ఎన్నికల్లో ఓడిపోయిన హరీష్ ఈసారి విజయం సాధించారు. మిగిలిన ఇద్దరు పదవీ విరమణ చేసిన ఐపీఎస్ అధికారి కృష్ణప్రసాద్, రిటైరైన ఐఆర్ఎస్ అధికారి ప్రసాదరావు. వివిధ సమీకరణాలతో పాటు రాయలసీమ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రసాదరావు వైపు కొంత మొగ్గు ఉండొచ్చన్న భావన పార్టీ వర్గాల్లో ఉంది.
డిప్యూటీ స్పీకర్ పదవి : మిగిలిన రెండు ప్రధాన వర్గాల్లో గుంటూరు, నరసరావుపేట నుంచి గెలుపొందిన పెమ్మసాని చంద్రశేఖర్, లావు శ్రీకృష్ణదేవరాయలు నుంచి ఒకరు, నెల్లూరు, నంద్యాల నుంచి విజయం సాధించిన వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, బైరెడ్డి శబరి నుంచి మరొకరిని పరిశీలించే అవకాశముందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. నాలుగు పదవులు కాకున్నా డిప్యూటీ స్పీకర్ వంటి పదవి తీసుకోవాల్సి వచ్చినా సమీకరణాలు కొంతమేర మారతాయి.
జనసేన నుంచి ఇద్దరు లోక్‌సభ సభ్యులుండగా వారిలో మచిలీపట్నం నుంచి గెలుపొందిన బాలశౌరి సీనియర్. మూడోసారి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జనసేనకు అవకాశమొస్తే సహజంగానే బాలశౌరి పేరు పరిశీలనకొస్తుంది. బీజేపీ నుంచి ముగ్గురు గెలుపొందగా వీరిలో పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలైన కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి, గతంలో రెండుసార్లు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించిన సీఎం రమేశ్ పేర్లు పరిశీలనలో ఉంటాయి.