TDP Leaders Complaint to CS on Irregularities in Fibernet : ఫైబర్ నెట్ అక్రమాలపై సీఐడీ , విజిలెన్స్ విచారణ జరిపించాలని టీడీపీ నేతలు కోరారు. ఫైబర్ నెట్ అక్రమాలపై సీఎస్ నీరబ్ కుమార్‌కు (CS Nirab Kumar Prasad) టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి, అధికార ప్రతినిధి మద్దిపట్ల సూర్యప్రకాష్ ఫిర్యాదు చేశారు. ఫైబర్ నెట్ మాజీ ఎండీ మధుసూదన్ రెడ్డి సహా ఆ సంస్ధలో పని చేసిన మరో ముగ్గురిని విచారించాలని ఎమ్మెల్సీలు కోరారు. గత ప్రభుత్వ హాయాంలో ఫైబర్ నెట్‌తో ఒప్పందం కుదుర్చుకున్న గ్రీన్ లాంత్రన్ సంస్థ ఎండీ శేషిరెడ్డిని విచారించాలని కోరారు. 2019-24 మధ్య కాలంలో ఫైబర్ నెట్ సంస్థలో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ఫైబర్ నెట్ అక్రమాలపై సీఐడీ, విజిలెన్స్ విచారణ జరిపించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
కోట్లాది రూపాయల ప్రజాధనం పక్కదారి: ప్రభుత్వానికి రావాల్సిన వందల కోట్ల రూపాయల ప్రజాధనం ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిందని ఎమ్మెల్సీలు ఆరోపించారు. బిల్లింగ్ సాఫ్ట్ వేర్లో గోల్మాల్ చేసి ముంబైకి చెందిన బినామీ సంస్థలకు తరలించారని మండిపడ్డారు. ఫైబర్ నెట్ పేరుతో కోట్లు దండుకున్న మధుసూదన్ రెడ్డి దేశవ్యాప్తంగా బినామీలతో ఆస్తులు కూడగట్టుకున్నారని అన్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు జీతాలు చెల్లించడానికి ఈ సంస్థను ఉపయోగించుకున్నారని విమర్శించారు. జీతాల పేరుతో కోట్లాది రూపాయల మేర ప్రజాధనం పక్కదారి పట్టిందని దుయ్యబట్టారు. ఈ కుంభకోణంలో వాస్తవాలు వెలుగులోకి రావాలంటే సీఐడీ లేదా విజిలెన్స్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
AP FiberNet Scam: జగన్ అండతో ఏపీ ఫైబర్‌నెట్ మాజీ ఎండీ హోదాలో మధుసూదన్‌రెడ్డి సొంత జాగీరులా సంస్థ ఆదాయానికి లెక్కాపత్రం లేకుండా పంచిపెట్టారు. సంస్థ అవసరానికి మించి నియామకాలు చేయడమే కాకుండా, బంధువులకు కీలక పోస్టులు, కాంట్రాక్టులు ఇచ్చారు. ఇవన్నీ ఒకెత్తయితే ఎన్నికలకు కొన్ని నెలల ముందు, సంస్థ పేరిట తెచ్చిన అప్పును లెక్కాపత్రం లేకుండా పంచిపెట్టడం చర్చనీయాంశంగా మారింది.