TDP Leaders Comments at Jayaho BC Public Meeting: బీసీలు అంటేనే భరోసా, బాధ్యత, భవిష్యత్తు అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) పేర్కొన్నారు. బీసీలంటే బలహీనవర్గాలు కాదని, బలమైన వర్గాలుగా చేసింది ఎన్టీఆర్ అని తెలిపారు. మంగళగిరిలో జరిగిన జయహో బీసీ సభలో లోకేశ్ మాట్లాడారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక బీసీలను ఎంతగానో ప్రోత్సహించారని అన్నారు.
టీడీపీ హయాంలో బీసీలకు సాధికార కమిటీలు ఏర్పాటు చేశామన్న లోకేశ్, బీసీల్లో యువ నాయకత్వాన్ని పోత్సహిస్తామని స్పష్టం చేశారు. బీసీలకు స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్ ఇచ్చామన్న లోకేశ్, ఆదరణ పథకానికి రూ. వెయ్యి కోట్లు కేటాయించామని గుర్తు చేశారు. బీసీలకు కేంద్రంలో ప్రత్యేకశాఖ ఉండాలని తీర్మానం చేసింది టీడీపీనే అని తెలిపారు.
మా తలరాతలు మేమే రాసుకుంటాం- టీడీపీ, జనసేన బీసీ డిక్లరేషన్ ప్రణాళిక రూపాంతరం
జగన్ వచ్చాక స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ తగ్గించారని మండిపడ్డారు. వైసీపీ హయాంలో బీసీ సబ్‌ప్లాన్ నిధులు రూ.75 వేల కోట్లను పక్కదారి పట్టించారన్న లోకేశ్, వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆప్కాబ్‌ను నిర్వీర్యం చేసిందని ధ్వజమెత్తారు. బీసీ నేతలపై అనేక కేసులు పెట్టారని, వేధిస్తున్నారని విమర్శించారు. బీసీలంటే జగన్‌కు చిన్నచూపు అని, అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వరని ఆరోపించారు. బీసీలకు రాష్ట్రంలో, దేశంలో అనేక పదవులు ఇచ్చింది టీడీపీనే అని లోకేశ్ పేర్కొన్నారు.
బీసీల పట్ల టీడీపీకి చిత్తశుద్ధి ఉందని, జగన్ పాలనలో బీసీలకు అడుగడుగునా అన్యాయం జరిగిందని అన్నారు. తాను పాదయాత్రలో బీసీల సమస్యలు తెలుసుకున్నానని లోకేశ్ తెలిపారు. చేనేతలకు ఇచ్చే అనేక పథకాలను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందన్న లోకేశ్, తాను ఓడినా మంగళగిరిలోనే ఉన్నానని, అనేక కార్యక్రమాలు చేపట్టానన్నారు. మంగళగిరికి ఇచ్చిన హామీలేవీ వైసీపీ నిలబెట్టుకోలేదన్న లోకేశ్, తాను గెలిచాక మంగళగిరి ప్రజల సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
జయహో బీసీ బహిరంగ సభ - "బీసీ"లకు భరోసాగా డిక్లరేషన్ ప్రకటన!
Kinjarapu Atchannaidu Comments: స్వాతంత్య్రం వచ్చాక 35 ఏళ్లపాటు బీసీలు పల్లకీలు మోశారని, ఎన్టీఆర్ వచ్చాక బీసీలకు అన్ని రకాల అవకాశాలు వచ్చాయని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. బీసీలు ఇవాళ సామాజిక, రాజకీయ, ఆర్థికంగా నిలబడ్డారంటే టీడీపీ వల్లే అని స్పష్టం చేశారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా బీసీలు టీడీపీ వెంటే ఉన్నారన్న అచ్చెన్న, వైసీపీ పరిపాలనలో బీసీలు అనేక కష్టాలు అనుభవిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ హయాంలో ఒక్క రూపాయి అవినీతి చేశామని నిరూపిస్తే దేనికైనా సిద్ధమని అచ్చెన్న సవాల్ విసిరారు. స్వేచ్ఛగా మాట్లాడే హక్కు కూడా బీసీ నేతలకు లేదా అని ప్రశ్నించారు.
ఈ ఐదేళ్లలో బీసీలకు మేలు చేసిన ఒక్క కార్యక్రమం అయినా ఉందా అని నిలదీశారు. వైసీపీ హయాంలో బీసీలకు ఇచ్చిన భూములు, భవనాలను వైసీపీ నేతలు దోచుకున్నారని విమర్శించారు. టీడీపీ హయాంలో కులవృత్తులకు ఆదరణ పథకం కింద పనిముట్లు ఇచ్చామని, తాము ఇచ్చిన ఆదరణ పరికరాలు గిడ్డంగుల్లో తుప్పు పడుతున్నాయని మండిపడ్డారు. ఆదరణ పనిముట్లను బీసీలకు ఇచ్చేందుకూ జగన్‌కు మనసు రాలేదని ధ్వజమెత్తారు.