SC on MLA Pinnelli Case : ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై సుప్రీంకోర్టు ఆంక్షలు విధించింది. ఈ నెల 4న జరిగే ఎన్నికల కౌంటింగ్ కేంద్రంలోకి పిన్నెల్లి వెళ్లొద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. మాచర్లలో ఈవీఎం ధ్వంసం ఘటనలో అడ్డుకునేందుకు యత్నించిన నంబూరి శేషగిరిరావు తనకు ప్రాణభయం ఉందని, పిన్నెల్లిని అరెస్టు చేయాలని ఆశ్రయించిన నేపథ్యంలో కోర్టు ఆదేశాలు ఇచ్చింది.
ఈవీఎం ధ్వంసం, హత్యాయత్నం కేసులో పిన్నెల్లిని అరెస్టు చేయాలని, అరెస్టుకు హైకోర్టు ఇచ్చిన వెసులుబాటు ఎత్తివేయాలని నంబూరి శేషగిరిరావు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈనెల 6 వరకు అరెస్టు చేయవద్దన్న వెసులుబాటు ఎత్తివేయాలని పిటిషన్ దాఖలు చేయగా, ఆయన కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లొద్దని సుప్రీం ఆదేశించింది.
పిన్నెలి రామకృష్ణా రెడ్డికి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల ద్వారా ఇచ్చిన రక్షణ పైన నంబూరి శంకర రావు దాఖలు చేసిన ఎస్ఎల్పి పైన ఈ రోజు సుప్రీంకోర్టులో జస్టిస్ అరవింద్ కుమార్, సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం తప్పు పట్టింది. ఇది న్యాయాన్ని అవహేళన చెయ్యటమే అని మండిపడింది. సీనియర్ న్యాయవాది ఆదినారాయణ మరియు జవ్వాజి శరత్‌లు వాదిస్తూ ఎలక్షన్ కమిషన్‌కు సంబంధించిన వెబ్ కాస్టింగ్ వీడియోలను ధర్మాసనం ముందు ప్రదర్శించారు. అది చూసి రామకృష్ణా రెడ్డికి సంబంధించిన న్యాయవాదిని దీనికి ఏమి సమాధానం చెప్పగలవు అని అన్నారు. దాని గురించి తానేమీ అనదలుచుకోలేదు అని అన్న తరువాత కోర్టు జడ్జిమెంట్ పాస్ చేసింది.
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కౌంటింగ్‌కు సంబందించిన పరిసరాలలోకి రాకూడదని, ఆ విధంగా ఒప్పుకుంటున్నట్టు అఫిడవిట్ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులిచ్చింది. తదుపరి విచారణలో అన్ని విషయాలు పరిగణనలోకి తీసుకుని మాత్రమే హైకోర్టు తగు ఉత్తర్వులు ఇవ్వాలని పేర్కొంది.
మే 13న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మాచర్లలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రం (202)లోకి వెళ్లి, అక్కడ ఈవీఎం ఎత్తి నేలకేసి కొట్టడంతోపాటు వీవీ ప్యాట్ మిషన్‌ను ధ్వంసం చేశారు. ఈ ఘటనతో ఒక్కసారి పోలింగ్ సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. అయితే అక్కడే ఉన్న విపక్ష పార్టీ పోలింగ్ ఏజెంట్, టీడీపీ నేత నంబుల శేషగిరిరావుపై ఒక్క ఉదుటున దూసుకెళ్లి వారిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఈవీఎం ధ్వంసం చేసిన ఎమ్మెల్యేపైనా ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ దృశ్యాలన్నీ పోలీంగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.
ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన అనంతరం అడ్డుకోబోయిన టీడీపీ నేత నంబుల శేషగిరిరావుపై వైఎస్సార్సీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. గ్రామస్థులు ఎదురుతిరగడంతో అనుచరులతో సహా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అక్కడ నుంచి పరారయ్యారు. సంబంధిత వీడియోలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. రెంటచింతల మండలంలోని పాల్వాయిగేటు టీడీపీకి గట్టి పట్టున్న గ్రామం. పోలింగ్ రోజున అక్కడ ప్రతిపక్షానికి ఎక్కువ ఓట్లు పడుతున్నాయన్న ఉక్రోషంతో ఎమ్మెల్యే తన అనుచరగణాన్ని వెంటేసుకుని బూత్‌లోకి దూసుకెళ్లారు.
నంబూరి శేషగిరిరావు తనకు ప్రాణభయం ఉందని, పిన్నెల్లిని అరెస్టు చేయాలని ఆశ్రయించిన నేపథ్యంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై సుప్రీంకోర్టు ఆంక్షలు విధించింది. ఈ నెల 4న జరిగే ఎన్నికల కౌంటింగ్ కేంద్రంలోకి పిన్నెల్లి వెళ్లొద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది.