Supreme Court Granted Bail to MLC Kavitha : దిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరైంది. ఆమె బెయిల్ పిటిషన్‌పై విచారించిన జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ విశ్వనాథన్ ద్విసభ్య ధర్మాసనం, ఈడీ, సీబీఐ కేసులో బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా సీబీఐ తుది ఛార్జిషీట్ దాఖలు చేసిందని, ఈడీ దర్యాప్తు పూర్తి చేసిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. నిందితురాలు జైలులో ఉండాల్సిన అవసరం లేదని, అందుకే కవితకు బెయిల్ మంజూరు చేస్తున్నామని స్పష్టం చేసింది. మహిళగా కూడా పరిగణించాల్సిన అవసరం ఉందని వివరించింది.
అంతకుముందు కవిత తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గి సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. ఈడీ కేసులో కవిత 5 నెలలుగా, సీబీఐ కేసులో 4 నెలలుగా జైలులో ఉన్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కేసులో 493 మంది సాక్షులను విచారించారని, ఒక మహిళగా కవిత బెయిల్‌కు అర్హురాలని తెలిపారు. కవిత మాజీ ఎంపీ అని, ఆమె ఎక్కడికీ వెళ్లరని చెప్పారు. రూ.100 కోట్ల ముడుపుల ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదన్న ముకుల్ రోహత్గి, కవిత నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సొమ్ము రికవరీ చేయలేదన్నారు. ఇదే కేసులో మనీశ్ సిసోదియాకు బెయిల్ మంజూరైందని, సిసోదియాకు వర్తించిన నిబంధనలే కవితకూ వర్తిస్తాయని ధర్మాసనానికి వివరించారు.
డేటా ఫార్మాట్ చేయడం అసాధారణం : అనంతరం ఈడీ తరఫున వాదనలు వినిపించిన ఏఎస్‌జీ, ఎమ్మెల్సీ కవిత తరచూ ఫోన్లు మార్చారని, ఉద్దేశపూర్వకంగానే ఫోన్లలోని డేటాను పూర్తిగా తొలగించారని కోర్టుకు తెలిపారు. ఫార్మాట్ చేసిన ఫోన్లను ఇంట్లో పని మనుషులకు ఇచ్చారని పేర్కొన్నారు. ఫోన్‌లోని సందేశాలను తొలగిస్తే తప్పేంటని సుప్రీంకోర్టు న్యాయమూర్తి ప్రశ్నించగా, మెసేజ్‌లను కాదు, పూర్తిగా డేటాను ఫార్మాట్ చేశారని, సెల్‌ఫోన్ డేటాను పూర్తిగా ఫార్మాట్ చేయడం అసాధారణమని వివరించారు. ఇరువైపుల సుదీర్ఘంగా సాగిన వాదనల అనంతరం సుప్రీంకోర్టు ధర్మాసనం, కవితకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో ఈడీ అధికారులు కవితను మార్చి 15న అరెస్ట్ చేయగా, అప్పటి నుంచి దాదాపు 5 నెలలకు పైగా ఆమె తిహాడ్ జైలులోనే ఉన్నారు.
నా కుమార్తె జైళ్లో ఉంటే కన్న తండ్రిగా బాధ ఉండదా? : కేసీఆర్ - BRSLP Meeting Today 2024