Speaker notices to TDP and YSRCP rebel MLAs : తెలుగుదేశం రెబెల్ ఎమ్మెల్యేలను విచారణకు రావాలని స్పీకర్ నోటీసులు జారీ చేశారు. అనర్హత పిటిషన్లపై విచారణకు ఈ నెల 29వ తేదీన స్పీకర్ కార్యాలయంలో హాజరు కావాలని సూచించారు. ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, మధ్యాహ్నం 2:45 గంటలకు ఎమ్మెల్యేలు విచారణకు రావాలని స్పీకర్ కార్యాలయం నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యేలు కరణం బలరాం, మద్దాలి గిరిధర్, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేశ్ స్వయంగా వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశాల్లో స్పష్టం చేసింది. తెలుగుదేశం శాసనసభ పక్ష విప్ డోలా బాలవీరాంజనేయ స్వామి ఇచ్చిన అనర్హత పిటిషన్ పై స్పీకర్ కార్యాలయం ఈ మేరకు స్పందించింది.
టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్యేలు - పార్టీ కండువా కప్పి స్వాగతించిన చంద్రబాబు
టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా ఆమోదంతో ఏపీలో రాజకీయం మరో మలుపు తీసుకుంది. రాజ్యసభ ఎన్నికల్లో తమ అభ్యర్థిని నిలిపి గెలిపించుకోవడమే లక్ష్యంగా టీడీపీ భావిస్తున్న నేపథ్యంలో సంఖ్యా బలం తగ్గించేలా రాజీనామా ఆమోదించారనే వాదన వినిపిస్తోంది. ఇదిలా ఉండగా, టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలపైనా చర్యలు తీసుకోవాల్సిందిగా టీడీపీ విప్ లేఖ రాయగా స్పీకర్ కార్యాలయం స్పందించింది. మరోవైపు వైసీపీ ఫిర్యాదుతో ఇరు పార్టీలకు చెందిన 8 మంది ఎమ్మెల్యేలు విచారణకు రావల్సిందిగా నోటీసులు ఇచ్చింది.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు సస్పెన్షన్
ఈ మేరకు ఈ నెల 29న స్పీకర్ కార్యాలయంలో అనర్హత పిటిషన్లపై విచారణ చేపట్టనున్నట్టు పేర్కొంది. జనవరి 29వ తేదీ ఉదయం విచారణకు హాజరు కావాలని వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలకు, అదే రోజు మధ్యాహ్నం విచారణకు రావాలని టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలకు సూచిస్తూ నోటీసుల్లో స్పష్టం చేసింది. టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలైన వారిలో కరణం బలరాం, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేశ్, మద్దాల గిరికి నోటీసులు జారీ అయ్యాయి. వైసీపీ ఎమ్మెల్యేల్లో ఆనం రాంనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవికి నోటీసులు అందాయి. వారంతా స్వయంగా వచ్చి వివరణ ఇవ్వాలని శాసన సభ కార్యదర్శి రామాచార్యులు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో వివరణ ఇవ్వడానికి తమకు 30 రోజులు గడువు కావాలని వైసీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ లేఖ రాశారు.
వైఎస్సార్సీపీలో వన్‌మ్యాన్ షో! అంతా అహం బ్రహ్మాస్మి, తెరపై దింపుడు కళ్లం ప్రయత్నాలు
గతేడాది జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీకి టీడీపీ గట్టి షాక్ ఇచ్చింది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ అనూహ్యంగా విజయం అందుకున్నారు. వైసీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీ అభ్యర్థికి ఓటు వేయడం వల్లే ఆమె విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు ఆనం రాంనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిపై అనర్హత వేటు వేయాలంటూ పార్టీ అధిష్ఠానం ఈ నెల 8న స్పీకర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాలి గిరిధర్, వాసుపల్లి గణేశ్ వైఎస్సార్‌సీపీ తరఫునే పని చేస్తున్నారని, వారిపై అనర్హత వేటు వేయాలని టీడీపీ ఫిర్యాదు చేసింది.
ఆ 22 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు
గడువు కుదరదు 29న రావాల్సిందే : అనర్హత పిటిషన్‌పై విచారణకు తమకు 30 రోజుల గడువు కావాలన్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల విజ్ఞప్తిని స్పీకర్ తిరస్కరించారు. ఈ నెల 29న మధ్యాహ్నం 12 గంటలకు విచారణకు రావాలని స్పీకర్ కార్యాలయం నుంచి నోటీసులు అందుకున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు గడువు కోరారు. నోటీసుతో పాటు పేపర్, వీడియో క్లిప్పింగ్‌లపై నిర్ధరించుకోవాల్సి ఉందని వివరణ ఇచ్చారు. రిప్లై ఇవ్వడానికి 30-60 రోజులు అవసరం ఉందని లేఖలో వెల్లడించారు. కాగా, 30 రోజుల సమయం కుదరదని స్పష్టం చేసిన స్పీకర్ కార్యాలయం, నోటీసులు ఎమ్మెల్యేల వాట్సాప్‌కు పంపామని తెలిపింది.