PCC President YS Sharmila : సార్వత్రిక ఎన్నికల వేళ రాష్ట్రంలో రాజకీయం వాడీ వేడిగా జోరందుకుంది. ఓ వైపు చంద్రబాబు దిల్లీ వెళ్లి రాగా జగన్ సైతం దిల్లీ బాట పట్టనున్నారు. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఇప్పటికే జనసేన కూటమి ప్రచారంలో దూసుకుపోతుండగా మరో వైపు అధికార పార్టీ పోటా పోటీగా ప్రచారం కొనసాగిస్తోంది. కాంగ్రెస్ తరుపున ఆ పార్టీ రాష్ట్ర అధినేత్రి షర్మిల రంగంలోకి దిగి బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈ నెల 11 వరకు పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. బుధవారం బాపట్లలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న షర్మిల ఇవాళ తెనాలిలో పాల్గొన్నారు.
రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి దూకుడు పెంచారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అనతి కాలంలోనే ప్రజల్లో దూసుకుపోతున్న షర్మిల తన సోదరుడు, సీఎం జగన్పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ వైఫల్యాలను జనంలో ఎండగడుతున్నారు. గతంలో ఇచ్చిన హామీలు జగన్ విస్మరించారని గుర్తు చేస్తున్నారు. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో షర్మిల పాల్గొని ప్రసంగించారు.
పీసీసీ చీఫ్ షర్మిల కూడా సిద్ధమే! - జిల్లాల పర్యటన, బహిరంగ సభలు
మద్యం వ్యాపారం చేస్తున్న ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి వస్తే భూ కబ్జాలకు కూడా పాల్పడే అవకాశం ఉందని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియా, భూ కబ్జాలు చేసే చెత్త ప్రభుత్వం మనకు అవసరమా అని ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రంలో మద్యం వల్ల మరణించిన వారి సంఖ్య ఎక్కువగా ఉందని ఆమె ఆరోపించారు. లిక్కర్ బ్రాండ్, పేరు, ధర ప్రభుత్వమే నిర్ణయించి దోపిడీ చేస్తోందని షర్మిల ధ్వజమెత్తారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం వల్ల మరణించేవారు ఎక్కువ అని తెలిపారు. ఏటా జాబ్ క్యాలెండర్ అన్నారు, మాట తప్పారు, ఇది మెగా డీఎస్సీ కాదు, దగా డీఎస్సీ, డీఎస్సీ ప్రకటన ఎన్నికల స్టంట్ అని షర్మిల పేర్కొన్నారు. ఉద్యోగాలు లేక యువత రాష్ట్రం వదిలిపోతున్నారని, చెత్త ఆలోచన ఉన్న ప్రభుత్వం పోతేనే మనం, మన బిడ్డలు, రాష్ట్రం బాగుపడుతుంది అన్నారు.
వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి ప్రజాస్వామ్యం అంటే చిత్తశుద్ధి లేదు: షర్మిల
ఎన్నికల ప్రచారంలో ఎవరెన్ని డబ్బులు ఇచ్చినా తీసుకోండి కానీ, ఓటు మాత్రం ఆలోచించి వేయండి అని సూచించారు. ఎవరైతే ప్రత్యేక హోదా తీసుకొస్తామని గతంలో మాట్లాడారో వారిని నిలదీయండి అని పిలుపునిచ్చారు.
లిక్కర్ బిజినెస్ చేస్తున్న సర్కారు భవిష్యత్లో భూ కబ్జాలకు కూడా పాల్పడుతుందన్నారు. మిగతా రాష్ట్రాల్లో అమ్ముకునే మద్యం సరుకే ఇక్కడ కూడా అమ్ముతున్నా అధిక ధరలకు విక్రయిస్తున్నారని తెలిపారు. భూమ్ భూమ్, స్పెషల్ స్టేటస్, క్యాపిటల్ ఇలా అన్ని బ్రాండ్లను క్యాష్ చేసుకుంటోందని షర్మిల మండిపడ్డారు. ఏపీలో మద్యం నాణ్యత లేక ఇతర రాష్ట్రాలతో పోలిస్తే 25శాతం మంది అదనంగా చనిపోతున్నారని షర్మిల వెల్లడించారు.
సీఎం జగన్, చంద్రబాబుకు షర్మిల లేఖ - అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్