Scrutiny of Nominations in Telangana : రాష్ట్రంలోని లోక్‌సభ నియోజకవర్గాలకు దాఖలైన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ పూర్తయింది. మొత్తం 17 స్థానాలకు 893 మంది నామినేషన్లు దాఖలు చేయగా, 267 మంది అభ్యర్థుల పత్రాలను తిరస్కరించిన అధికారులు, 626 మందివి నిబంధనల మేరకు ఉన్నట్లు ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థుల నామినేషన్ల దాఖలు గడువు గురువారంతో ముగిసింది.
అభ్యర్థులు, వారి ప్రతినిధుల సమక్షంలో శుక్రవారం అధికారులు చేపట్టిన పరిశీలన, కొన్ని నియోజకవర్గాల్లో పొద్దుపోయేంత వరకు సాగింది. నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో మాజీ ఎంపీ మందా జగన్నాథం నామినేషన్ తిరస్కరణకు గురైంది. ఆయన బీఎస్పీ నుంచి వేసినా, బీఫాం సమర్పించకపోవడంతో తిరస్కరించారు. అక్కడ మరో అభ్యర్థి బీఎస్పీ బీఫాంను సమర్పించారు.
MP Nominations in Telangana : వరంగల్ స్థానానికి మాజీ మంత్రి, సినీ నటుడు బాబూ మోహన్ స్వతంత్ర అభ్యర్థిగా దాఖలు చేసిన పత్రాలను తిరస్కరించారు. 10 మంది ప్రతిపాదకుల పేర్లు ప్రస్తావించినప్పటికీ, అందులో ఎవరూ సంతకాలు చేయకపోవడం, అఫిడవిట్‌లో నిర్దిష్ట ఖాళీలు ఉన్నాయని ఆర్వో తెలిపారు. ఆదిలాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన గోడం నగేశ్ దాఖలు చేసిన అఫిడవిట్‌పై పలు అభ్యంతరాలు వ్యక్తమైనా, ఆర్వో మాత్రం నామినేషన్‌ను ఆమోదించారు. పరిశీలన పూర్తి కావటంతో ఉపసంహరణకు సోమవారం వరకు గడువు ఉంది.
మాజీ ఎంపీ మందా జగన్నాథం నామినేషన్ తిరస్కరణ : మాజీ ఎంపీ, బీఎస్పీ పార్టీ అభ్యర్థి మందా జగన్నాథం నామినేషన్‌ను అధికారులు తిరస్కరించారు. ఇటీవల మాయావతి సమక్షంలో బీఎస్పీ పార్టీలో చేరిన మందా జగన్నాథం, గతంలో ఎంపీగా పని చేసిన సమయంలో పార్లమెంటు నుంచి నో డ్యూస్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంది. కానీ నో డ్యూ సర్టిఫికెట్ గడువులోగా తీసుకురాలేదు.
అయినప్పటికీ పార్టీ బీఫామ్ లేకుండా ఈ నెల 25న బీఎస్పీ పార్టీ తరఫు నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ బీఫామ్ లేకుండా నామినేషన్ వేసిన మందా జగన్నాథం స్థానంలో ఆ పార్టీ వారు మరో అభ్యర్థి బిసమొల్ల యూసఫ్‌కు బీఎస్పీ పార్టీ బీఫామ్ ఇచ్చి నామినేషన్ వేయించారు. దీంతో మందా జగన్నాథం పేరు తిరస్కరణకు గురైంది. చివరకు బీఎస్పీ పార్టీ అభ్యర్థిగా బిసమొల్ల యూసఫ్‌ను అధికారులు ధ్రువీకరించారు. మరోవైపు ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేసిన మందా జగన్నాథం అభ్యర్థిత్వానికి 10 మంది బలపరచాలి. కానీ ఆయనకు కేవలం 5 మంది మాత్రమే బలపరిచారు. ఈ నెల 5న నామినేషన్ వేసిన మందా జగన్నాథం ఇండిపెండెంట్‌గా కూడా అర్హత సాధించలేకపోయారు. మందా జగన్నాథం నామినేషన్ తిరస్కరణకు గురైందని జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి ఉదయ్ కుమార్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.