Pulivarthi Allegations on Chevireddy: చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ చేయడంతో వైఎస్సార్సీపీ ఆటలు సాగలేదని, చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి పులివర్తి నాని అన్నారు. ఆ అక్కసుతోనే తనపై దాడులు చేశారని ఆరోపించారు. తిరుపతిలోని పద్మావతి మహిళా వర్సిటీలో స్ట్రాంగ్ రూమ్ పరిశీలనకు వెళ్లి తిరిగి వస్తుండగా, ఇటీవల నానిపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ నెల 23న ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన ఆయన ఇవాళ తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.
పోలింగ్ రోజు, ఆ తర్వాతి రోజుల్లో నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో చోటు చేసుకున్న ఘటనలకు సంబంధించిన పులివర్తి నాని వీడియోలను ప్రదర్శించారు. 2014 ఎన్నికల నుంచీ ఆయన దొంగ ఓట్లతోనే నెట్టుకొస్తున్నారని విమర్శించారు. ఈ ఎన్నికల్లోనూ రిగ్గింగ్ చేసి చంద్రగిరి వైఎస్సార్సీపీ అభ్యర్థి, కుమారుడు రోహిత్‌రెడ్డిని గెలిపించుకునేందుకు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ప్రయత్నించారని ఆరోపించారు. కానీ, వారి ఆటలు సాగలేదని, తాను 2004 నుంచి 2014 వరకు సంపాదించిన ఆస్తుల్ని అమ్ముకొని రాజకీయం చేశానని తెలిపారు. టీడీపీ కార్యకర్తలు, పార్టీ పెద్దల అండదండలతో నాయకుడిగా ఎదిగానని, అంతే తప్ప వాళ్లమాదిరి అడ్డదారులు తొక్కలేదని నాని వెల్లడించారు. ‘జగన్ భజన’ చేయలేదు. ఎర్రచందనం మాఫియా నడపలేదు. ఎర్రచందనం స్మగ్లర్లు కొనిచ్చిన కార్లలో తిరగలేదు. భాస్కర్‌రెడ్డి అవినీతి భాగోతాన్ని ఆధారాలతో సహా బయటపెడతానంటూ నాని హెచ్చరించారు.
నాపై దాడి చేసిన తర్వాతే నా కుటుంబ సభ్యులు స్పందించారు. నన్ను హతమారుస్తానని హెచ్చరించిన తర్వాతే నా భార్య బయటకొచ్చి మాట్లాడారు. అది కూడా ప్రజా సమస్యలపైన, మీ అవినీతిపైన మాట్లాడారే తప్ప వ్యక్తిగత విమర్శలు చేయలేదు. నా క్వారీలు, ఫ్యాక్టరీలు అక్రమంగా మూయించినా మిమ్మల్ని పన్నెత్తి మాటైనా అనలేదు. నాపై దాడి జరిగిన తర్వాత కార్యకర్తలు అదుపు తప్పుతారనే ఉద్దేశంతో అక్కడే ఉండి పరిస్థితి చక్కబడిన తర్వాత ఆస్పత్రికి వెళ్లాను. కాళ్లు విరగలేదని, డ్రామాలు చేస్తున్నావని అంటున్నావు. ఇది చాలా దారుణం. నీ కోసం పని చేసిన నాయకులకు, ఎంపీటీసీ, జడ్పీటీసీ టికెట్లు ఇచ్చేందుకు వేలం పాట పెట్టి డబ్బులు వసూలు చేసుకున్నావు. ఎప్పుడు ప్రెస్‌మీట్ పెట్టినా, నువ్వు, నీ కొడుకు తప్ప మీ పక్కన ఎవరికైనా స్థానం ఇచ్చారా? మీరా నీతులు చెప్పేది. -పులివర్తి నాని, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి
నాపై దాడి చేసిన వారిని పోలీసులే పట్టుకుంటారని నాని వెల్లడించారు. చట్టం తనపని తాను చేసుకుపోతుందని, ఫలానా వాళ్లు దాడి చేశారని, వాళ్లను అరెస్టు చేయమని చెప్పనని తెలిపారు. ఇప్పటి వరకు అరెస్టయినవారిలో నలుగురికి ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. భాస్కర్‌రెడ్డి, మోహిత్‌రెడ్డి, రఘు, భానుకుమార్‌రెడ్డి తనను చంపాలని చూశారని తెలిపారు. 70 మంది టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. హత్యాయత్నానికి పాల్పడిన వైఎస్సార్సీపీ కార్యకర్తలను వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 4వ తేదీన కౌంటింగ్ సరిగా నిర్వహించేలా చూడాలని ఈ సందర్భంగా పులివర్తి అధికారులను కోరారు.