Pensioners Donated Money Construction of Amaravati : రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారం రావడంతో రాజధానిలో అమరావతి నిర్మాణ పనులకు జీవం వచ్చింది. దీంతో పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రజలు కూడా రాజధానికి తమ వంతుగా విరాళాలు అందిస్తున్నారు. ఇందులో భాగంగా కొందరు తమకు ప్రభుత్వం ఇచ్చే పింఛన్ డబ్బులను అమరావతి నిర్మాణానికి విరాళంగా ఇస్తూ ఉదారత చాటుకున్నారు.
Pension Donated To Amaravati : ఏపీలో సోమవారం నాడు పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కొందరు లబ్ధిదారులు అమరావతి నిర్మాణానికి విరాళాలు అందజేసి తమ ఉదారతను చాటుకున్నారు. ప్రకాశం జిల్లా శంకవరం గ్రామానికి చెందిన చీర్ల మాల్యాద్రి అనే దివ్యాంగుడు తనకు వచ్చిన పింఛన్ సొమ్ముకు రూ.4,000లు కలిపి మొత్తం రూ.10,000లను ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డికి చెక్కు రూపంలో అందజేశారు. అమరావతి పూర్తి అయితే రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుందని మాల్యాద్రి తెలిపారు. రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిని అద్భుతంగా తీర్చిదిద్దుతారన్నారు.
అమరావతి నిర్మాణానికి విరాళాలు : అదేవిధంగా శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం శివానగర్‌కు చెందిన చేనేత కార్మికురాలు బాలనారాయణమ్మ తనకు ఇచ్చిన రూ.7,000లను వృద్ధాప్య పింఛన్‌ను తిరిగి ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చింది. అమరావతి నిర్మాణానికి ఈ సొమ్మును వినియోగించాలని మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు ఆ మొత్తాన్ని అందించింది. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం వెలగలపల్లికి చెందిన నారాయణ రూ.7,000 పింఛను సొమ్ముకు రూ.116 కలిపి రూ.7,116ను ఎమ్మెల్యే సొంగా రోషన్‌కుమార్‌కు అందజేశారు. రాజధాని అమరావతి నిర్మాణానికి వినియోగించాలని ఆయన కోరారు. గుంటూరు జిల్లా పెదపరిమి గ్రామానికి చెందిన పాలకీటి తిరుపతయ్య రాజధాని ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్ పనులకు రూ.10,000 నగదును విరాళంగా తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌కు అందజేశారు.
ఇటీవలే చిత్తూరు జిల్లాకు చెందిన డ్వాక్రా, మెప్మా సంఘాల మహిళలు ఉదారత చాటుకున్నారు. రాజధాని అమరావతి నిర్మాణం కోసం ఐదున్నర కోట్లు విరాళంగా ఇచ్చారు. కుప్పం బహిరంగ సభలో ఈ మేరకు చెక్కులను సీఎం చంద్రబాబుకు అందించారు. డ్వాక్రా సంఘాల తరఫున నాలుగున్నర కోట్లు, మెప్మా తరఫున కోటి రూపాయలను రాజధాని అమరావతి కోసం విరాళంగా ఇచ్చారు.
అమరావతి కోసం రూ.10 కోట్లు విరాళం అందించిన రామోజీ గ్రూప్ - Ramoji Rao Memorial Meet