KAKINADA PORT RATION MAFIA : కాకినాడ పోర్టుకు సమీపంలో లంగరు వేసిన స్టెల్లా ఎల్ నౌకలో రాష్ట్ర అధికారుల బృందం తనిఖీలు నిర్వహించింది. ప్రభుత్వం ద్వారా పేదలకు పంపిణీ చేసిన ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) బియ్యం అక్రమంగా సేకరించి తరలిస్తున్నారనే అనుమానాలున్న నేపథ్యంలో నమూనాలు సేకరించారు. నౌకలోని ఐదు హేచెస్లో నిల్వ చేసిన బియ్యం నమూనాలు సేకరించిన విచారణ బృందం వాటిని ప్రయోగశాలకు తరలించింది. దీనిపై ఒకట్రెండు రోజుల్లో స్పష్టత రానున్నట్లు తెలిపారు.
కాకినాడ తీరం నుంచి దక్షిణాఫ్రికా దేశాలకు బియ్యం ఎగుమతి చేస్తున్న "స్టెల్లా ఎల్- పనామా" షిప్లో రాష్ట్ర ప్రభుత్వ కీలక విభాగాలకు చెందిన అధికారుల బృందం తనిఖీలు చేసింది. బుధవారం ఉదయం కాకినాడలోని ఎస్‌పీఎఫ్, కస్టమ్స్ అధికారులతో పాటు రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ, ఆ సంస్థ, పోలీసు, పోర్టుకు చెందిన 10 మంది బృందం సముద్రంలోకి వెళ్లింది. స్టెల్లా నౌక తీరానికి 9 నాటికల్ మైళ్ల దూరంలో నిలిచి ఉండడంతో పడవలో బయల్దేరి ఉదయం 10.25 గంటలకు చేరుకున్నారు. రాత్రి 11 గంటల వరకు తనిఖీలు నిర్వహించి అనుమానాస్పదంగా కనిపించిన బియ్యం నిల్వలను పరిశీలించి మొత్తం 36 నమూనాలు సేకరించి భద్రపరిచారు. ఎగుమతి చేస్తున్న బియ్యం ఏ మిల్లు నుంచి తరలిస్తున్నారు? యజమాని, ఎగుమతిదారులెవరు అనే వివరాలతో పాటు బియ్యం ఎక్కడికి, ఎవరికి పంపుతున్నారని విషయాలు సేకరించారు. సేకరించిన బియ్యం నమూనాలను కాకినాడలోనే ఉన్న పౌరసరఫరాల సంస్థ జిల్లా ప్రయోగశాలకు పంపగా ఒకట్రెండు రోజుల్లో ఫలితాలు రానున్నాయి. అవి పేదల బియ్యం అని తేలితే తదుపరి చర్యలపై కఠిన నిర్ణయం తీసుకోనున్నారు. పిఠాపురం తహసీల్దార్ పీవీవీ గోపాలకృష్ణ నేతృత్వంలో విచారణ జరుగుతోంది. స్టెల్లా నౌకలో పేదల బియ్యం ఉన్నట్లు కాకినాడ కలెక్టర్ షాన్‌మోహన్ ప్రకటించారు. దాదాపు 640 టన్నులు పీడీఎస్ బియ్యం నిల్వలున్నాయని ఆయన వెల్లడించారు. తిరిగి రెండు రోజుల తర్వాత డిప్యూటీ సీఎ పవన్ కల్యాణ్ పోర్టును తనిఖీ చేసి నౌకను సీజ్ చేయాలని ఆదేశించారు.
పేదల పేరుతో కార్డు - పది వేల కోట్ల మాఫియా
స్టెల్లా షిప్ ఒకటో హేచ్‌లో 10 వేల టన్నుల బియ్యం నిల్వచేయగా అందులో కొన్ని బస్తాలపై అనుమానం వచ్చి నమూనాలు సేకరించారు. వాటిని యానాం శ్రీ సుముఖ వీరేశ్వర రైస్ మిల్లు నుంచి 'శ్రీ షిప్పింగ్ అండ్ లాజిస్టిక్' ఎగుమతి చేస్తున్నట్లు గుర్తించారు. స్టెల్లా నౌకలోని మొత్తం 5 హేచెస్ (గదులు)ల్లో వాసన్, యూనివర్సల్, వైట్ లిల్లీ బ్రాండ్ల పేరిట 25 కేజీలు, 50 కేజీల బియ్యం బస్తాలను అధికారులు గుర్తించారు. నౌకలో మొత్తం 12 కంపెనీలకు చెందిన బియ్యం తనిఖీ చేశారు. తనిఖీల్లో భాగంగా ఒక్కో కంపెనీవి మూడు చొప్పున మొత్తం 36 నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపించారు.
ఒక్కో హేచ్‌లో 60 నుంచి 80 అడుగుల మేర బియ్యం బస్తాలు నిల్వ చేయగా వాటన్నింటినీ పరిశీలించడం అధికారులకు కత్తిమీద సాములా మారింది. బస్తాలు ఎత్తి, పక్కకు వేయడానికి సిబ్బంది లేకపోవడంతో ఇదే అదనుగా ఏజెంట్లు కాలయాపన చేశారు. చివరకు అధికారులే నాలుగైదు వరుసల బస్తాలు కొన్నిచోట్ల పక్కకు జరిపి నమూనాలు సేకరించగా 10 మంది కూలీలు సాయంత్రానికి చేరుకున్నారు. వారితో బస్తాలు పక్కకు జరిపించి తనిఖీలు కొనసాగించారు. మూడో హేచ్‌లో అడుగున ఉన్న బియ్యం నిల్వల నమూనాలు తీసుకోలేదని తెలుస్తోంది. ముందస్తు వ్యూహం లేకుండా తనిఖీకి వెళ్లడం వాస్తవ ఫలితాలపై ప్రభావం చూపే అవకాశాలు లేకపోలేదన్న వ్యాఖ్యానాలు వినిపించాయి. అధికారులకు సహకరిస్తున్నామని నౌక ముఖ్య అధికారి ఆండ్రూస్ తెలిపారు. స్టెల్లా ఎల్ పనామా- ఐఎంవో 9500687 నౌక నవంబర్ 12న కాకినాడ తీరానికి చేరుకుందని వెల్లడించారు. సుమారు 26రోజులు ప్రయాణించి పశ్చిమ ఆఫ్రికాలోని బెనిన్‌కు ఈ నిల్వలు తీసుకెళ్లాల్సి ఉందని చెప్పారు.
వైఎస్సార్సీపీ 'సముద్రపు దొంగలు' - కాకినాడ పోర్టులో చినబాబురెడ్డి 'డి గ్యాంగ్' దందాలు
"తెలుగు ప్రజలకు సంక్రాంతి కానుక" - వీరికి రేషన్ కార్డులు, వారి ఖాతాల్లో డబ్బులు