New PCC Leader in Telangana Congress : మరో 4 రోజుల్లో రాష్ట్ర అధ్యక్ష పదవి గడువు ముగియనుండటంతో పీసీసీ అధ్యక్ష పదవితో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీని కూడా మార్చాలన్న భావనతో ఏఐసీసీ కసరత్తు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో ఏఐసీసీ, పీసీసీలు ఆశించిన మేరకు 14 స్థానాలు కాకుండా కేవలం 8 స్థానాలతోనే సరి పెట్టుకోవాల్సి వచ్చింది. దీంతో పార్టీ అధిష్ఠానంతో పాటు రాష్ట్ర నాయకత్వం కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. అభ్యర్థుల ఎంపిక, నాయకుల సమన్వయ లోపం, పోల్ మేనేజ్‌మెంట్ సక్రమంగా చేసుకోకపోవడం లాంటివి ఫలితాలను తారుమారు చేశాయని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
బీఆర్ఎస్ పరోక్షంగా బీజేపీకి మద్దతు ఇచ్చినా కూడా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి కనీసం 11 స్థానాలైనా వస్తాయని అంచనా వేశారు. కానీ రాలేదు. ఈ పరిస్థితిపై ఆరా తీసేందుకు ఏఐసీసీ నిజ నిర్దారణ కమిటీని వేసింది. ఎన్నికల్లో ఏం జరిగింది? ఎందుకు తక్కువ స్థానాల్లో విజయం సాధించాం? బీఆర్ఎస్, బీజేపీకి మద్దతు ఇచ్చిన ప్రభావం ఎంతమేర చూపింది? నాయకులు ఏ మేరకు కలిసికట్టుగా పని చేశారు? తదితర అంశాలపై అధ్యయనం చేసి వాస్తవాలను తేల్చేస్తుందని పీసీసీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
పీసీసీ పదవికి పోటీ పడుతున్న మంత్రులు : పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న సీఎం రేవంత్ రెడ్డి పాలనాపరమైన అంశాల్లో క్షణం తీరిక లేకుండా గడపాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో కొత్త రథసారథిని నియమించడం అవసరమని ఏఐసీసీ భావిస్తోంది. పార్టీ అధికారంలో ఉన్నందున పీసీసీ పగ్గాలు చేపట్టే నాయకుడు పూర్తిగా ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా నడుచుకునేట్లు ఉండాల్సి ఉంది. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై చేసే విమర్శలను తిప్పి కొట్టేందుకు వీలుగా రాష్ట్ర నాయకత్వం గట్టిగా పని చేయాల్సి ఉంటుంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని రథసారథిని ఎంపిక చేయాల్సి ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ నేపథ్యంలో డీఫ్యాక్టో అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ తనకే పీసీసీ అధ్యక్ష పదవి వచ్చి తీరుతుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాస్కీ, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌లు జగ్గారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్‌లు, జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌లు లాబీయింగ్ చేసుకుంటున్నారు. మరోవైపు ఇటీవల మహబూబ్‌నగర్ ఎంపీగా పోటీ చేసి ఓటమిపాలైన వంశీచంద్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్కలు కూడా క్యూలో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
కొత్త పీసీసీ చీఫ్ కోసం కాంగ్రెస్ వేట - రేసులో కీలక నేతలు! - TELANGANA PCC NEW CHIEF 2024
Heavy Computation on New PCC Leader : మరోవైపు కొత్తగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిల పేర్లు కూడా పీసీసీ పదవి కోసం తెరపైకి వచ్చాయి. కానీ ఇదే అంశాన్ని డిప్యూటీ సీఎం వద్ద ప్రస్తావించగా, తాను రేసులో లేనన్న సమాధానం ఆయన నుంచి రాలేదు. దీంతో ఆయన కూడా పీసీసీ అధ్యక్ష పదవిని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. ఏఐసీసీ ఎవర్ని నియమించాలనే దానిపై సంకేతాలు పంపినట్లు సమాచారం. అయితే వీరంతా కూడా ఇప్పుడున్న మంత్రి పదవులతో పాటు పీసీసీ అధ్యక్ష పదవి కూడా ఉండాలని ఏఐసీసీకి విజ్ఞప్తి చేస్తున్నట్లు వినికిడి. ఏఐసీసీ అన్ని రకాల పరిశీలనలు పూర్తి చేసి, ఎవరికి పీసీసీ పదవి కట్టబెడతారో వేచి చూడాల్సి ఉందని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
Complaints on Telangana AICC Incharge : రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్ మున్షీ కేరళ, లక్షదీవులకు ఇంఛార్జీ కాగా, ఇక్కడ తెలంగాణకు అదనపు ఇంఛార్జీగా నియమితులయ్యారు. ఆమె పర్యవేక్షణలోనే పార్లమెంటు ఎన్నికలు జరిగాయి. పార్లమెంట్ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో ఆమె నాయకులను సక్రమంగా సమన్వయం చేయలేదని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆమెకు స్థానిక పరిస్థితులపై పూర్తి స్థాయిలో పట్టులేకపోవడం, కొంత మందికి ఆమెనే మద్దతుగా నిలిచి టికెట్లు ఇప్పించడం, పాలనాపరమైన అంశాల్లో జోక్యం చేసుకోవడం, అవసరం లేని చోట ప్రభుత్వ కార్యక్రమాల అమలులో భాగస్వామ్యం చేయడం లాంటివి పాలనాపరంగా ఇబ్బందులు తలెత్తుతున్నట్లు పార్టీ సీనియర్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమెను అదనపు బాధ్యతల నుంచి తప్పించి ఆమె స్థానంలో పార్టీ సీనియర్ నేత, రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్‌ను తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీగా పంపే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.