TDP Leaders Response on Union Budget 2024: కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు సముచిత ప్రాధాన్యం లభించడంపై రాష్ట్ర వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. రాజధాని అమరావతికి 15 వేల కోట్ల ప్రత్యేత సాయాన్ని (Funds to AP in Union Budget) అందిస్తామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అదే విధంగా పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసేందుకు, పారిశ్రామిక అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతుల కల్పనకు నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. దీనిపై కూటమి నేతలు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
Nara Lokesh Tweet: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, జీవనాడి పోలవరం ప్రాజెక్టుల పూర్తి కోసం సంపూర్ణ సహకారం అందిస్తామని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి మంత్రి నారా లోకేశ్ ధన్యవాదాలు తెలిపారు. బడ్జెట్లో రూ.15 వేల కోట్లు కేటాయించి ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి కట్టుబడిన ఎన్డీఏ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజల తరఫున లోకేశ్ కృతజ్ఞతలు తెలిపారు.
Yanamala Rama Krishnudu Comments: ఏపీ ఏం ఆశించిందో వాటిని కేంద్రం బడ్జెట్‌లో పొందుపర్చడం సంతోషమని మాజీమంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. అమరావతికి రూ.15 వేల కోట్ల సాయం ఇవ్వడంతో రాజధాని పనులను పరుగులు పెట్టించవచ్చని ఆయన అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో కేంద్రం మరోసారి స్పష్టంగా హామీ ఇవ్వడం శుభ పరిణామమన్నారు. ఆగిపోయిన వెనుకబడిన ప్రాంతాలకు నిధులిస్తామని చెప్పడం రాష్ట్ర ప్రగతికి తోడ్పడుతుందని యనమల తెలిపారు.
ఏపీలో ఏర్పడిన కొత్త ప్రభుత్వానికి కేంద్రం ప్రకటనలు ఆర్థిక తోడ్పాటు ఇస్తుందని, ఆర్థికాభివృద్ధి జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఏపీలో పారిశ్రామిక మౌళిక సదుపాయాల కల్పనకు ఆర్థిక సాయం ఇవ్వడం వల్ల పారిశ్రామికాభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. కేంద్ర బడ్జెట్‌తో కేంద్ర, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలు పుంజుకుంటాయని తెలిపారు. స్వర్ణాంధ్ర సాధన దిశగా అడుగులు పడడానికి కేంద్ర బడ్జెట్ ఉపకరిస్తుందన్నారు.
చంద్రబాబు దిల్లీ పర్యటనలు ఫలించాయని తెలిపారు. ఏపీపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రధాని మోదీకి, ఎన్డీఏ ప్రభుత్వానికి యనమల కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కేంద్ర పథకాలు ఊతమిస్తాయన్నారు. గత ఐదేళ్లల్లో జగన్ రుణాలే తెచ్చారని, తాము నిధులు తెస్తున్నామన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమరావతిని, పోలవరం ప్రాజెక్టును నాశనం చేసిందని మండిపడ్డారు. తాము రాజధాని, పోలవరం ప్రాజెక్ట్ పనులను గాడిలో పెడుతున్నామని యనమల తెలిపారు.
ఏపీకి నిర్మలమ్మ వరాలు - అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్లు - 15 thousand Crores for Amaravati
Somireddy Chandramohan Reddy Response: ముఖ్యమంత్రి చంద్రబాబు కొద్ది రోజుల క్రితం పోలవరం డ్యాం కోసమే దిల్లీ వెళ్లారని మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. జగన్ రాష్ట్రాన్ని డ్యామేజీ చేయాలనే దిల్లీ వెళ్లారని ఆయన మండిపడ్డారు. బడ్జెట్లో ఏపీకి తోడ్పాటు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వానికి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
Yarapathineni Srinivasa Rao: మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన చేసిన రాజధానికి ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టుబట్టి నిధులు సాధించారని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తెలిపారు. ఒక వ్యక్తి వినాశకారి అయితే ఎలా ఉంటుందో గత ఐదేళ్లలో చూశామని ఆయన అన్నారు. విజనరీ ముఖ్యమంత్రి ఎలా ఉంటాడో నెలరోజుల్లోనే చూపించారన్నారు. దాడులు చేసిన వారిని జగన్ అందలం ఎక్కించి కీలక పదవులు కట్టబెట్టారని యరపతినేని శ్రీనివాసరావు దుయ్యబట్టారు.
Tenali Sravan Kumar: గత 5 ఏళ్లలో దిల్లీ అనేక మార్లు వెళ్లిన జగన్ రాష్ట్రానికి తెచ్చింది శూన్యమని తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కేవలం 2 సార్లు దిల్లీకి వెళ్లి అమరావతికి నిధులు సాధించారని హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలతో అమరావతికి పట్టిన గ్రహణం వీడిందని ఆయన అన్నారు. ఇప్పుడు కేంద్ర నిధులతో అమరావతి నిర్మాణం పరుగులు పెట్టనుందని తెలిపారు.
MLA Sujana Chowdary: కూటమి అధికారంలోకి వచ్చాక కేంద్ర బడ్జెట్లో అమరావతి అభివృద్ధి కోసం రూ.15 వేల కోట్లు కేటాయించడం శుభపరిణామమని విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనాచౌదరి అన్నారు. జగన్ అరాచక పాలనలో అమరావతి నిర్వీర్యమైందన్న ఆయన గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం చట్టప్రకారం రావాల్సిన నిధులను కూడా తీసుకురాలేకపోయిందని విమర్శించారు. పోలవరం పూర్తయితే 25 వేల ఎకరాలు సాగులోకి వస్తాయని తెలిపారు. సంపద సృష్టిచాలంటే అనుభవం కావాలని, అది చంద్రబాబుతోనే సాధ్యమని స్పష్టంచేశారు. గత ఐదేళ్ల పాలనలో అభివృద్ధిపై దృష్టిపెట్టని జగన్.. అరాచకాలు, వినాశనాలు సృష్టించారని మండిపడ్డారు. అలాంటిది జగన్ రాష్ట్రంలో శాంతి భద్రతలపై మాట్లాడడం దెయ్యాలు వేదాలు వళ్లించినట్లుందని సుజనాచౌదరి దుయ్యబట్టారు.
MLA Kamineni Srinivas: కూటమి అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వ విధ్వంసం నుంచి రాష్ట్రం అభివృద్ధి పథంలోకి నడుస్తోందని కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అన్నారు. కూటమి ప్రభుత్వం బాధ్యతతో ముందుకు వెళుతోందని స్పష్టంచేశారు.