Nara Lokesh Key Role in TDP Victory: నారా లోకేశ్ తెలుగుదేశం మీసం తిప్పారు. పార్టీలో 2013 నుంచి క్రియాశీలక పాత్ర పోషిస్తున్న లోకేశ్, 2014 ఎన్నికల్లో పార్టీ విజయం సాధించడంలో కీలకంగా వ్యవహరించారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు నిర్వహిస్తూ ఆనాడు పోటీకి దూరంగా ఉన్నారు. తర్వాత ఎమ్మెల్సీగా ఎన్నికై, మూడు శాఖల మంత్రిగా బాధ్యతలు విజయవంతంగా నిర్వర్తించారు. 2019లో ప్రత్యక్ష ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీచేసి 5 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ ఓటమే లోకేశ్‌ని రాటుదేల్చింది. అపజయం నుంచి గుణపాఠం నేర్చుకునేలా చేసింది. ఓడిపోవడం అంటే ఆగిపోవడం కాదు, మరింత దూకుడుగా పనిచేస్తూ విజయాన్ని సొంతం చేసుకోవడం అని నిర్ణయించుకున్నారు. పోయిన చోటే వెతుక్కోవాలి అన్న నానుడిలాగా ఓడిపోయిన చోటే గెలవాలి అనే పట్టుదలతో మంగళగిరి నియోజకవర్గంలో పాగా వేశారు.
మరోవైపు 23 సీట్లకే పరిమితమై, అధికార వైఎస్సార్సీపీ దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తెలుగుదేశం పార్టీ నేతలకు నేనున్నానంటూ అండగా నిలబడ్డారు. పార్టీ శ్రేణులకు కష్టమొస్తే క్షణం ఆలస్యం చేయకుండా సాయం అందించే యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకున్నారు. నాయకులతో మాట్లాడుతూ ధైర్యం నింపారు. ఒక్క కేసు కాకపోతే వంద కేసులు పెట్టుకోండంటూ సవాల్ విసిరారు. చట్టాల్ని చుట్టం చేసుకుని తెలుగుదేశం నాయకులు, కార్యకర్తల్ని వేధిస్తున్న వారికి రెడ్ బుక్ వార్నింగ్ ఇచ్చి సంచలనం సృష్టించారు. ఎదురైన ప్రతి సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకుని 2024లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి విజయానికి లోకేశ్ బాటలు వేశారు.
జనస్వరాన్ని చైతన్యపరిచి: వైఎస్సార్సీపీ అరాచక పాలనలో మూగబోయిన జనస్వరాన్ని చైతన్యపరిచి వారి గళాన్ని వినిపించేందుకు 2023 జనవరి 27న యువగళం పాదయాత్రను కుప్పం శ్రీ వరదరాజస్వామి ఆలయం నుంచి లోకేశ్ ప్రారంభించారు. కోట్లాది ప్రజల ఆశలు, ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ ప్రజాచైతన్యమే లక్ష్యంగా ఈ యాత్ర ముందుకు సాగింది. రాష్ట్రంలోని 11 ఉమ్మడి జిల్లాల్లో 97 అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు వేల 4 గ్రామాల మీదుగా 226 రోజులపాటు 3 వేల 132 కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగించారు.
సమస్యల ప్రత్యక్ష పరిశీలన, పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలు, సత్వర సాయం, మేథోమధనం, అన్నివర్గాల ఆకాంక్షలు తెలుసుకున్న ఓ రాజకీయ యువపరిశోధకుడు సాగించిన మహా ప్రయాణంలా యువగళాన్ని మలచుకున్నారు. 70 బహిరంగ సభలు, 155 ముఖాముఖిలు, 8 రచ్చబండలు, 12 ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొన్న లోకేశ్, కోటి 50 లక్షల మందితో మమేకమై ప్రజల్లో చైతన్యం కలిగించారు. 4వేల 353 వినతిపత్రాలు స్వీకరించి వివిధ వర్గాల సమస్యలు తెలుసుకున్నారు. అధికార అండతో వైఎస్సార్సీపీ సాగిస్తున్న అణచివేత, అవినీతి, అరాచక పాలనపై ప్రజలు ఎదురుతిరగడం మొదలుపెట్టారు.
రథసారధిగా తనను తాను తయారు చేసుకుని: యువగళం పాదయాత్రతో లోకేశ్ ప్రజల్లో భరోసా, పార్టీలో నూతనోత్తేజం నింపారు. 2024 ఎన్నికల్లో కూటమి ఘన విజయానికి ఈ పాదయాత్ర కూడా దోహదం చేసింది. హత్యకు గురైన విద్యార్థిని కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తే కేసు, ట్రాక్టర్ నడిపారని ఓ కేసు, కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించారని మరో కేసు, స్టూలు ఎక్కి మాట్లాడారని ఇంకో కేసు, ఇలా ఏ కేసు పడితే ఆ కేసును లోకేశ్‌పై పోలీసులు బనాయించారు. యువగళం పాదయాత్రను అడ్డుకునేందుకు వైఎస్సార్సీపీ సర్కారు చేయని ప్రయత్నం లేదు. మొదట్లోనే సాగనిస్తే పాదయాత్ర సాగనివ్వకుంటే దండయాత్ర అంటూ ప్రకటించి వైఎస్సార్సీపీ కవ్వింపు చర్యల మధ్యే లోకేశ్ ముందుకు సాగారు.
ఓ వైపు తనపై కేసులు, మరోవైపు తండ్రి అక్రమ అరెస్టు, ఇంకోవైపు నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులతో లోకేశ్ న్యాయపోరాటాన్ని నమ్ముకున్నారు. దిల్లీలో మకాం వేసి న్యాయకోవిదులతో చర్చలు, మరోవైపు కేంద్రంతో అప్పుడే పొత్తు ఎత్తులు ముగించి వచ్చారు. తాత ధైర్యం, తండ్రి దార్శనికత, మేనమామ దూకుడు కలగలిసిన లోకేశ్, జగనాసుర రాజకీయ పద్మవ్యూహాన్ని ఛేదించారు. నాయకులకు ధైర్యం, పార్టీ శ్రేణులకు అండగా ఉంటూనే ప్రత్యర్థి పొత్తుల ఎత్తులు, అధికార అహంకారానికి ఎదురొడ్డి పోరాడారు. తెలుగుదేశం పార్టీని మరో 30 ఏళ్లపాటు నడిపించే రథసారధిగా తనను తాను తయారు చేసుకున్నారు.
పడిలేచిన కెరటం - ఏపీ ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభంజనం - ap elections 2024
కార్యకర్తలను తమ కుటుంబ సభ్యులుగా భావిస్తూ: తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను తమ కుటుంబ సభ్యులుగా భావిస్తుంది. భారతదేశంలోనే ఏ రాజకీయ పార్టీకీ లేని కార్యకర్తల సంక్షేమ విభాగాన్ని ఏర్పాటు చేసిన లోకేశ్, దానిని దిగ్విజయంగా నడిపిస్తున్నారు. కార్యకర్తలు, వారి కుటుంబ సభ్యుల విద్య, వైద్యం, వివాహం, ఆర్థిక అవసరాలలో ఆదుకుంటూ కొండంత అండగా నిలుస్తున్నారు. ప్రమాదంలో కార్యకర్తలు చనిపోతే వారి కుటుంబానికి ప్రమాద బీమా అందించి ధీమా కల్పిస్తున్నారు. కార్యకర్తల బాగోగులు చూసుకునే బాధ్యత లోకేశ్‌కు అప్పగిస్తున్నామని 2014 మహానాడులో చంద్రబాబు ప్రకటించారు. నాటి నుంచి నేటివరకూ కార్యకర్తల పెన్నిధిగా వ్యవహరిస్తున్న లోకేశ్, సంక్షేమ నిధితో ఆదుకుంటున్నారు. ఇప్పటివరకు 1500 మందికి పైగా కార్యకర్తల పిల్లల చదువులకు సాయం చేశారు. వివిధ ప్రమాదాల్లో మరణించిన సుమారు 5000 మంది కార్యకర్తల కుటుంబాలకు ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల బీమా అందజేశారు.
అనారోగ్యంతో బాధపడుతున్న అనేక మంది కార్యకర్తలకు వైద్య సాయం అందించారు. సుమారు 2000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించారు. సుమారు 5వేల మంది కార్యకర్తల కుటుంబాలకు కష్టకాలంలో అండగా నిలిచి ఆర్థిక సాయం చేశారు. వంద రూపాయలతో సభ్యత్వం తీసుకున్న తెలుగుదేశం కార్యకర్తల సంక్షేమం చూసేందుకు లోకేశ్ ఆధ్వర్యంలో తెలుగుదేశం సంక్షేమ విభాగం అవిశ్రాంతంగా పనిచేస్తోంది. ఎన్టీఆర్ మోడల్ స్కూళ్ల ద్వారా ఉచిత విద్య, ఉపకారవేతనాలు, ప్రైవేట్ స్కూళ్లలోనూ ఫీజుల్లో రాయితీలు, చదువు పూర్తయిన వారికి ఉపాధి, ఉద్యోగావకాశాలు సాధించేలా నైపుణ్యశిక్షణ ఇస్తున్నారు. జెండా మోసే కార్యకర్తకు అండగా నిలిచిన లోకేశ్‌ను తెలుగుదేశం లీడర్ నుంచి కేడర్ వరకూ అంతా ప్రసంశలతో ముంచెత్తుతున్నారు.
లోకేశ్ రాజనీతిజ్ఞత: కరోనా ఆంక్షలు ముగిశాక చాలా రోజుల తరువాత కనిపించిన లోకేశ్, న్యూ లుక్ చూసి తెలుగుదేశం నేతలు ఆశ్చర్యపోయారు. లావుగా, నున్నగా షేవ్ చేసిన లోకేశ్‌ను చాలా రోజులుగా చూసిన జనానికి ఈసారి యువనేత కొత్తగా కనిపించారు. లైటుగా గెడ్డం, సన్నని మీసకట్టు, స్లిమ్‌గా అదిరిపోయే లుక్‌తో గెటప్ మార్చారు. జనసేనతో జట్టు కట్టడం, దిల్లీ వెళ్లి అమిత్ షాతో భేటీకావడం వెనుక లోకేశ్ రాజనీతిజ్ఞత బయటపడింది. చంద్రబాబు అరెస్టు సమయంలో ఎంతో కీలకంగా వ్యవహరించారు. తెలుగుదేశం-బీజేపీ-జనసేన కూటమిగా ఏర్పడ్డాక ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రానికి వచ్చిన ప్రధాని మోదీతో కలిసి లోకేశ్ సభలలో పాల్గొన్నారు.
ఏపీలో పరిస్థితులను ప్రధానికి వివరించారు. ప్రధాని సభలు విజయవంతం కావడానికి తెరవెనుక కీలకంగా వ్యవహరించిన లోకేశ్‌ను మోదీ అభినందించారు. వేదికపై తన పక్కనే నారా లోకేశ్‌కు స్థానం ఇచ్చారు. ప్రధానికి స్వాగతం పలికేటప్పుడు తన మంగళగిరి నియోజకవర్గం గొప్పతనాన్ని, పద్మశాలీయుల కృషి, సృజనాత్మక కళను మోదీ దృష్టికి తీసుకెళ్లడంలో గొప్ప పరిణతి ప్రదర్శించారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు పోటీచేసిన పార్లమెంటు స్థానం పరిధిలో ప్రచారానికి ప్రత్యేకంగా బీజేపీ ఆహ్వానించిందంటేనే లోకేశ్‌కు ఎంతటి ప్రాధాన్యత ఉందో అర్థమవుతోంది.
జగన్ చేసిన పాపాలే చంద్రబాబు విజయానికి మెట్లు! - People Belief Towards Chandrababu
అఖండ విజయాన్ని అందించి: ఉరుముకు మెరుపు తోడైతే ప్రళయ గర్జనలే. ఇరుపార్టీలకు చెందిన ఇద్దరు యువఅగ్రనేతలు చేయి కలిపితే అది జన ప్రభంజనమే అవుతుంది. చంద్రబాబు అరెస్టు సమయంలో యువగళం పాదయాత్రలో ఉన్నలోకేశ్, తన తండ్రి వద్దకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. సమాచారం తెలుసుకున్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హుటాహుటిన ఏపీకి తరలివచ్చారు. పవన్ కల్యాణ్‌ను అష్టదిగ్బంధనం చేశారు పోలీసులు. చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ, లోకేశ్ న్యాయపోరాటానికి తాను అండగా నిలుస్తున్నట్టు ప్రకటించారు పవన్. చంద్రబాబు జైలు నుంచి బయటకొచ్చే వరకూ మద్దతుగా నిలిచిన పవన్ తనకు దేవుడిచ్చిన అన్నయ్య అని లోకేశ్ ప్రస్తావించారు.
వైఎస్సార్సీపీ అరాచక పాలన అంతమే తన పంతమని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని మాటిచ్చిన జనసేనాని, రాష్ట్ర దీర్ఘకాలిక ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని బీజేపీతోనూ పొత్తు కుదిర్చారు. పవన్, లోకేశ్ ఇద్దరూ ఇరుపార్టీల అగ్రనేతలుగా కాకుండా కుటుంబం అనే రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ఎన్ని త్యాగాలకైనా, ఎంతటి పోరాటానికైనా రెడీ అంటూ రంగంలోకి దిగిన సొంత అన్నదమ్ముల్లాగే పనిచేశారు. అభ్యర్థుల ఎంపికలోనూ, సభల నిర్వహణలోనూ, మేనిఫెస్టో ప్రకటనలోనూ ఉమ్మడి కార్యాచరణ స్పష్టంగా కనిపించింది. యువనేతల మధ్య సమన్వయం, పరస్పర గౌరవభావం, సోదర బంధం కూటమికి అఖండ విజయాన్ని అందించాయి.
కూటమి జైత్రయాత్ర - 10 సీట్లకే పరిమితమైన వైఎస్సార్సీపీ! - TDP clean sweep