Vasanta Krishna Prasad Met Devineni Uma : మైలవరం టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. ఇద్దరు అభిమాన నేతలు అభిప్రాయభేదాలు పక్కనపెట్టి కలిసిన తరుణంలో వారంతా ఆనందోత్సాహాల్లో మునిగి తేలుతున్నారు. మొన్నటివరకు ఉప్పు నిప్పులా ఉండే మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరరావు ఒక్కటయ్యారు. తద్వారా కొన్నేళ్లుగా తమ మధ్య ఉన్న భేదాభిప్రాయాలను దూరం చేసే ప్రయత్నం చేశారు. సోమవారం జరిగే నామినేషన్ కార్యక్రమానికి రావాలంటూ విజయవాడ శివారు గొల్లపూడిలోని దేవినేని ఉమా ఇంటికి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తొలిసారిగా వెళ్లారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు ఒక్కటై చేతులు కలిపారు.
కొద్దిసేపు సమకాలీన రాజకీయాలపై మాట్లాడుకున్నారు. ఇద్దరు నేతలు మైలవరం టీడీపీ టిక్కెట్ ఆశించగా వైఎస్సార్సీపీ నుంచి వచ్చిన వసంత కృష్ణప్రసాద్ కు టీడీపీ అధిష్ఠానం పోటీ చేసే అవకాశాన్ని కల్పించింది. దీంతో కొంతకాలంగా దేవినేని స్తబ్దుగా ఉండిపోయారు. ఈ నేపథ్యంలో మైలవరంలో సోమవారం నామినేషన్ వేసేందుకు వెళ్తున్న కృష్ణప్రసాద్ దేవినేనిని రావాలని మర్యాదపూర్వకంగా అభ్యర్థించారు. ఇద్దరు నేతల కలయికతో మైలవరం టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది.
మైలవరంలో దేవినేని ఉమా, వసంత కృష్ణప్రసాద్ చేతులు కలిపారు. గొల్లపూడిలో మాజీ మంత్రి దేవినేని ఉమాను మైలవరం కూటమి టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు. వసంత నామినేషన్ దాఖలులో ఉమా పాల్గొననున్నారు. తాను తెలుగుదేశం పార్టీలో ఐదు సార్లు బీఫార్మ్ తీసుకున్నానని, కుటుంబం లాంటి పార్టీలో కొన్ని కలహాలు వస్తుంటాయి. సద్దుమణుగుతూ ఉంటాయని మాజీ మంత్రి దేవినేని ఉమ స్పష్టం చేశారు. తనది తెలుగుదేశం కుటుంబమని, ప్రాణం పోయేంత వరకు మైలవరం ప్రజలకు అండగా ఉంటానని దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. తాను, వసంత కృష్ణ ప్రసాద్ రాజకీయ పోరాటాలు చేశామని తెలిపారు.
తాను, వసంత ఎప్పుడూ మైలవరం పార్టీ కార్యకర్తలు, ప్రజలకు అందుబాటులో ఉంటామన్నారు. దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడాలంటే అందరం కలవాలని దేవినేని పిలుపునిచ్చారు. అందరం కలిసి పనిచేసి కూటమి ఎమ్మెల్యేగా వసంత, ఎంపీగా కేశినేని చిన్నిని గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. చిన్న చిన్న పొరపాట్లు ఉంటే సర్దుకు పోదామని మైలవరం ఎమ్మెల్యే అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ స్పష్టం చేశారు. అందరం కలిసి కూటమి పార్టీని అధికారంలోకి తీసుకువద్దామన్నారు. మైలవరంలో తెలుగుదేశం జెండా ఎగురవేస్తున్నామని తెలిపారు.
'అవసరమైతే రాజకీయాలు మానేస్తా.. కానీ ఆ పని చేయను..: వసంత కృష్ణ ప్రసాద్