Mumbai Actress Harassment Issue: వైఎస్సార్సీపీ హయాంలో డబ్బు, అధికారంతో తనపై తప్పుడు కేసులు బనాయించారని ముంబయి నటి ఆవేదన వ్యక్తం చేశారు. తన తల్లిదండ్రులను తీవ్ర వేదనకు గురిచేశారన్నారు. 6 కోట్ల రూపాయల విలువైన తన ఇంటిని, కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాల్నీ సీజ్ చేసి వేధించారని వాపోయారు. చివరికి రోజువారీ ఖర్చులకు కూడా అప్పు చేసుకోవాల్సిన పరిస్థితి కల్పించారని చెప్పారు. విజయవాడ పోలీసులు తమ ఇంటి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ ఉపకరణాల్లోని ఆధారాలన్నింటినీ ట్యాంపర్ చేశారని తెలిపారు.
శక్తివంతమైన వ్యక్తులు ఉన్నారు: ఈ మొత్తం వ్యవహారం వెనక అత్యంత శక్తివంతమైన వ్యక్తులు (YSRCP Leaders Harassed Actress) ఉన్నారని, భారీగా డబ్బులు వెచ్చించి తమను అక్రమ కేసుల్లో ఇరికించారని వెల్లడించారు. ఓ భయంకరమైన కథలో తనను బాధితురాలిగా చేశారని వాపోయారు. పోలీసులు వేధింపుల వల్ల తాను, తన కుటుంబ సభ్యులు ఆరు నెలల పాటు నిద్ర కూడా పోలేకపోయామని, ఎవరితోనూ మాట్లాడలేకపోయామని చెప్పారు. ఫోర్జరీ పత్రాలు ఉపయోగించి తనపై అక్రమ కేసు పెట్టిన వైఎస్సార్సీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్, తనను, తన కుటుంబాన్ని హింసించి, వేధించిన నాటి పోలీసు అధికారులందరిపైనా తీవ్రమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, హోంమంత్రి అనిత, ఏపీ ప్రభుత్వం తనకు న్యాయం చేయాలని విన్నవించారు.
అసలు సినిమా ఇంకా ఉందంటూ: అక్రమ కేసులో తనతోపాటు తన తల్లీదండ్రుల్ని విజయవాడ జైల్లో 40 రోజులు నిర్బంధించారని ముంబయి నటి తెలిపారు. పోలీసుల చర్య వల్ల 70 ఏళ్ల తన తండ్రి వినికిడి కోల్పోయారని, తల్లి గుండె జబ్బుకు గురయ్యారన్నారు. వారు చనిపోతే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. ప్రతి ఒక్కరూ తన నోరు మూయించేందుకు ప్రయత్నించారన్నారు. తన కుటుంబాన్ని చంపేస్తామని, తనను కనిపించనీయకుండా చేస్తామని బెదిరించారని వెల్లడించారు. ఏపీలో చూసింది ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా ఇంకా ఉందంటూ భయపెట్టారన్నారు.
విజయవాడ పోలీసులు పెట్టిన అక్రమ కేసు వల్ల జీవితం, కెరీర్, కుటుంబం మొత్తం నాశనమైందని ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బు, అధికారం ఉంటే ఎవరు ఫిర్యాదు చేసినా అక్రమ కేసులు పెట్టేస్తారా అని ప్రశ్నించారు. చివరికి పరిచయస్తులతో మాట్లాడినా సరే వారిని సైతం బెదిరిస్తున్నారని కన్నీటిపర్యంతమయ్యారు. పోలీసుల తీరుతో స్నేహితులు, బంధువులు అందరూ దూరమయ్యారన్నారు. అక్రమ కేసుల వెనుక అతిపెద్ద కుట్ర ఉందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
హీరోయిన్‌ను వేధించిన వైఎస్సార్సీపీ నేతలు, కొందరు ఐపీఎస్‌లు - YSRCP Leaders Harassed Actress
కేసులో ఇరికించారు: వైఎస్సార్సీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ ఓ మోడలింగ్ కో-ఆర్డినేటర్ ద్వారా పరిచయం అయ్యాడని ముంబై నటి చెప్పారు. ఖరీదైన బహమతులిచ్చి మోసగించాలని చూశాడని ఆరోపించారు. 2015లో పెళ్లి ప్రతిపాదన తీసుకొచ్చారన్నారు. పెళ్లయిన 14 నెలలకే విద్యాసాగర్ భార్య అతన్ని విడిచిపెట్టి వెళ్లిపోయిందని, ఆయనపై దేశవ్యాప్తంగా అనేక కేసులున్నాయని తెలిసిందన్నారు. దీంతో విద్యాసాగర్‌కు దూరంగా ఉన్నట్లు చెప్పారు. అప్పట్నుంచి వేధింపులు ప్రారంభమయ్యాయన్నారు. అసభ్యకర, అశ్లీల సందేశాలతో హింసించాడని వాపోయారు. అలాంటి క్రిమినల్ ఓ ఫోర్జరీ పత్రం ఆధారంగా ఫిర్యాదిస్తే ఏపీ పోలీసులు అక్రమంగా కేసు నమోదు చేశారన్నారు.
ఈ మొత్తం వివాదం ముంబయిలోనే ఉందని, డబ్బు, అధికారం అండతో శక్తివంతమైన వ్యక్తులు తనను ఈ కేసులో ఇరికించారని చెప్పారు. వేధించేందుకు, బెదిరించేందుకు వారంతా ముఠా కట్టారన్నారు. ఒక భయంకరమైన పరిస్థితుల్లోకి నెట్టేశారని వాపోయారు. వారి నుంచి రక్షణ కల్పించాలని కోరారు. వైఎస్సార్సీపీ నేత కుక్కల విద్యాసాగర్, నాటి పోలీస్ అధికారులపై కేసులు నమోదు చేసి విచారించాలన్నారు. తనపై పెట్టిన తప్పుడు కేసును క్వాష్ చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కేసుపై పోలీసు ఉన్నతాధికారులు అంతర్గత విచారణ ప్రారంభించారు. కాంతిరాణా, విశాల్ గున్నిలకు సంజాయిషీ నోటీసులు ఇవ్వడానికి ముందు అసలు కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు. కేసు సీడీఫైల్‌ను పరిశీలించడంతో పాటు ఇబ్రహీంపట్నం ఇన్‌స్పెక్టర్‌ను సీపీ రాజశేఖర్‌బాబు ఆరా తీసినట్లు తెలుస్తోంది. జగ్గయ్యపేటలో భూమికి సంబంధించి లావాదేవీలను పోలీసులను పరిశీలిస్తున్నారు. ఫోర్జరీ డాక్యుమెంట్ ఎలా వచ్చిందనే కోణంలో ఆరా తీస్తున్నారు. ముంబై నటి కేసుపై సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ విజయవాడ సీపీ రాజశేఖర్‌బాబుతో చర్చించినట్లు తెలుస్తోంది.
వైరల్ ఫొటో - హీరోయిన్‌తో వైఎస్సార్సీపీ నేత కుక్కల విద్యాసాగర్ - ysrcp kukkala vidya sagar Issue