MP DK Aruna on Floods in Telangana : రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరినీ ఆదుకోవడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ సూచించారు. కేంద్రం ఇప్పటికే సాయం ప్రకటించిన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో జరిగిన పంటనష్టం, రోడ్లు, భవనాలు, కూలినపోయిన ఇళ్లు ఇతర సమాచారం సేకరించి బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాల కారణంగా రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని వారికి వెంటనే పరిహారం చెల్లించాలన్నారు. ఇళ్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇంటి కింద రూ.5లక్షలు తక్షణం మంజూరు చేసి ఇంటి నిర్మాణాలు మొదలుపెట్టాలని చెప్పారు. దెబ్బతిన్న రోడ్లను పునరుద్ధరించాలని కోరారు.
చిన్నోనిపల్లి ముంపు బాధితులకు పునరావాసం కల్పించాలి : జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం చిన్నోనిపల్లి ఇప్పటికీ వరద ముంపులోనే ఉందని వారికి పునరావాసం కల్పించేందుకు వెంటనే ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. పాత పునరావాస గ్రామాల్లో ఇప్పటికీ ఇళ్ల నిర్మాణం చేపట్టలేని వారికి నిర్మాణం కోసం రూ.5లక్షలు మంజూరు చేయాలని, మౌలిక వసతులు కల్పించి, బకాయిలు ఏమైనా ఉండే తక్షణం చెల్లించాలని కోరారు.
రాష్ట్రంలో ఆడపిల్లలు, మహిళల పట్ల అఘాయిత్యాలు పెరుగుతున్నాయని ముఖ్యమంత్రి వాటిపై స్పందించడం లేదని దుయ్యబట్టారు. హైడ్రా కూల్చివేతల పేరుతో నిరుపేదల ఇళ్లు కూల్చేసి భయోత్పాతం సృష్టిస్తున్నారని, ప్రజల దృష్టిని మరల్చేందుకే హైడ్రా చర్యలని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు గడుస్తున్నా రైతు భరోసా డబ్బులు రాలేదని, రుణమాఫీ సైతం సక్రమంగా అమలు కాలేదన్నారు.
DK Aruna on Waqf Bill : కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు ప్రతిపాదించిన వక్ఫ్ చట్టంలో సవరణలపై కొందరు పనికట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారని, మతం రంగు పులిమి బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ఓ వర్గాన్ని ఉసిగొలిపే ప్రయత్నం చేస్తున్నారని డీకే అరుణ ఆరోపించారు. వక్ఫ్ చట్టంలో సవరణలపై ఇండియా కూటమి, ఎంఐఎం లాంటి పార్టీల తీరుపై మండిపడ్డారు. కేంద్రం ప్రతిపాదించిన సవరణలకు అంగీకరిస్తే వక్ఫ్ భూములు, మసీదులు, ఖబ్రస్థాన్లు గుంజుకుంటారన్న తప్పుడు ప్రచారాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు.
నిరుపేద ముస్లిం కుటుంబాలు, విద్యార్థులు, వితంతు మహిళలకు మేలు చేసేందుకే చట్టంలో సవరణలు తీసుకొస్తున్నట్లు ఆమె వెల్లడించారు. తప్పుడు ప్రచారాన్ని ముస్లింలు నమ్మొద్దని చెప్పారు. సవరణలపై స్పీకర్ ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ ముందు అన్ని రాష్ట్రాల నుంచి ఎంతోమంది తమ వాదనలు వినిపిస్తున్నారని, వాటన్నింటినీ పార్లమెంట్ ముందు పెడతామని తెలిపారు. తెలంగాణలోనూ జేపీసీ పర్యటించనుందని వక్ఫ్‌పై ఎవరైనా తమ వాదనలు వినిపించవచ్చని చెప్పారు.