Model Code of Conduct is not Applicable to YSRCP : ఎన్నికల కోడ్ పక్కాగా అమలు చేయాలని కలెక్టర్లకు ఈసీ స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ రాష్ట్రంలో పలు జిల్లాలోని కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాల్లో వైఎస్సార్సీపీ జెండాలు, నేతల ఫ్లెక్సీలు అలాగే దర్శనమిస్తున్నాయి. ప్రచార యావతో దేన్నీ వదలకుండా పార్టీ రంగులతో నింపేయడంతో, వాటిని తొలగించేందుకు అధికారులకు తలప్రాణం తోకకొస్తోంది. కొన్నిచోట్ల అధికారులు ఎన్నికల కోడ్‌ను తుంగలో తొక్కుతున్నారనే విమర్శలూ వినిపిస్తున్నాయి.
దేశంలో సార్వత్రిక ఎన్నికల నగారా మోగడంతో తక్షణమే ఎన్నికల ప్రవర్తనా నియామవళి అమలులోకి వచ్చింది. కోడ్ పటిష్ఠంగా అమలు చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సైతం ఆదేశించినా ఆచరణలో వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. గుంటూరులోని "ఆత్మ" కార్యాలయాలనికి వేసిన వైఎస్సార్సీపీ రంగులను అధికారులు తొలగించకపోవడంపై ప్రజాసంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. పార్కులు, ప్రధాన కూడళ్లలో తెలుగుదేశానికి చెందిన బెంచ్‌లకు తెల్లరంగు వేసిన అధికారులు, వైఎస్సార్సీపీ బెంచీలను మాత్రం మినహాయించారు. ఆర్బీకే, సచివాలయం, వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్‌లలో సీఎం జగన్ ఫోటోలను తొలగించారు. పార్టీ నాయకుల పేర్లు కనిపించకుండా పేపర్లు అంటించారు.
చిన్నపలకలూరు అంగన్వాడీ కేంద్రంలోని వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్యాకెట్లపై సీఎం జగన్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫొటోలు ఉన్నాయి. వాటిలో కొన్ని ప్యాకెట్లకు మాత్రమే చిత్రాలు కనిపించకుండా అంగన్వాడీ సిబ్బంది కాగితాలు అంటించారు. మిగిలిన వాటిని అలానే వదిలేశారు. పేరేచర్ల, మందపాడు సచివాలయాలపై సీఎం జగన్ ఫొటోలు అలాగే ఉన్నాయి. మేడికొండూరు రైతు భరోసా కేంద్రానికి ఉన్న వైఎస్సార్సీపీ రంగులను తొలగించలేదు. కృష్ణాజిల్లా పామర్రులో ఆయా పోస్టర్లు తొలగించకపోవడం చర్చనీయాంశంగా మారింది. కంచర్లవానిపురం లోని పోలింగ్ బూత్ నెంబర్ 77/166 పోలింగ్ బూత్‌కు అంటించిన పోస్టర్లను అధికారులు ఇంకా తొలగించకపోవడంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
వాలంటీర్ల అత్యుత్సాహం- వైసీపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వాలంటీర్లు
పల్నాడు జిల్లాలో ఎన్నికల నియామవళిని అధికారులు గాలికొదిలేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. నాగిరెడ్డిపాలెం, ధరణికోట సచివాలయాల్లో జగన్ ఫొటోలు, సంక్షేమ పథకాల కరప్రతాలను తొలగించకపోవడంపై గ్రామస్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ సెంటర్‌కు ఉన్న వైఎస్ఆర్ పేరును తొలగించలేదు. క్రోసూరు మండలంలో వైఎస్సార్సీపీ నాయకులు ఎన్నికల కోడ్‌ను పెడచెవిన పెడుతున్నారు. సిద్ధమంటూ గ్రామాల్లోని వంతెనలకు, విద్యుత్ స్తంభాలకు వైఎస్సార్సీపీ రంగులు, కరపత్రాలను అంటించారు. వాటిని తొలగించేందుకు అధికారులు చర్యలు చేపట్టలేదు.
తిరుపతి జిల్లా నియోజకవర్గ పరిధిలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అపహాస్యం పాలవుతోంది. ప్రభుత్వాధికారులు మాకు కనిపించదు మేము చూడలేదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కొందరు అధికారులు స్వామిభక్తి ప్రదర్శిస్తున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వైఎస్సార్సీపీకి చెందిన బ్యానర్లు ఫ్లెక్సీలు అలాగే దర్శనమిస్తున్నాయి. తుడా నిధులతో ఆయా గ్రామాల్లో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏర్పాటు చేసిన సిమెంటు బల్లలపై రాతలు ఓవర్‌హెడ్ ట్యాంకులపై పార్టీల రంగులు, సచివాలయాల్లోని నవరత్నాల లోగోలు, అలాగే దర్శనమిస్తున్నాయి.