Ministers Fire on Former CM Jagan: జగన్ గవర్నర్ని కలిసినా, ప్రధానిని కలిసినా, దిల్లీలో ధర్నా చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. భుజం ఆపరేషన్ చేయించుకున్న టీడీపీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణను గుంటూరులో మంత్రి అనగాని సత్యప్రసాద్ పరామర్శించారు. రాజకీయ లబ్ధి కోసమే మాజీ సీఎం జగన్ వినుకొండ హత్య ఘటనపై ఆరోపణలు చేస్తున్నారని, ఆ హత్య కేవలం ఇద్దరి మధ్య వ్యక్తిగత కక్షల కారణంగా జరిగిందని ఆయన అన్నారు.
గత ప్రభుత్వంలో జగన్, ఆయన అనుచరులు బాగుపడటం తప్ప రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదని విమర్శించారు. ఈ క్రమంలో నిర్లక్ష్యానికి గురైన రాజధాని నిర్మాణాన్ని సీఎం చంద్రబాబు పునఃప్రారంభించారని తెలిపారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా భూములు దోచుకునేందుకు ప్రయత్నించిందని ఆరోపించిన ఆయన గత ప్రభుత్వంలో జరిగిన భూ కబ్జాలపై సమగ్ర విచారణ జరుపుతామని తేల్చి చెప్పారు. గుజరాత్ తరహా భూ హక్కు చట్టం తెచ్చేందుకు కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందని మంత్రి సత్యప్రసాద్ వెల్లడించారు.
రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరడం రాజకీయాల్లో జగన్ అపరిపక్వతకు అద్దం పడుతుందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఎద్దేవా చేశారు. ఐదేళ్లు సీఎంగా, మరో ఐదేళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్‌కు రాజకీయాల్లో పరిపక్వత రావాల్సి అవసరం ఉందన్నారు. నాలుగైదు వారాలు కూడా నిండని ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదన్నారు. కేవలం అధికారం కోసం మాత్రమే మాజీ సీఎం జగన్ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
గత ప్రభుత్వంలో జరిగిన దేవాలయ భూముల దోపిడీ, ఆక్రమాలపై ఇప్పటికే విచారణ చేపట్టామని అన్నారు. ఈ క్రమంలో ఆలయాలకు చెందిన భూముల్ని తిరిగి ఆ దేవాలయాలకు అప్పజెప్పడం ప్రభుత్వం బాధ్యత అని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ సర్కార్ ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేసిందని, రేపటి నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో రహదారులు, డ్రైనేజీ కాలువల మరమ్మతులకు సంబంధించిన నిధులు గురించి ప్రస్తావించనున్నట్లు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు.
వ్యవస్థలపై గౌరవరం లేని వ్యక్తి జగన్ అని మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మండిపడ్డారు. గత ఐదేళ్లు నియంత పాలన సాగించారని విమర్శించారు. దళితులు, మైనర్లపై వైఎస్సార్సీపీ నాయకులు అత్యాచారాలు, హత్యలు చేసినా ఏనాడూ స్పందించిన పాపాన జగన్ పోలేదన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో శాంతిభద్రతల గురించి మాట్లాడే అర్హత జగన్‌కు లేదని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు చెప్పారు.