Minister Satyakumar on Achyutapuram SEZ incident: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లోని ఫార్మా కంపెనీలో పేలుడు ఘటనపై ప్రభుత్వం తక్షణం స్పందించి చర్యలు చేపట్టిందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు. ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోవడం, 35 మంది వరకు గాయపడిన దుర్ఘటన దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. సీఎం చంద్రబాబు సమాచారం తెలిసిన వెంటనే సంబంధిత మంత్రులు, ఉన్నతాధికారులను అప్రమత్తం చేశారని అన్నారు. వారితో ఎప్పటికప్పుడు మాట్లాడి క్షేత్రస్థాయిలో సహాయక చర్యలు వేగవంతంగా జరిగేలా చూడాలని అన్నారు.
బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేయడమే కాకుండా ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శిని ఘటన స్థలానికి పంపించారని మంత్రి చెప్పారు. వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్లో కొందరు కోలుకుని ఇళ్లకు చేరారని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాల్సి ఉందని గతంలోనూ ఈ తరహా ఘటనలు జరిగాయనని అన్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా తగిన చర్యలు చేపట్టేలా రాష్ట్ర ప్రభుత్వం తగిన ప్రణాళిక రూపొందిస్తుందని మంత్రి సత్యకుమార్ న్నారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లోని కొరతలను అధిగమించేందుకు సంబంధిత అధికారులతో సమీక్షించి కార్యాచరణ రూపొందించామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. తక్షణం చేపట్టాల్సిన పనులతోపాటు స్వల్పకాలిక, దీర్ఘకాలిక చర్యలపై ప్రణాళిక రూపొందించాలని ఆదేశించినట్లు తెలిపారు. టీచింగ్ ఆసుపత్రులో తీసుకోవాల్సిన చర్యల గురించి ఆడిట్ జరుగుతోందని వీటి పర్యవేక్షణకు ఓ అధికారిని నియమించామని చెప్పారు. ప్రజల్లో ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం పెంచేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు.
విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో వారధి పేరిట నిర్వహిస్తోన్న ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో భాగంగా మంత్రి తెలిపారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారదిగా ఉంటూ సమస్యలు పరిష్కరించాలనే దిశగా వారధి కార్యక్రమం జరుగుతోందన్నారు. ప్రజా సమస్యలు వినడం ఫిర్యాదు స్వీకరించడం కొన్నింటిని వెంటనే పరిష్కరించడం మరికొన్ని సంబంధిత శాఖలకు పంపించి తదుపరి చర్యలను వారికి వివరించేలా చేస్తున్నామన్నారు. ఆరోగ్యశాఖ మంత్రిగా తనకు వ్యక్తిగత, ప్రజారోగ్య అంశాలపై వినతులు వస్తున్నాయని 70 శాతం వరకు వస్తోన్న ఫిర్యాదుల్లో భూకబ్జాల గురించినవే ఉంటున్నాయని చెప్పారు.
అచ్యుతాపురం ఫార్మా కంపెనీ మృతుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం - Ex gratia in Atchutapuram incident