Minister Ponguleti Fires on BRS Party : గోదావరి జలాలను ఎత్తిపోసి ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాలోని రైతాంగానికి సాగునీరు అందించేందుకు గత ప్రభుత్వం చేపట్టిన సీతారామ ప్రాజెక్టు ద్వారా ఇప్పటికీ రూ.8500 కోట్లు ఖర్చు చేసినప్పటికీ ఒక్క ఎకరాకు కూడా సాగునీరు ఇవ్వకపోవడం హాస్యాస్పదంగా ఉందని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలోని తోడేళ్లగూడెం వద్ద కొనసాగుతున్న కాలువ పనులు, ఇతర పనులను ఆయన పరిశీలించారు. సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధికారులు మ్యాప్ ద్వారా పనుల నిర్వహణ తీరును మంత్రికి వివరించారు. పనులను వేగవంతం చేసి, వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
రూ.8500 కోట్లు ఖర్చు చేసినప్పటికీ సాగునీరు ఇవ్వకపోవడం శోచనీయం : ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం జలయజ్ఞంలో భాగంగా రాజీవ్ సాగర్, ఇందిరాసాగర్ ప్రాజెక్టులను చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించగా గత ప్రభుత్వం రీడిజైన్ పేరుతో సీతారామ ప్రాజెక్టును తీసుకొచ్చిందన్నారు. గత ప్రభుత్వం రీడిజైన్ పేరుతో ఈపీసీలో చేర్చి రూ.2800 కోట్లతో 2.75 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు.
మొదట రూ.9 వేల కోట్లను మంజూరు చేసినట్లు చెప్పారన్నారు. అనంతరం రూ.18 వేల కోట్లకు పెంచారన్నారు. గత ప్రభుత్వం చేపట్టిన ఈ పథకం ద్వారా ఇప్పటికే రూ.18 వేల కోట్లలో రూ.8500 కోట్లు ఖర్చు చేసినప్పటికీ సాగునీరు ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. పేదల ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని పనులను వేగవంతం చేసి పనులు పూర్తి చేసి రైతాంగానికి సాగునీరు అందించడమే లక్ష్యమన్నారు.
Minister Ponguleti Visit Sitarama Project Canals : రానున్న ఆగస్టు 15 నాటికి నాగార్జునసాగర్ కాలువ ద్వారా 1.55 లక్షల ఎకరాల ఆయకట్టుతో పాటు మీడియం ప్రాజెక్టులైన వైరా, లంక సాగర్ల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు రూ. 100 కోట్లు ఖర్చు చేసి ఏన్కూర్ వద్ద లింకు కెనాల్‌ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
ఎన్నికల ముందు రైతాంగానికి ఇచ్చిన హామీలను ఇందిరమ్మ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. మరికొద్ది రోజుల్లో ఏకకాలంలో రైతులకు రెండు లక్షల రుణాలను మాఫీ చేయనున్నట్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మంత్రి వెంట డోర్నకల్ శాసనసభ్యుడు రామచంద్రనాయక్ ఉన్నారు.
పరిహారం తేల్చకుండా సీతారామ ప్రాజెక్టు పనులు - ఆందోళనలో భూనిర్వాసితులు - sitarama projects Works