Minister Peddireddy Ramachandra Key comments: కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే చనిపోయిందని, దహన సంస్కారాల కోసమే షర్మిలను పార్టీలోకి తీసుకువచ్చారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎద్దేవా చేశారు. తిరుపతి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న పెద్దిరెడ్డి, 2024లో జరగబోయే ఎన్నికల్లో మరో మారు జగన్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
బయటపడ్డ వర్గ విభేదాలు: తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం మేనకూరు పంచాయతీ పరిధిలో వైఎస్ రాజశేఖరరెడ్డి స్మృతి వనంతో పాటుగా, పలు అభివృద్ధి కార్యక్రమాలను వైఎస్సార్సీపీ మంత్రి పెదిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో వేదిక పైకి గిరిజన సర్పంచి సురేష్‌ను పిలవలేదు. సభకు ఆయనే అధ్యక్షత వహించాల్సి ఉంది. కానీ వేదిక పైకి పిలవకుండా సర్పంచ్‌ను అవమానించారు. అదే పార్టీకి చెందిన వ్యక్తి అయినా పిలవకుండా నాయకులు మాట్లాడారు. సభ మొదలయ్యాక సర్పంచ్‌ను పిలవకపోవడంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించే ప్రయత్నం చేశారు. వెంటనే తేరుకున్న వైఎస్సార్సీపీ నేతలు సర్పంచ్‌ను వేదిక పైకి పిలిచారు. ఈ సమావేశంలో పార్టీలోని వర్గ విభేదాలు బట్టబయలు అయ్యాయి. ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య వ్యతిరేక వర్గీయుడైన జిల్లా అధికార ప్రతినిధి కట్టా సుధాకర్ రెడ్డి ఎమ్మెల్యే వర్గీయులపై ఘాటు విమర్శలు చేశారు. తప్పుడు ప్రచారం చేస్తే నాలుక కోస్తానని హెచ్చరించారు. మరో నాయకుడు సూళ్లూరుపేట నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి బాగా లేదన్నారు. మంత్రి పెదిరెడ్డి మాట్లాడుతూ అందరినీ కలుపుకుని పోవాలని లేకుంటే ఇటీవల కొంతమంది ఎమ్మెల్యేలను మార్చారని, అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దని నేతలను సున్నితంగా హెచ్చరించారు. ఎన్నికల సమయంలో అసంతృప్తి సహజంగా ఉంటుందని, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సరైన పనితీరు కనపరచని వారికి పార్టీ టికెట్ నిరాకరించిందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.
అటవీ శాఖకు నూతన వాహనాలు: తిరుపతిలోని మంత్రి కార్యాలయం వద్ద అటవీ శాఖకు సంబంధించిన 10 నూతన వాహనాలను ఆయన ప్రారంభించారు. రాష్ట్రంలో అటవీ శాఖ బాగా పనిచేస్తుందని మంత్రి తెలిపారు. అటవీ శాఖ సిబ్బంది మరింత మెరుగ్గా పనిచేసేందుకు వాహనాలు అందిస్తున్నామన్నారు. టికెట్లు ఇవ్వని వారు అసంతృప్తితో ఉండటం సాధారణమేనని అన్నారు. గెలిచే వారికే టికెట్ ఇవ్వాలని పార్టీ ఆలోచనలో ఉన్నట్లు ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే చనిపోయిందని, దహన సంస్కారాలకు షర్మిలను తీసుకొచ్చారన్నారు. చంద్రబాబు, కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీ భారీ విజయం సాధిస్తుందన్నారు. 2024లో జరగబోయే ఎన్నికల్లో సీఎం జగన్ ఆధ్వర్యంలో మరో మారు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది ధీమా వ్యక్తం చేశారు. అభ్యర్థుల మార్పు అంశంలో వస్తున్న అసంతృప్తిని పట్టించుకోబోమని చెప్పారు.