Minister Nimmala Ramanaidu on Polavaram Project: పోలవరం ప్రాజెక్టును నాశనం చేసింది జగన్ ప్రభుత్వమే అని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు ఎత్తును 41.15 మీటర్లకు కుదించేలా జగన్ హయాంలోనే కేంద్రానికి లేఖలు రాశారని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర జలశక్తి శాఖకు రాసిన లేఖల్లోనూ పదేపదే 41.15 మీటర్ల ఎత్తునే ప్రస్తావిస్తూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం లేఖలు రాసిందని గుర్తు చేశారు. పోలవరం డయాఫ్రామ్ వాల్ ధ్వంసమయ్యేలా వరద నీటికి వదిలేసిందీ జగన్ సర్కారే అని విమర్శించారు.
సొంత తల్లిని, చెల్లిని మోసం చేస్తూ కోర్టుకెళ్లిన జగన్ ఆ విషయాన్ని దారి మళ్లించేందుకే పోలవరం ఎత్తుపై దుష్ప్రచారం మొదలు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం 41.15 మీటర్ల ఎత్తు అంటూ కేంద్రానికి లేఖలు రాసినప్పుడే అసెంబ్లీలో ఆందోళన చేశామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు 45.72 మీటర్లకే రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఆ స్థాయికే నీళ్లు నిలబెట్టి ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు.
సీఎం చంద్రబాబుతో నీతి ఆయోగ్ సీఈఓ భేటీ - స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్పై చర్చ
బుడమేరు వరద బాధితులకు సంబంధించి పెండింగులో ఉన్న దరఖాస్తులను 15 రోజుల్లోపు పూర్తి చేయాలని బీమా సంస్థల ప్రతినిధులను, ప్రభుత్వ అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. బాధితులకు పంపిణీ చేసిన పరిహారంపై అధికారులతో సచివాలయంలో బుధవారం సీఎం సమీక్ష నిర్వహించారు. వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో కూడా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఆ జిల్లాల పరిస్థితిని సమీక్షించారు. మొత్తం 4,21,698 మందికి రూ.625 కోట్లు ఆర్థిక సాయం అందించామని తెలిపారు. కేవలం 70 మందికి మాత్రమే ఇంకా పరిహారం అందలేదని అది కూడా వారి బ్యాంక్ ఖాతాలు యాక్టివ్ గా లేకపోవడం వల్లనే సమస్య వచ్చిందని మరో 200 దరఖాస్తులు ఇప్పటికీ పరిశీలనలో ఉన్నాయని వివరించారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ సాయం అందించాలనే ప్రయత్నంలో తాము ఉన్నామని సీఎం చంద్రబాబు అన్నారు. చివరి బాధితుడి వరకు ప్రభుత్వ సాయం చేరుతుందని వివరించారు. ఎన్టీఆర్ జిల్లాలో వరదలకు నష్టపోయిన వాహనదారులకు బీమా చెల్లింపు దరఖాస్తుల్లో ఇంకా 262 పెండింగులో ఉండటంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. పెండింగులో ఉన్న క్లెయిమ్ దరఖాస్తులన్నీ 15 రోజుల్లో పరిష్కరించి బాధితుల ఖాతాలో బీమా సొమ్ము జమ చేయాలని బీమా సంస్థల ప్రతినిధులు, అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. భవిష్యత్తులో విజయవాడకు వరద ప్రమాదం లేకుండా శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు యుద్ధప్రాతిపదికన చేపట్టాలని ఆదేశించారు.