TDP Leader Srinu Murder in Kurnool : కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేత దారుణ హత్యకు గురయ్యారు. పత్తికొండ మండలం హోసూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. టీడీపీ నేత, మాజీ సర్పంచ్ వాకిటి శ్రీనివాసులు (45) బుధవారం తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్లగా దుండగులు ఆయన కళ్లలో కారం చల్లి దారుణంగా హతమార్చారు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, గ్రామస్థులు ఘటనాస్థలికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. సమాచారం అందుకున్న డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, సీఐ జయన్న ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించి విచారణ చేపట్టారు. తాజా ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించిన శ్రీనును వైఎస్సార్సీపీ నేతలే హత్య చేయించి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
జగన్ అండ్ కో తమ పాత పంథా మార్చుకోలేదు : వాకిటి శ్రీనివాసులును వైఎస్సార్సీపీ మూకలు దారుణంగా హత్య చేశారని మంత్రి నారా లోకేశ్ ఆరోపించారు. హత్యను తీవ్రంగా ఖండించారు. ఎన్నికల్లో తెలుగుదేశం తరఫున కీలకంగా పని చేశాడనే కక్షతో శ్రీనివాసులు కళ్లల్లోకి కారం కొట్టి కిరాతకంగా హతమార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాక్షేత్రంలో తిరస్కారానికి గురైనప్పటికీ జగన్ అండ్ కో తమ పాత పంథా మార్చుకోకుండా ఇటువంటి దురాగతాలకు పాల్పడుతున్నారని ఆక్షేపించారు. తెలుగుదేశం శ్రేణుల సహనాన్ని చేతగానితనంగా భావిస్తూ, ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడే వారిపై ప్రజా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు. వైఎస్సార్సీపీ మూకల చేతిలో బలైన శ్రీనివాసులు కుటుంబానికి పార్టీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.
కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరులో టీడీపీ మాజీ సర్పంచ్ వాకిటి శ్రీనివాసులును వైసిపి మూకలు దారుణంగా హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎన్నికల్లో టీడీపీ తరఫున కీలకంగా పనిచేశాడనే కక్షతో శ్రీనివాసులు కళ్ళల్లోకి కారం కొట్టి కిరాతకంగా హతమార్చారు. ప్రజాక్షేత్రంలో… pic.twitter.com/Wc3GxqTjR3
— Lokesh Nara (@naralokesh) August 14, 2024
కర్నూలు జిల్లాలో టీడీపీ నేత దారుణ హత్య - వైఎస్సార్సీపీ నేతల పనేనని ఆరోపణలు - TDP Leader Srinu Murder
పార్టీ అండగా ఉంటుంది : కర్నూలు జిల్లాలో శ్రీను హత్యను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఖండించారు. హత్య వెనుక ఎవరున్నా వదిలిపెట్టే సమస్య లేదని స్పష్టం చేశారు. హోసురులో టీడీపీకి భారీ మెజారిటీ రావడంలో శ్రీనుది కీలక పాత్ర అని తెలిపారు. వాకిటి శ్రీను కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
తక్షణమే అరెస్టు చేయాలి : టీడీపీ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు మృతుడి కుటుంబసభ్యులను పరామర్శించారు. హత్య ఘటనకు దారితీసిన పరిస్థితులను డీఎస్పీతో మాట్లాడారు. నిందితులను గుర్తించి తక్షణమే అరెస్టు చేయాలని ఎమ్మెల్యే కోరారు. ఎమ్మెల్యేకు శ్రీనివాసులు ప్రధాన అనుచరుడు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కీలకంగా వ్యవహరించారని గుర్తు చేశారు. మృతుడి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. వైఎస్సార్సీపీకి చెందిన వారే హతమార్చినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సాయంత్రానికి నిందితులను అరెస్ట్ చేస్తాం : శ్రీను హత్య కేసులో ఇప్పటికే ఆధారాలు సేకరించామని సాయంత్రానికి నిందితులను పట్టుకుంటామని కర్నూలు ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఆయన పోలీసులు సహా గ్రామస్థులతో మాట్లాడారు. ఇప్పటికే కొన్ని ఆధారాలు సేకరించినట్లు చెప్పారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ సాయంతో మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నట్లు స్పష్టం చేశారు. అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామని నిందితుల కోసం వేట కొనసాగిస్తున్నామని వివరించారు.
మారణాయుధాలతో బలంగా దాడి : శ్రీనుకు గ్రామంలో ఎవరితో ఎలాంటి గొడవలు లేవని డీఎస్పీ శ్రీనివాసరెడ్డి చెప్పారు. హత్య జరిగిన ప్రాంతానికి కిలోమీటర్ దూరంలో బీర్ సీసాలు గుర్తించినట్లు తెలిపారు. తల వెనుక భాగంలో మారణాయుధాలతో బలంగా దాడి చేసి చంపారని డీఎస్పీ వివరించారు.
అనంతలో వైఎస్సార్సీపీ నాయకుల దుశ్చర్య - టీడీపీ కార్యకర్త దారుణ హత్య - tdp leader murder in anantapur