Minister Nara Lokesh on YS Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా డిమాండ్ చేస్తున్న జగన్‌కు ఆ హుందాతనం ఉందా అని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నిలదీశారు. బురద రాజకీయానికి బ్రాండ్ అంబాసిడర్‌గా మారి అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. పాస్ పోర్ట్ సమస్య లేకపోతే ఎప్పుడో లండన్ ఎగిరిపోవాల్సిన జగన్, బెంగుళూరు ప్యాలస్‌లో రిలాక్స్ అవుతున్నారని మండిపడ్డారు. 74 ఏళ్ల వయస్సులో క్షణం తీరిక లేకుండా వరద బాధితులకు సాయం అందిస్తున్న చంద్రబాబుపై విమర్శలు చెయ్యడానికి మనస్సు ఎలా వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
విపత్తులు వచ్చి ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు సొంత డబ్బుతో కనీసం పులిహోర ప్యాకెట్ అందజేసిన చరిత్ర లేకపోగా, ప్రకటించే సెల్ఫ్ చెక్స్ కథ అందరికీ తెలిసిందేనని విమర్శించారు. నాడు చంద్రబాబు బుడమేరు ఆధునీకరణకు 464 కోట్ల రూపాయలు కేటాయించి పనులు ప్రారంభిస్తే వైఎస్సార్సీపీ రివర్స్ పాలనలో పనులు నిలిపి విపత్తుకు ప్రధాన కారణం అయ్యారని దుయ్యబట్టారు. బుడమేరు పొంగడానికి ప్రధాన కారణం జగన్ మేడ్ డిజాస్టర్ అని ధ్వజమెత్తారు. ఆధునీకరణ, మరమ్మతుల పనులు ఆపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సుమారుగా 500 కోట్ల రూపాయల విలువైన 600 ఎకరాలు వైఎస్సార్సీపీ నాయకులు కబ్జా చేశారని ఆక్షేపించారు. 2022 లోనే గండి పడినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదు ఏళ్లలో సరైన నిర్వహణ లేదని, విజయవాడ నగరంలో స్ట్రోమ్ వాటర్ డ్రైన్ పనులు ఆపేసారని ఆరోపించారు. వైఎస్సార్సీపీ పాలన వైఫల్యాలే నేడు ప్రజలకు కష్టాలు తెచ్చాయని దుయ్యబట్టారు. అన్ని సమస్యలను అధిగమిస్తామని అన్నారు. చివరి వరద బాధితుడికి సాయం అందించే వరకూ విశ్రమించబోమని స్పష్టం చేశారు.
Minister Lokesh Review on Floods: విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. వరద సహాయ చర్యలపై మంత్రి నారాయణ, కలెక్టర్ సృజనతో నారా లోకేశ్ సమీక్షించారు. బుడమేరు గట్ల పటిష్టతపై డ్రోన్ లైవ్ ద్వారా ఇరిగేషన్ అధికారులకు సూచనలు ఇచ్చారు. ఎగువ నుంచి వరదనీరు చేరుతుండటంతో అధికారుల అప్రమత్తం ఉండాలని తెలిపారు. వరద ముంపు ప్రాంతాల ప్రజలకు ఆహారం, తాగునీటికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద ప్రస్తుత వరద ప్రవాహం 4,06,198 క్యూసెక్కులు ఉందని అధికారులు లోకేశ్‌కి వివరించారు.
బుడమేరు గండ్లు పూడ్చివేత - మంత్రులు, అధికారులను అభినందించిన సీఎం - Budmeru Canal Gandi Works