Minister Nara Lokesh Counter to YS Jagan: హింస, విధ్వంసం, అరాచకం, అన్యాయం, అక్రమం, అవినీతి గురించి వైఎస్ జగన్ మాట్లాడటం రోత పుట్టిస్తోందని విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ మండిపడ్డారు. బాధితులనే నిందితులు చేసి గవర్నమెంట్ టెర్రరిజానికి పాల్పడిన ఆ చీకటి రోజులు రాష్ట్రంలో పోయి నెల దాటిందన్నారు. కూటమి ప్రభుత్వం మిగిలిన ఆ అరాచకపు ఆనవాళ్లను కూడా కూకటివేళ్లతో పెకిలించి వేస్తోందని తెలిపారు.
హింస, విధ్వంసం, అరాచకం, అన్యాయం, అక్రమం, అవినీతి గురించి వైఎస్ జగన్ మాట్లాడడం రోత పుట్టిస్తోంది. బాధితులనే నిందితులు చేసి గవర్నమెంట్ టెర్రరిజానికి పాల్పడిన ఆ చీకటి రోజులు రాష్ట్రంలో పోయి నెల దాటింది. కూటమి ప్రభుత్వం మిగిలిన ఆ అరాచకపు ఆనవాళ్లను కూడా కూకటివేళ్లతో పెకిలించి…
— Lokesh Nara (@naralokesh) July 18, 2024
ప్రజా తీర్పుతో ఉనికి కోల్పోయిన జగన్, తాను పేటెంటు పొందిన ఫేక్ ప్రచారాలతో అబద్దపు పునాదులపై మళ్లీ నిలబడాలని చూస్తున్నాడని, అందుకే రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా హత్యా రాజకీయాలంటూ ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నాడని ధ్వజమెత్తారు. శవాలతో రాజకీయాలు చేసే వైఎస్సార్సీపీ విష సంస్కృతికి ప్రజలు ఇచ్చిన తీర్పే మొన్నటి ఎన్నికల ఫలితాలని ఇంకా అర్థం చేసుకోకపోతే ఎలా అని ప్రశ్నించారు.
నేరాలు చేసి, మళ్లీ వాటిని వేరే వారిపై నెట్టడం అనే జగన్ కపట నాటకాలకు కాలం చెల్లిందన్నారు. ప్రజల రక్షణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఏ ఘటననూ ఉపేక్షించేది లేదని, ఏ నిందితుడినీ వదిలేది లేదని తేల్చిచెప్పారు. బెంగళూరు యలహంక ప్యాలెస్‌లో కూర్చుని ఇక్కడ కుట్రలు అమలు చేయాలంటే కుదరదన్నారు. జగన్ హెచ్చరికలు భయపడే ప్రభుత్వం తమది కాదని, ప్రజలకు, వారి మానప్రాణాలకు జవాబుదారీగా ఉండే ప్రజా ప్రభుత్వమని స్పష్టం చేశారు.
YS Jagan Mohan Reddy Tweet: రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని, లా అండ్ ఆర్డర్ ఎక్కడా కనిపించడం లేదని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆరోపించారు. ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని, వైఎస్సార్సీపీని అణగదొక్కాలన్న కోణంలో ఈ దారుణాలకు పాల్పడుతున్నారని ఆక్షేపించారు. కొత్త ప్రభుత్వం వచ్చి నెలన్నర రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ అంటే హత్యలు, అత్యాచారాలు, రాజకీయ కక్షలతో చేస్తున్న దాడులు, విధ్వంసాలకు చిరునామాగా మారిపోయిందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు.
నిన్నటి వినుకొండ హత్య ఘటన దీనికి పరాకాష్ట అని, నడిరోడ్డుపై జరిగిన ఈ దారుణ కాండ ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు. ముఖ్యమంత్రి సహా బాధ్యతతో వ్యవహరించాల్సిన వ్యక్తులు రాజకీయ దురుద్దేశాలతో వెనకుండి ఇలాంటి దారుణాలను ప్రోత్సహిస్తున్నారన్నారు. ఎవరి స్థాయిలో వాళ్లు రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ, పోలీసు సహా యంత్రాంగాలన్నింటినీ నిర్వీర్యం చేశారని జగన్ మండిపడ్డారు. దీంతో నేరగాళ్లు, హంతకులు చెలరేగిపోతున్నారన్నారు. అధికారం శాశ్వతం కాదని, హింసాత్మక విధానాలు వీడాలని చంద్రబాబును గట్టిగా హెచ్చరిస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోంది. లా అండ్ ఆర్డర్ అన్నది ఎక్కడా కనిపించడంలేదు. ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. వైయస్సార్సీపీని అణగదొక్కాలన్న కోణంలో ఈ దారుణాలకు పాల్పడుతున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చి నెలన్నర రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ అంటే హత్యలు, అత్యాచారాలు,…
— YS Jagan Mohan Reddy (@ysjagan) July 18, 2024
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలతో ప్రత్యేక విచారణ జరగాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో దిగజారిన శాంతిభద్రతల పరిస్థితులపై దృష్టిపెట్టాలని ప్రధానమంత్రి మోదీ కి, హోంమంత్రి మంత్రి అమిత్‌షా కి విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలెవ్వరూ అధైర్యపడొద్దని అన్నిరకాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వినుకొండలో టీడీపీ కార్యకర్తల చేతిలో హత్యకు గురైన రషీద్ కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నట్లు జగన్ తెలిపారు.
ఈ రాష్ట్రం నీ తాత జాగీరా జగన్- ధనదాహానికి అంతు లేదా?: లోకేశ్ - Nara Lokesh on YSRCP Offices