Minister Komatireddy Counter to Maheshwar Reddy : బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలను రహదారులు, భవనాల శాఖ (R&B Department) మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఖండించారు. మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సత్యదూరమని పేర్కొన్నారు. తాను అనని మాటలను అన్నట్లుగా అబద్దాలు, తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు.
మహేశ్వర్ రెడ్డే కాంగ్రెస్‌లోకి వస్తానన్నారని, మంత్రి పదవి కావాలని అడిగారని, తమకే సరిపడా మెజార్టీ ఉందని తాను చెప్పినట్లు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు. ఎవరినీ చేర్చుకోవాలనే ఉద్దేశం పార్టీకి లేదని చెప్పిన విషయాన్ని మనసులో పెట్టుకుని, ఏదేదో మాట్లాడుతున్నారని విమర్శించారు. కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, అమిత్ షా (Home Minister Amit Shah) దగ్గరకు వెళ్లి చెప్పినట్లు అనవసరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. మహేశ్వర్ రెడ్డికి దమ్ముంటే నితిన్ గడ్కరినీ, అమిత్ షాను భాగ్యలక్ష్మి ఆలయానికి తీసుకురావాలని, అక్కడ తాను కూడా వచ్చి ప్రమాణం చేస్తానని సవాల్ విసిరారు.
Komatireddy Venkat Reddy Fires on Maheshwar Reddy : ఐదేళ్లకోసారి పార్టీ మారే మహేశ్వర్ రెడ్డి, రాజకీయాల్లో అడుగు పెట్టినప్పటి నుంచి జెండా మార్చని తనపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. మహేశ్వర్ రెడ్డి ప్రజారాజ్యం, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు మారారని మధ్యలో బీఆర్‌ఎస్‌తో (BRS Party) టచ్‌లో ఉన్నట్లు ఆరోపించారు. ఆరుగురు మంత్రులు తమకు టచ్‌లో ఉన్నట్లు, తానే ఎవరినీ చేర్చుకోవాలని ప్రయత్నించడం లేదని చెప్పడం చూస్తే మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నట్లు కనిపిస్తుందని ఆరోపించారు.
మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యల వెనుక పెద్ద కుట్ర ఉందని మండిపడ్డారు. కాంగ్రెస్‌లో పుట్టిన తాను, కాంగ్రెస్ జెండాతోనే పోతానని మంత్రి కోమటిరెడ్డి స్పష్టం చేశారు. ఈ దేశంలో పార్టీ చేరికల కమిటీ పెట్టిన దిగజారుడు పార్టీ బీజేపీనేనని మంత్రి విమర్శించారు. ప్రపంచంలో ఎక్కడా లేనట్టు, చేరికల కమిటీకి ఛైర్మన్‌ను కూడా నియమించారని, అయినా ఒక్క కార్పొరేటర్ కూడా ఆ పార్టీలో చేరలేదని దుయ్యబట్టారు.
ఆర్థికంగా లోటు బడ్జెట్‌తో ఉన్న రాష్ట్రాన్ని ఎంతో కష్టపడి నడిపిస్తున్న ముఖ్యమంత్రిని పట్టుకొని, ఇవాళ సీఎం దిల్లీకి డబ్బులు పంపుతున్నారని కామెంట్లు చేస్తున్నారని ఆక్షేపించారు. తాను షిందేను అవునో కాదో భగవంతుడికి తెలుసని, మహేశ్వర్ రెడ్డి మాత్రం కిషన్ రెడ్డికి (Kishan Reddy), ఈటల రాజేందర్‌కు వెన్నుపోటు పొడిచే నయా గాలి జనార్ధన్ రెడ్డి అని వ్యాఖ్యానించారు. అవకాశం ఇస్తే, రాత్రికి రాత్రే పార్టీ మారతానని బతిమాలిన వ్యక్తి, కాంగ్రెస్‌లో ఏ ఒక్కరూ పట్టించుకోకపోయేసరికి తనపై కామెంట్ చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు.