KTR on BRS Victory : లోక్సభ ఎన్నికల్లో సైలెంట్ ఓటు తమకే అనుకూలంగా ఉంటుందని, మెజార్టీ స్థానాల్లో పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఆ పార్టీకి చెందిన పలువురు లోక్సభ అభ్యర్థులు, ఆయా జిల్లాల నేతలతో ఆయన సుధీర్ఘంగా సమీక్ష నిర్వహించారు.
సైలెంట్ ఓటింగ్ బీఆర్ఎస్కే అనుకూలం : తమ నియోజకవర్గాల్లో పోలింగ్ తీరుతెన్నులు, సరళిని నేతలు కేటీఆర్కు వివరించారు. ఎక్కువగా సైలెంట్ ఓటింగ్ జరిగినట్లు చెప్పారు. సైలెంట్ ఓటింగ్ బీఆర్ఎస్కే అనుకూలంగా ఉందని సర్వే సంస్థలు చెప్పినట్లు కేటీఆర్ పేర్కొన్నారు. కారు పార్టీ అధినేత కేసీఆర్ బస్సుయాత్రతో పరిస్థితుల్లో పూర్తి మార్పు వచ్చిందని యాత్రకు ముందు, యాత్ర తర్వాత తేడా స్పష్టంగా ఉందని ఆయనన్నారు. తమ పార్టీలో మంచి అభ్యర్థులు ఉన్నారని, పార్టీ శ్రేణులు విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లారని కేటీఆర్ పేర్కొన్నారు.
KTR Comments On Congress : అధికార కాంగ్రెస్ పార్టీకి సరైన అభ్యర్థులే కరవైన వైనం స్పష్టంగా కనిపించిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. లోక్సభ ఎన్నికల ఫలితాలపై ప్రస్తుతం రాష్ట్రంలో హస్తం గుర్తు పార్టీ నేతలు భయంతో ఉన్నారని కేటీఆర్ అన్నారు. చాలా నియోజకవర్గాల్లో వివిధ అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయని, అవి బీర్ఎస్కే అనుకూలంగా ఉంటాయని ధీమా వ్యక్తం చేశారు.
అనూహ్య ఫలితాలు వస్తాయి : మెదక్, నాగర్ కర్నూల్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, కరీంనగర్, ఖమ్మం స్థానాల్లో గెలుస్తున్నామని మహబూబాబాద్ లాంటి చోట్ల కూడా అనూహ్య ఫలితాలు వస్తాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ ఒక్క నల్గొండలో మాత్రమే పక్కాగా గెలిచే అవకాశం ఉందని అన్నారు. పెద్దపల్లిలో కాంగ్రెస్ పార్టీ డబ్బులు బాగా పంచిందన్న కేటీఆర్, ధన ప్రభావం ఉంటుందని తాను అనుకోవడం లేదని అన్నారు. తాను సిరిసిల్లలో ఐదుమార్లు గెలిచానని ఒక్కసారి కూడా డబ్బులు పంచలేదని పేర్కొన్నారు.
పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీలోకి సీఎం రేవంత్ రెడ్డి : కేటీఆర్
ఊహాగానాలను పట్టించుకోవద్దు : లోక్సభ ఎన్నికల్లో నేతలు, పార్టీ శ్రేణుల శ్రమతో స్థానికసంస్థల ఎన్నికలకు మంచి పునాది ఏర్పడిందని కేటీఆర్ అన్నారు. ఎమ్మెల్సీ ఉపఎన్నిక కోసం నల్గొండ, వరంగల్, ఖమ్మం పరిధిలోని నేతలు పూర్తి స్థాయిలో పనిచేయాలని పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డి గెలుపు కోసం కృషి చేయాలని తెలిపారు. ఊహాగానాలను పట్టించుకోవద్దని ఎంపీ అభ్యర్థులకు కేటీఆర్ సూచించారు.
మమ్మల్ని తిట్టి మీరెందుకు అప్పులు చేస్తున్నారు? : కేటీఆర్ - KTR Review Meeting on MLC ElECTION