Jeevan Reddy Interesting Comments on CM Revanth Reddy : రాష్ట్రంలో రూ.1450 కోట్లు విలువైన వడ్ల కుంభకోణం జరిగిందని బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆరోపించారు. రూ.2183 కనీస మద్దతు ధర(MSP) ఉంటే 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కేవలం రూ.1900లకే కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మిందని అన్నారు. ఒక్కో క్వింటాల్ పై రూ.600 నష్టం జరిగిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్, ఇతర రాష్ట్రాల వారికి టెండర్లు దక్కాయని, వాటి వివరాలు ఆర్టీఐ కింద అడిగితే ఇవ్వలేదని పేర్కొన్నారు. కేసీఆర్ హయాంలో వడ్ల ఎగుమతి జరిగితే కాంగ్రెస్ హయాంలో దేశమంతా కరెన్సీ ఎక్స్పోర్ట్ జరుగుతోందని జీవన్ రెడ్డి తీవ్రంగా వ్యాఖ్యానించారు.
Jeevan Reddy on Paddy MSP Rate : సీఎంకు ధనసేకరణ మీద ఉన్న ధ్యాస ధాన్యం సేకరణపై లేదని జీవన్‌రెడ్డి(Jeevan Reddy) ఆరోపించారు. రూ.1450 కోట్లలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వాటా ఎంత అని ప్రశ్నించారు. కోమటిరెడ్డి సోదరులు, సుదర్శన్ రెడ్డి, జూపల్లి, రేవంత్ రెడ్డి వాటా ఎంత అని నిలదీశారు. ధాన్యం టెండర్ల వ్యవహారంపై సీబీఐ, ఈడీ విచారణ ఎందుకు జరగలేదని ప్రశ్నించారు. ఈ విషయంలో కిషన్ రెడ్డితో సహా బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడలేదని అనుమానం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోళ్ల అంశంపై సీబీఐ, ఈడీకి లేఖ రాస్తామని పేర్కొన్నారు. తెలంగాణ రైతుల కష్టం దేశంలో కాంగ్రెస్‌కు పోతోందని తెలిపారు. రాష్ట్రంలో బోగస్ తప్ప రైతు భరోసా, బోనస్ లేదని ఎద్దేవా చేశారు. తెలంగాణలో ఆర్ఆర్ పన్ను వసూలు చేస్తున్నారని మండిపడ్డారు.
Jeevan Reddy Fire on CM Revanth Reddy : రాష్ట్రంలో నిత్యం కార్తీకదీపం సీరియల్ నడుపుతున్నారని జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఐఎన్‌సీ అంటే ఇండియన్ నేషనల్ కరప్షన్ పార్టీ అని అన్నారు. దిల్లీలో మోదీయిజం అయితే ఇక్కడ రేవంత్ రెడ్డిది రౌడీయిజమని ఆరోపించారు. 420 సీఎం కారాదని ఆకాంక్షించారు. కాంగ్రెస్ ఇచ్చిన అన్ని హామీలు అమలు కాకపోయినా రైతులకు ఇచ్చినవైనా నెరవేర్చాలని కోరారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్(BRS) 17 స్థానాలు గెలుస్తుందన్న విశ్వాసంతో ఉన్నామని ధీమా వ్యక్తం చేశారు. తనపై కేసులు పెట్టి వేధిస్తున్నారని, తాను కేసీఆర్‌తోనే ఉంటానని స్పష్టం చేశారు.
"రాష్ట్రంలో 1450 కోట్ల రూపాయల విలువైన వడ్ల కుంభకోణం జరిగింది. రాష్ట్ర రైతుల కష్టం దేశంలో కాంగ్రెస్‌కు వెళ్తోంది. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ 17 స్థానాలు గెలుస్తుంది. నాపై కేసులు పెట్టి వేధిస్తున్నారు. నేను కేసీఆర్‌తోనే ఉంటాను."- బీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి