Amaravati Effect on Ysrcp Candidates : ఓ వైపు బలమైన ప్రత్యర్థులు, మరోవైపు ద్వితీయ శ్రేణి వలసలు, ఇంకో వైపు రోజురోజుకూ ప్రజల్లో వ్యతిరేకత వెరసి ఓటమి తప్పదన్న సంకేతాల నేపథ్యంలో అధికార పార్టీ వైఎస్సార్సీపీ అభ్యర్థులు పోటీకి వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రాజధాని అమరావతి ఎఫెక్ట్ స్పష్టంగా కనిపిస్తోంది. పరిస్థితులను పసిగట్టిన అధిష్ఠానం ఆయా జిల్లాల్లోని మెజార్టీ స్థానాల్లో మార్పులు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.
వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి వలసలు : గుంటూరులో వైసీపీ ఎంపీ అభ్యర్థి రోశయ్య పోటీకి విముఖత చూపుతున్నట్లు తెలుస్తోంది. ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత, వైసీపీ నుంచి వలసలు కొనసాగుతున్న తరుణంలో పోటీ చేయలేనంటూ చేతులెత్తేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కత్తెర క్రిస్టినా వైఎస్సార్సీపీకి రాజీనామా చేయడం పుండు మీద కారం చల్లినట్లుగా మారింది. పార్టీ కార్యక్రమాలకు గతకొంత కాలంగా ఆమె దూరంగా ఉంటున్నారు. క్రిస్టినా భర్త కత్తెర సురేష్ కుమార్ తాడికొండ నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్గా పని చేస్తూ టికెట్ ఆశించారు. కానీ, వైసీపీ అధిష్ఠానం సుచరితను ప్రకటించడంతో కార్యకర్తల్లో ఆగ్రహం పెల్లుబికింది. దీంతో దంపతులిద్దరూ టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు.
కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రాజధాని ఎఫెక్ట్ : ఉభయ కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థుల గెలుపోటములపై రాజధాని ప్రభావం ఉంటుందని స్పష్టంగా తెలుస్తోంది. అమరావతిని రాజధాని చేస్తామని, ఇక్కడే నివాసం ఉండేందుకు ఇల్లు కూడా కట్టుకుంటున్నామని గత ఎన్నికలకు ముందు జగన్ ప్రకటించడం తెలిసిందే. అటు సొంత పార్టీ అభ్యర్థులతో పాటు ప్రజలను నమ్మించి ఓట్లు దండుకున్న జగన్ ఆ తర్వాత అమరావతిని పక్కన పెట్టేశారు. మూడు రాజధానులు అంటూ తాను విశాఖకు మకాం మార్చేందుకూ యత్నించారు. ఈ నేపథ్యంలో ఆ రెండు జిల్లాల్లో అధికార పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నట్లు తెలుస్తోంది.
మొక్కుబడి ప్రచారం.. ధనబలంపైనే నమ్మకం : ఓటమి తప్పదన్న సమాచారం, అంతర్గత సర్వేల ఫలితాల నేపథ్యంలో వైసీపీ అభ్యర్థులు ఎన్నికల్లో మొక్కుబడిగా ప్రచారం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరికొందరు అభ్యర్థులు ప్రజల్లోకి వెళ్లకుండా ధనబలాన్నే నమ్ముకుని పంపకాలు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే వస్త్రాలు, గిఫ్ట్లు ఎరవేసి టోకెన్లు పంపిణీ చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీల నేతలు అప్రమత్తమై అడ్డుకుంటున్న పరిస్థితుల్లో ప్రజల్లో విద్వేషాలను రెచ్చగొడుతూ భౌతిక దాడులకు పాల్పడుతున్నారు.
మెజార్టీ స్థానాల్లో మార్పులు ఖాయం : నియోజకవర్గ ఇన్చార్జుల నియామకం, అభ్యర్థుల ఎంపికలో పలు దఫాలుగా మార్పులు చేసిన తాడేపల్లి క్యాంపు కార్యాలయం.. ఏక కాలంలో 175 స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తున్నట్లుగా గొప్పలు చెప్పుకోవడం విదితమే. కాగా, జాబితాలో మరిన్ని మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. కొన్ని స్థానాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత, మరికొన్ని నియోజకవర్గాల్లో స్థానికేతరులకు అవకాశమిచ్చారంటూ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తల్లో అసంతృప్తి రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో వారిని బుజ్జగించే దిశగా మార్పులు ఖాయమన్న సంకేతాలు వ్యక్తమవుతున్నాయి.