Importance of cast vote in Elections : పూర్వం రాజులు, మత పెద్దలను ఎన్నుకోవడానికి యూరోప్‌లోని కొన్ని దేశాల్లో ఓటును తీసుకొచ్చారు. అది కూడా నచ్చిన వారికి మద్దతుగా చేతులుపైకి లేపి ఎన్నుకునేవారు. అలా కాలక్రమంలో బ్యాలెట్ పేపర్లతో నాయకుడిని ఎన్నుకోవడం చేశారు. ఇప్పుడు ఈవీఎంలతో పాటు ఒక్కో దేశంలో ఒక్కో రకంగా ఎన్నికల నిర్వహణ జరుగుతుంది. ముఖ్యంగా భారత్ లాంటి ప్రజాస్వామిక దేశంలో ఎన్నికలనేవి ఒక పెద్ద పండుగ. ఎక్కడున్నా ఎన్నికల రోజు ఎక్కడైతే ఓటు ఉందో, ఆ ప్రాంతానికి చేరుకుని ప్రజలు ఓటు వేస్తుంటారు.
ఎన్నో వ్యయ ప్రయాసాలతో ప్రయాణాలు చేసి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కొన్నేళ్లుగా భారత్‌లో జరుగుతున్న తంతు ఇది. అతిపెద్ద ప్రజా స్వామ్య దేశమైన భారత్‌లో ఎన్నికలంటే ఒక పెద్ద ప్రక్రియ. సినిమా టికెట్ల కోసం ఎలాగైతే క్యూలో నిలబడతామో ఓట్ల కోసం కూడా ఎంతసేపైనా లైన్లలో నిలబడే వారు మన దగ్గరా ఉన్నారు. కానీ, రాను రాను నిర్లక్ష్యం చేస్తూ ఓటును వేయడమే మరిచిపోతున్నారు.
Voting Process in India : నాయకుడితో పాటు దేశం తలరాతను సైతం మార్చే సత్తా ఓటుకు ఉంది. రాజకీయ అధికారంలో ప్రజలను భాగస్వాములను చేయడం ద్వారా తమను తాము పాలించుకోవడానికి ఉద్దేశించిన ప్రభుత్వ విధానమే ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామానికి ప్రాతిపదిక ఎన్నికల్లో ప్రజలు వేసే ఓటు. తాము ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం బరిలో నిలిచిన అభ్యర్థుల్లో సమర్థుడుని నిర్ణయించి గెలిపించుకునే అవకాశం పౌరులకు కల్పిస్తోంది ఓటు. ప్రజలు అంతిమంగా విచక్షణతో వినియోగించుకునే ఓటు ద్వారానే ప్రభుత్వ స్వరూపం, స్వభావం ఆధారపడి ఉంటాయి. ప్రభుత్వం మంచిదైనా, చెడ్డదైనా దాన్ని ఏర్పాటు చేసుకున్నబాధ్యత అంతిమంగా ప్రజలదే. భవిష్యత్తులో ఈ ప్రభుత్వం ఎందుకు వచ్చిందా అనే బాధ పడేకన్న ఈనాడు నువ్వు వెళ్లి ఓటు వేసి ఒక మంచి నాయకుడిని ఒక మంచి వ్యక్తిని గెలిపించుకోవచ్చు. అది నీ చేతిలో పనే.
ఓటు బాధ్యత కూడిన హక్కు : మంచి నాయకత్వం లేకుండా, మంచి ప్రభుత్వం, సమాజం సాకారం కావు. మంచి నాయకులు సమాజానికి సేవ చేస్తే, దుష్ట నాయకులు దోచుకుంటారు. సమాజమే తమకు సేవ చేసే విధంగా మలచుకుంటారు. అలాంటి ఉదాహరణలు నేటి సమాజంలో మనం చూస్తున్నాం. అదే నువ్వు ఒక సమర్థ నాయకుడిని ఎన్నుకోవడానికి వేస్తే ఈ తలనొప్పి ఉండదు కదా. మంచి నాయకులను ఎన్నుకోవడానికి, తద్వారా మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ప్రజలకు దక్కిన వెలకట్టలేని ఆయుధం ఓటు. నేతలతో పాటు, తమ చుట్టూ ఉన్న సమాజం, తద్వారా దేశం తలరాతను మార్చే సత్తా ఓటుకు ఉంది. అందుకే ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్ఠంగా ఉండాలంటే ప్రతి పౌరుడు ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలి. ఓటు అంటే బాధ్యతతో కూడిన ఒక హక్కు. ఆ హక్కును వినియోగించుకోవడం నీకు రాజ్యాంగం కల్పించిన గొప్ప అవకాశం.
Reasons of Voting is Important : ప్రతి ఓటు ప్రజల జీవితాలని మెరుగుపరచడానికి ఉపయోగపడే అమూల్యమైన సాధనం. ప్రజాస్వామ్య పునాదులు పటిష్ఠంగా ఉండాలంటే ఓటు వేసి తీరాల్సిందే పౌరులు వేసే ఓటు కేవలం నాయకులు, ప్రజాస్వామ్యాన్నే కాదు దేశ భవిష్యత్తును కూడా నిర్ణయిస్తుంది. ఓటు ద్వారా తాము గెలిపించిన నాయకుడు బాధ్యతతో పని చేస్తే ఆయన ఇచ్చిన హామీలను నెరవేర్చే అవకాశం ఉంటుంది. పాలనలో పారదర్శకత కనిపిస్తుంది. ఓటుకు ఇంత బలం ఉంది కనుకే నీ ఒక్క ఓటును నువ్వు విస్మరించకూడదు.
ఓటు ఒక వజ్రాయుధం - మరి ఓటేస్తానికి మీరు సిద్ధమా
Reason of Voting Percentage Reduce : ప్రస్తుతం మారుతున్న జీవన పరిస్థితుల దృష్ట్యా ప్రజలు వివిధ రంగాలలో తలమునకలై ఉంటున్నారు. ఓటింగ్ రోజు తమ ఓటు హక్కు వినియోగించుకోకపోవడంతో ఓటింగ్ శాతం మెరుగైన స్థాయిలో నమోదు కావడం లేదు. ముఖ్యంగా పట్టణాల్లో ఉన్నటువంటి ప్రజల్లో పోలింగ్ స్టేషన్లకు వెళ్లడానికి కొంత అనాసక్తి కనపడుతోంది. ఇంకా నా ఒక్క ఓటే కదా ఏమవుతుందిలే అన్న నిర్లక్ష్యం. నువ్వు ఒక్కడివే మరి నీలా ఒక్కరు ఒక్కరు లక్షల మంది అవుతున్నారు. 100 శాతం కాదు కదా కనీసం 80 నుంచి 90 శాతం కూడా ఓటింగ్ శాతం నమోదుకావడం లేదు. అందుకే ఒక్క ఓటును వేయండి సమాజ గతిని మార్చండి.