IIT Madras Team Visit Amaravati : మద్రాస్ ఐఐటీ నిపుణుల బృందం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పర్యటించింది. సెక్రటేరియట్, హెచ్‌వోడీ భవనాలు, హైకోర్టు నిర్మాణాల పటిష్ఠతను ఇంజినీర్లు అధ్యయనం చేశారు. ఐకానిక్ టవర్ల వద్ద రాఫ్ట్ ఫౌండేషన్‌ను ఐఐటీ మద్రాస్ నిపుణులు పరిశీలించారు. ఎస్డీఆర్‌ఎఫ్ సిబ్బందితో కలిసి నీటిలో మునిగిన నిర్మాణాలను పరిశీలించారు. గత టీడీపీ ప్రభుత్వంలోనే ఐకానిక్ భవనాల కోసం ఫౌండేషన్ల నిర్మాణం పూర్తైంది.
ఐదేళ్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో సెక్రటేరియట్ ప్రధాన టవర్ల పునాదులు నీటిలో నానుతున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్ల నిర్మాణాలను ఐఐటీ హైదరాబాద్ బృందం పరిశీలించిన సంగతి తెలిసిందే. రెండు బృందాలు అధ్యయనం అనంతరం ప్రభుత్వానికి నివేదిక అందించనున్నాయి.
కట్టడాల పటిష్టతను నిర్ధారించేందుతు నిపుణుల కమిటీ : ఏపీ రాజధాని అమరావతిలో అసంపూర్తిగా నిలిచిన కట్టడాల సామర్థ్యాన్ని అధ్యయనం చేసేందుకు ఐఐటీ నిపుణులు ఆంధ్రప్రదేశ్‌కు చేరుకున్నారు. టీడీపీ సర్కార్‌లో అమరావతి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత 2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక వీటిని ఆపేసింది. తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమరావతి పునర్నిర్మాణంపై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా కట్టడాల పటిష్టతను శాస్త్రీయంగా నిర్ధారించాక ముందుకు వెళ్లాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో వీటి సామర్థ్యాన్ని తేల్చే బాధ్యతను ప్రభుత్వం ఐఐటీ మద్రాస్, ఐఐటీ హైదరాబాద్‌లకు అప్పగించింది. ఈ క్రమంలోనే ఆయా నిర్మాణాల పటిష్ఠత, ఇతర సాంకేతిక అంశాలను ఐఐటీ నిపుణులు పరిశీలిస్తున్నారు.
ఈ క్రమంలోనే శుక్రవారం ఐఐటీ హైదరాబాద్ నిపుణుల బృందం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాలను పరిశీలించిన సంగతి తెలిసిందే. నిర్మాణాల పరిశీలన అనంతరం ప్రొఫెసర్లు సుబ్రమణ్యం, మున్వర్‌బాషా మీడియాతో మాట్లాడారు. నిర్మాణ సామగ్రి తాజా స్థితి అంచనా వేయాల్సి ఉంటుందని చెప్పారు. సాంకేతికతను పూర్తిగా పరిశీలించాక ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని తెలిపారు. నిర్మితమైన భవనాల వద్ద సాంకేతికత, సామగ్రిని కూడా పరీక్షిస్తామని పేర్కొన్నారు. నివేదికకు ఎంతకాలం పడుతుందన్నది ఇప్పుడే స్పష్టంగా చెప్పలేమన్నారు. సాధ్యమైనంత త్వరగా సీఆర్డీఏకు, ప్రభుత్వానికి నివేదికిస్తామని వారు వెల్లడించారు.