Amit Shah about BJP : తెలంగాణ ప్రభుత్వ స్టీరింగ్ ఇప్పటికీ ఓవైసీ చేతిలోనే ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం రిజర్వేషన్లు రద్దు చేస్తున్నట్లు కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. తన వీడియోను ఎడిట్ చేసి తప్పుడు ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్లీ ఆర్టికల్ 370ని పునరుద్ధరిస్తారని, ట్రిపుల్ తలాక్‌ను కూడా తీసుకొస్తారని ఆరోపించారు. ఇవాళ హైదరాబాద్ ఐటీసీ కాకతీయ హోటల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్ర మిగులు బడ్జెట్ ఇప్పుడు అప్పులపాలయ్యిందని అమిత్ షా అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేసినట్లే, కాంగ్రెస్ కూడా చేస్తోందని ఆరోపించారు. మైనార్టీలకు ఇచ్చిన 4 శాతం రిజర్వేషన్లు తొలగించి బీసీలకు ఇస్తామని ఉద్ఘాటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒక్కటీ కూడా అమలు కావటం లేదని ఎద్దేవా చేశారు. హస్తం నేతలు మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామన్నారని, అదీ లేదన్నారు. రైతుభరోసా కింద రూ.15 వేలు ఇస్తామన్నారని, కానీ ఇవ్వలేదని మండిపడ్డారు. కౌలు రైతులకు రూ.15 వేలు, విద్యార్థులకు రూ.5 లక్షలు ఇస్తామన్నారని, ఇప్పటివరకు అమలు చేయలేదని విమర్శించారు.
Amit Shah about Modi Replace after 75 Years : 75 ఏళ్ల వయస్సులో నరేంద్రమోదీ ప్రధానిగా ఉండరనేది అవాస్తవమని, ఆయనే ప్రధానమంత్రిగా ఉంటారని కేంద్రమంత్రి అమిత్‌షా తెలిపారు. మూడు విడతల్లో ఎన్డీయే 200పైగా సీట్లు సాధిస్తుందని, మూడో విడతల్లో కంటే నాల్గో విడతలోనే బీజేపీకి మరిన్ని సీట్లు వస్తాయని అన్నారు. ఇతర పార్టీలోత పోలిస్తే కమలం ముందు వరుసలో ఉందని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో అవీనితి పార్టీ కాంగ్రెస్ ఒకవైపు, బీజేపీ ఒకవైపు ఉందని వ్యాఖ్యానించారు. మోదీని మూడోసారి ప్రధానమంత్రిని చేయాలని దేశమంతా సిద్ధంగా ఉందని అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ అవినీతిపై కాంగ్రెస్ ఇప్పటికీ చర్యలు చేపట్టలేదని విమర్శించారు.
'కాంగ్రెస్ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. ఈ ఎన్నికల్లో గెలవలేమని భావించి బీజేపీపై ఫేక్ వీడియో క్రియేట్ చేసి సర్క్యులేట్ చేస్తున్నారు. తెలంగాణ ఏర్పడినప్పుడు రాష్ట్రం సర్ప్లేస్ స్టేట్‌గా ఉంది. కానీ ఇప్పుడు అప్పుల్లో కూరుకుపోయింది. కేసీఆర్‌కు ఒకటే చెబుతున్నా, ఫలితాల రోజు ఎన్ని సీట్లు వస్తాయో చూడండి'- అమిత్‌షా, కేంద్రహోం మంత్రి