High Tension in Banaganapally Town: ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ వైఎస్సార్సీపీ నేతల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఓటమి భయంతో ఆ పార్టీ నేతలు ప్రతిపక్షాలపై దాడులకు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. తమదే రాజ్యం అన్నట్లుగా ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. రాష్ట్రాన్ని ఎన్నికల రణరంగంగా మార్చుతున్నారు. ప్రతిపక్షాలకు పోటీ చేసే హక్కే లేదన్నట్లు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు ప్రవర్తిస్తున్నారు. అధికార పార్టీ నేతల దాడుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీల వాళ్లూ బాధితులుగా మిగిలిపోయారు.
తాజాగా నంద్యాల జిల్లా బనగానపల్లి పట్టణంలో పట్టణంలోని సంత మార్కెట్లో టీడీపీ కార్యకర్తలపై వైఎస్సార్సీపీ శ్రేణులు రాళ్ల దాడి చేశారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి కుమారుడు ఓబుల్ రెడ్డి ప్రచారం చేసి వెళ్లిపోయారు. అదే సమయంలో టీడీపీ అభ్యర్థి బీసీ జనార్ధన్ రెడ్డి సతీమణి ఇందిరమ్మ ఎన్నికల ప్రచారం కోసం సంత మార్కెట్కు వచ్చారు. అక్కడే ఉన్న వైఎస్సార్సీపీ కార్యకర్తలు రాళ్ల దాడికి దిగారు.
టీడీపీ శ్రేణులు ప్రతిఘటించటంతో గొడవ పెద్దదైంది. ఇరు పార్టీల నేతలు పరస్పరం కుర్చీలతో దాడి చేసుకున్నారు. విషయం తెలుసుకున్న కాటసాని ఓబుల్ రెడ్డి మళ్లీ మార్కెట్కు రావడంతో మరింత ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను అడ్డుకున్నారు.