High Court Judgment On Postal Ballot Counting in AP : ఓటరు డిక్లరేషన్‌కు సంబంధించిన ‘ఫారం-13ఏ’ పై అటెస్టింగ్ అధికారి సంతకం ఉంటే సరిపోతుందని, ఆయన పేరు, హోదా, అధికారిక ముద్ర లేకపోయినా అలాంటి పోస్టల్ బ్యాలట్లు చెల్లుబాటు అవుతాయని ఈసీ తెలిపింది. ఓట్ల లెక్కింపు సమయంలో వాటిని పరిగణనలోకి తీసుకోవాలంటూ మే 30న స్పష్టతనిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో వ్యాజ్యం వేశారు.
శుక్రవారం జరిగిన విచారణలో ఈసీ తరఫున సీనియర్ న్యాయవాది అవినాష్‌దేశాయ్ వాదనలు వినిపిస్తూ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుండగా ఈసీ నిర్ణయాన్ని సవాలు చేయడానికి వీల్లేదన్నారు. చట్ట ప్రకారం నిషేధం ఉందని ఈ దశలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేవని వాదించారు. అధికరణ 329(బి) ప్రకారం ఎన్నికలను సవాలు చేయాలంటే కేవలం ఎన్నికల పిటిషన్ ద్వారా మాత్రమే సాధ్యమని ఎలాంటి సందర్భాల్లో ఎన్నిక చెల్లుబాటుకాదో ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 100 స్పష్టం చేస్తోందని కోర్టుకు వివరించారు. ఈ నేపథ్యంలో ఈ వ్యాజ్యానికి విచారణ అర్హత లేదని ఎన్నికల విధుల్లో ఉండి ఫెసిలిటేషన్ కేంద్రాల వద్ద పోస్టల్ బ్యాలట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్న ఉద్యోగుల విషయంలో మాత్రమే ఈసీ గత నెల 30న ఇచ్చిన ఉత్తర్వులు వర్తిస్తాయని స్పష్టం చేశారు.
ఫెసిలిటేషన్ కేంద్రాల వద్ద అటెస్టింగ్ అధికారిని రిటర్నింగ్ అధికారే నియమించారని ఈ నేపథ్యంలో ఫారం13ఏపై అటెస్టింగ్ అధికారి సంతకం ఉంటే సరిపోతుందని తెలిపారు. ఆ అధికారి పేరు, హోదా, సీలు ఉండాల్సిన అవసరం లేదని ఫెసిలిటేషన్ కేంద్రాల వద్ద జరిగిన పోస్టల్ బ్యాలట్ ప్రక్రియ అంతా వీడియో రికార్డు అయ్యిందని ఆ సమయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులూ ఉన్నారని వివరించారు. ఫెసిలిటేషన్ కేంద్రాల వద్ద ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు పోస్టల్ బ్యాలట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా 2023 ఆగస్టులో నిబంధన 18(ఏ) తీసుకొచ్చారని ఇతర పోస్టల్ బ్యాలట్ల విషయంలో గ్రూప్-ఏ,బీ అధికారులు అటెస్టేషన్ చేస్తారని తెలిపారు. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్‌లకు సంబంధించిన ఫారం 13ఏ పైమాత్రం ఆర్‌ఓ నియమించిన అధికారి అటెస్టేషన్ చేశారని ఈ నేపథ్యంలో ఆ అటెస్టేషన్‌పై సందేహం అవసరం లేదని వాదించారు.
పిటిషనర్ అప్పిరెడ్డి తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ, సీనియర్ న్యాయవాది పి.వీరారెడ్డి వాదనలు వినిపించారు. ఏపీలో సుమారు 5.5 లక్షలకు పైగా పోస్టల్ బ్యాలట్లు ఉన్నాయని గెలుపు, ఓటములను నిర్ణయించేందుకు ఇవి కీలక పాత్ర పోషిస్తాయన్నారు. అటెస్టింగ్ అధికారి సంతకం ఉంటే సరిపోతుందని, ఆయన పేరు, హోదా, సీలు లేకపోయినా పరవాలేదంటూ ఈసీ ఇచ్చిన ఉత్తర్వులు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయన్నారు. పోస్టల్ బ్యాలట్ల చెల్లుబాటు నిబంధనలను మార్చే అధికారం ఈసీకి లేదని ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వుల ద్వారా నిబంధనలను సవరించడానికి వీల్లేదని తెలిపారు. ఎన్నికల నిర్వహణ నిబంధనలకు విరుద్ధంగా ఈసీ చర్యలున్నాయని ఈ విధంగా మార్చడం ఎన్నికల ప్రక్రియను బలహీనపరచడమేనని వాదించారు. చెల్లని ఓట్లను పరిగణనలోకి తీసుకోవాలనేలా ఈసీ ఉత్తర్వులున్నాయని నిబంధనలకు విరుద్ధంగా ఈసీ నిర్ణయం తీసుకున్నప్పుడు న్యాయస్థానాలకు జోక్యం చేసుకునే అధికారం ఉందన్నారు. ఈపీ దాఖలు చేసుకోవాలన్న ఈసీ వాదన సరికాదని ఈసీ ఉత్తర్వులను నిలిపివేయాలని కోరారు.
మరోవైపు ఈ వ్యాజ్యంలో ఇంప్లీడ్ పిటిషన్ వేసిన తెలుగుదేశం నేత వెలగపూడి రామకృష్ణబాబు తరఫున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు, న్యాయవాది పదిరి రవితేజ వాదనలు వినిపించారు. నిబంధనలను కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈసీ ఉత్తర్వులు సరైనవేనన్నారు.