IPS AB Venkateswara Rao Comments : అధర్మాన్ని ఎదుర్కోవడమే వృత్తిధర్మంగా పని చేశానని, చట్టాన్ని కాపాడేందుకు కృషి చేశానని ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు. తాను ఎవ్వరికీ అన్యాయం చేయలేదని, పూర్తి సంతృప్తితో పదవీ విరమణ చేస్తున్నానని ఏబీవీ స్పష్టం చేశారు. తాను ఎవరికీ అన్యాయం చేయకపోవడంతోనే లక్షల మంది అభిమానం పొందానని తెలిపారు. నిజాయతీ, ధర్మం, పోరాటమే కాపాడిందని, రిటైర్ అయినా ప్రజాసేవలో కొనసాగుతానని వెల్లడించారు.
తన సర్వీసులో దుర్మార్గులనూ చూశానన్న ఏబీవీ, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసేందుకు అవకాశం వస్తుందని ఆశిస్తున్నా అని తెలిపారు. పూర్తి సంతృప్తితో రిటైర్ అవుతున్నానని, సర్వీసులో ఉన్నన్ని రోజులు నీతి, నిజాయతీతో పని చేశానని అన్నారు. వృత్తిరీత్యా ఎంతోమందిని చూశాను, నా కష్టాలను చూసి ఎంతోమంది కంటతడి పెట్టారని గుర్తు చేసుకున్నారు. సమాజంలో మంచివాళ్లను చూశాను, దుర్మార్గులను చూశాను, వృత్తిరీత్యా మాత్రమే ఇవాళ రిటైర్ అవుతున్నాను, అన్యాయంపై పోరాడటంలో నేను రిటైర్ కాను అని చెప్పారు. ప్రాణం ఉన్నంత వరకు బాధితుల తరఫున పోరాడుతూనే ఉంటాను, పదవీ విరమణ తర్వాత కూడా దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కొనసాగిస్తానని తెలిపారు.
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు, క్యాట్ ఉత్తర్వుల మేరకు ముందుగా ఆయనపై సస్పెన్షన్ను ఎత్తివేసిన ప్రభుత్వం అనంతరం ఆయనకు ప్రింటింగ్ అండ్ స్టేషనరీ, స్టోర్స్ పర్చేజ్ కమిషనర్ గా పోస్టింగ్ ఇస్తూ ఆదేశాలిచ్చింది. మరోవైపు పోస్టింగ్ ఇచ్చిన రోజే ఏబీ ఉద్యోగ విరమణ చేశారు.
హైకోర్టు ఆదేశాల మేరకు సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ఎత్తివేసిన ప్రభుత్వం ఎట్టకేలకు ఆయనకు పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగ విరమణ చేస్తున్న రోజే ఆయనకు ప్రింటింగ్ అండ్ స్టేషనరీ, స్టోర్స్ పర్చేజస్ కమిషనర్ గా పోస్టింగ్ ఇస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఏబీవీ సస్పెషన్ ఎత్తివేయాలన్న కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ ఆదేశాలతో ఆయన్ను తిరిగి సర్వీసులోకి తీసుకుంటున్నట్టు జీవో ఇచ్చిన ప్రభుత్వం అనంతరం పోస్టింగ్ ఇస్తూ మరో ఉత్తర్వు జారీ చేసింది. అయితే పోస్టింగ్ ఇచ్చిన రోజే ఆయన ఉద్యోగ విరమణ చేశారు. వాస్తవానికి రక్షణ పరికరాల కొనుగోలు వ్యవహారంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో వైసీపీ ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేసింది. డైరెక్టర్ జనరల్ హోదాలో ఉన్న ఆయనకు గడచిన ఐదేళ్లుగా పోస్టింగ్ ఇవ్వకుండా సస్పెన్షన్లు మీద సస్పెన్షన్లు విధించింది. తనపై ప్రభుత్వం విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేయాలంటూ ఏబీవీ కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ ను ఆశ్రయించారు. అయితే క్యాట్ కూడా సస్పెన్షను సమర్థించడంతో ఆయన హైకోర్టులో కేసు దాఖలుచేశారు.
ABV PIL: దురుద్దేశంతోనే నాపై కేసులు పెట్టారు.. హైకోర్టులో ఏబీవీ వ్యాజ్యం
సస్పెన్షన్ విధించటాన్ని ఏపీ హైకోర్టు తప్పు పడుతూ ఆదేశాలిచ్చింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ రాష్ట్రప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే సర్వీసులో ఉన్న అధికారిని రెండేళ్ల కంటే ఎక్కువకాలం సస్పెన్షన్ లో ఉంచొద్దని ఆదేశిస్తూ ఏబీ వెంకటేశ్వరరావుపై ఉన్న సస్పెషన్ ను సుప్రీం కోర్టు రద్దు చేసింది. అయితే సుప్రీం కోర్టు ఆదేశాలతో రెండేళ్ల క్రితం ఏబీవీకి కమిషనర్ ప్రింటింగ్ అండ్ స్టేషనరీ, స్టోర్స్ పర్చేజ్ గా పోస్టింగ్ ఇచ్చింది. అయితే కొద్దిరోజులకే మీడియాతో మాట్లాడారన్న సాకుతో ఆయన్ను మరోమారు ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అయితే ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ చెల్లదని ఆయన్ను తక్షణం విధుల్లోకి తీసుకోవాలని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ మే 8వ తేదీన ఉత్తర్వులు ఇచ్చింది. 22 రోజులు గడిచినా ఆయన్ను విధుల్లోకి తీసుకోకుండా సదరు క్యాట్ ఉత్తర్వులను సవాలు చేస్తూ ప్రభుత్వం ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. క్యాట్ ఆదేశాల నిలుపుదలకు నిరాకరిస్తూ ఏపీ హైకోర్టు మే 30 తేదీన తీర్పు వెలువరించింది. ఈ తీర్పు ప్రతిని నేరుగా సీఎస్ కు అందించిన ఏబీ వెంకటేశ్వరరావు తనకు పోస్టింగ్ ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. హైకోర్టు ఆదేశాల అనంతరం ఎట్టకేలకు ఆయనపై సస్పెన్షన్ ను ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.. ఆయనకు కమిషనర్ ప్రింటింగ్ అండ్ స్టేషనరీ, స్టోర్స్ పర్చేజస్ గా పోస్టింగ్ ఇస్తూ ఆదేశాలు ఇచ్చింది.
1989లో సర్వీసులో చేరిన ఏబీ వెంకటేశ్వర్రావు 2015 జులై 6న నిఘా విభాగం అదనపు డీజీగా నియమితులయ్యారు. 2019 మార్చి 10న డీజీ ర్యాంకు పదోన్నతి పొందగా ఆ తర్వాత ఆయనను బదిలీ చేసి, 2019 ఏప్రిల్ 22న ఏసీబీ డీజీగా పోస్టింగ్ ఇచ్చారు. 2020 ఫిబ్రవరి 8న అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్ చేసింది. రెండేళ్లయినా సస్పెన్షన్ కొనసాగిస్తుండడంతో ఆయన కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో సస్పెన్షన్ ఎత్తివేసి పోస్టింగ్ ఇవ్వాలని కోర్టు 2022 ఏప్రిల్ 22న ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు ప్రభుత్వం 2022 జూన్ 14న ప్రింటింగ్, స్టేషనరీ విభాగం కమిషనర్‌గా ఏబీవీకి పోస్టింగ్ ఇవ్వడంతో జూన్ 17న ఆయన బాధ్యతలు చేపట్టారు. తిరిగి 11రోజులకే రాష్ట్రప్రభుత్వం జీఓ55 ద్వారా ఆయనను జూన్ 28న సస్పెండ్ చేసింది. ఈ లెక్కన ఆయన దాదాపు ఐదేళ్లపాటు సస్పెన్షన్‌లో ఉన్నారు.
ప్రభుత్వం ఏబీవీకి పోస్టింగ్ ఇస్తుందా ? - ఇవ్వకుండానే సాగనంపుతుందా ! - IPS AB Venkateswara Rao