Flexi Issue in Ongole: అధికార పార్టీ నాయకుల ప్రచారం కోసం ప్రభుత్వ కార్యాలయాలను సైతం వదలడం లేదు. ఎక్కడపడితే అక్కడ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడంపై స్థానిక ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశం జిల్లా పామూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో ముఖ్యమంత్రి జగన్ చిత్రంతో ఉన్న ''సిద్ధం'' అనే ఫ్లెక్సీలను వైఎస్సార్సీపీ (YSRCP) నేతలు ఏర్పాటు చేశారు.
వీటికి పోటీగా ఆంధ్ర రాష్ట్రం నుంచి రాక్షస పాలనను అంతం చేయడానికి మేము సిద్ధం అంటూ కనిగిరి ప్రధాన రహదారి వెంబడి పవన్ కల్యాణ్ ఫొటోతో ఉన్న ఫ్లెక్సీని జనసేన (Janasena) నేతలు ఏర్పాటు చేశారు. నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉండే పామూరు ఆర్టీసీ బస్టాండ్‌లో గత అయిదేళ్లుగా ప్రయాణికులు సేద తీరేందుకు కనీసం కుర్చీలు, మంచినీళ్లు సౌకర్యాలు సైతం ఏర్పాటు చేయలేదు. డిపో ప్రాంతమంతా అపరిశుభ్రంగా ఉంది. అధికార పార్టీ నాయకులకు ఫ్లెక్సీల ఏర్పాటులో ఉన్న శ్రద్ధ రాష్ట్ర అభివృద్ధిలో కానీ ప్రజల ప్రయోజనాలలో లేకుండా పోయిందని స్థానికులు చర్చించుకుంటున్నారు. మరోవైపు కొద్ది రోజుల క్రితం విజయవాడలో కూడా వైసీపీ, జనసేన పోటాపోటీగా ఫ్లెక్సీలు కట్టిన విషయం తెలిసిందే.
ప్రకాశం జిల్లా వైసీపీలో ముదురుతున్న వివాదం - నూతన ఇన్ఛార్జ్ ఫ్లెక్సీల చించివేత
Flexi War Between YSRCP Leaders: ఒంగోలు వైసీపీ ఫెక్సీల రగడ చర్చనీయాంశం అయ్యింది. మంత్రి, సంతనూతలపాడు నియోజకవర్గ సమన్వయ కర్త మేరుగ నాగార్జున క్యాంప్ కార్యాలయానికి వెళ్లే మార్గంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు చించివేసి దగ్ధం చేశారు. దీంతో వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు బయటపడ్డాయి.ఫ్లెక్సీల వివాదంతో వర్గపోరు బహిర్గతమైంది. ఈ ఫ్లెక్సీల్లో ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా ఇటీవల నియమితులైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉండే ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన విషయంలో ఒక వర్గం వైసీపీ నాయకులకు ఆగ్రహం కలిగించింది.
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి స్వాగతం పలుకుతూ, నాయకత్వానికి మద్దతు ఇస్తున్నట్లుగా మేరుగు నాగార్జున ఫ్లెక్సీలను ఏర్పాటుచేశారు. వీటిని కొందరు చించివేయడం కలకలం రేపింది. వైసీపీలోని మరో వర్గం వారే మేరుగు నాగార్జున ఫ్లెక్సీలు చించివేశారనే ప్రచారం జోరుగా నడుస్తోంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఒంగోలు పార్లమెంట్ ఇంఛార్జిగా నియమించడంపై వైసీపీలోని మరోవర్గం అసంతృప్తిగా ఉంది.
ఈ నేపథ్యంలోనే ఫ్లెక్సీల వివాదం చెలరేగి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. వివాదంపై స్పందించిన మేరుగు నాగార్జున క్యాంపు కార్యాలయం వద్ద ఫ్లెక్సీలు చిరిగిపోలేదన్నారు. రోడ్డుపై ఎవరో చేసిన పనిని పార్టీకి ఆపాదించొద్దన్నారు. మా నాయకుడు ఎప్పటికీ బాలినేని శ్రీనివాసులరెడ్డే అని తెలిపారు. ఆయన ఆశీస్సులతో మేం ముందుకు వెళుతున్నామని, శ్రీనివాసరెడ్డే తమ నాయకుడు అని నొక్కి మరీ చెప్పారు.
'మేము సిద్ధమే' అధికార పార్టీకి జనసేన కౌంటర్ - చర్చనీయాంశమైన ఫ్లెక్సీ వార్