YS Jagan Not Returned Costliest Things : ముఖ్యమంత్రి హోదాలో గతంలో కొనుగోలు చేసిన కొన్ని పరికరాలను జగన్ కార్యాలయం ప్రభుత్వానికి తిరిగి ఇవ్వకుండా తాత్సారం చేస్తోంది. టేబుళ్లు, కుర్చీలు తిరిగి ఇస్తామంటూ లేఖ రాసిన జగన్ క్యాంపు కార్యాలయం, అత్యంత విలువైన వస్తువుల జాబితాను మాత్రం ప్రభుత్వానికి పంపటం లేదు. సాధారణ పరిపాలన శాఖకు పంపిన లేఖలో కొన్ని పరికరాలను పేర్నొనకుండా మాజీ సీఎం జగన్ క్యాంపు కార్యాలయం లేఖ రాసినట్టు స్పష్టమవుతోంది.
వినియోగిస్తున్న వస్తువులకు డబ్బులు చెల్లిస్తామంటూ ఒక జాబితా, తిరిగి పంపే వస్తువులకు సంబంధించిన ఒక జాబితా పంపిన జగన్ కార్యాలయం, గతంలో సీఎం హోదాలో ఏర్పాటు చేయించుకున్న కోటీ 7 లక్షల విలువైన వీడియో కాన్ఫరెన్సు సిస్టం గురించి మాత్రం స్పందించటం లేదు. గతంలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంగా మార్చుకున్న తాడేపల్లి నివాసంలో 1.07 కోట్ల విలువైన కాన్ఫరెన్సు సిస్టంను జగన్ ఏర్పాటు చేయించుకున్నారు.
సాధారణ పరిపాలన శాఖ రాజకీయ విభాగం నుంచి అత్యంత ఖరీదైన ఈ వీడియో కాన్ఫరెన్సు సిస్టంను గతంలో కొనుగోలు చేసి ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత తాడేపల్లి క్యాంపు కార్యాలయాన్ని పార్టీ ఆఫీసుగా మార్చేసిన తర్వాత కూడా అదే కాన్ఫరెన్సు సిస్టంను వినియోగిస్తున్నారు. ప్రభుత్వానికి ఫర్నీచర్ తిప్పి పంపుతానంటూ పేర్కొన్న జాబితాలో ఖరీదైన వీడియో కాన్ఫరెన్సు సిస్టంను తిరిగి ఇస్తామని కానీ, దానికి వెలకట్టి తీసుకుంటామని కానీ ఏమాత్రం చెప్పలేదని తెలుస్తోంది.
అసలు దాని ఊసే లేకుండా జాబితా పంపించేయటంపై విస్మయం వ్యక్తం అవుతోంది. వీడియో కాన్ఫరెన్సు సిస్టంలో భాగంగా అధునాతన టీవీలు, మైక్ సిస్టం, కెమెరాల వ్యవస్థను అప్పట్లో సాధారణ పరిపాలన శాఖ కొనుగోలు చేసింది. ప్రస్తుతం కుర్చీలు, టేబుళ్లు మాత్రమే తిప్పి పంపుతామంటూ మాజీ సీఎం జగన్ కార్యాలయం లేఖ రాసింది.
YSRCP Letter to GAD: కాగా ఇటీవల వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ధనంతో ఏర్పాటు చేసిన ఫర్నీచర్‌ను వాపసు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వైఎస్సార్సీపీ కోరింది. క్యాంపు కార్యాలయం నుంచి ఫర్నిచర్ వస్తువులకు సంబంధించి వెంటనే క్లియరెన్స్ ఇవ్వాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి సాధారణ పరిపాలన శాఖ (GAD)కి లేఖ రాశారు. ఈ విషయమై సత్వర చర్యలు తీసుకోవాలని జీఏడీ డిప్యూటీ సెక్రటరీకి అధికారికంగా లేఖ అందించారు.
మాజీ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని పార్టీ కేంద్ర కార్యాలయంగా మార్చుతున్నందున, రాజకీయ కార్యకలాపాలకు అనుగుణంగా స్థలాన్ని ఖాళీ చేయాల్సిన అవసరం ఉందని లేఖలో తెలిపారు. తరలించేందుకు వీలు కాని ఫర్నీచర్‌ను ఉంచడానికి అయ్యే ఖర్చులను భరించడానికి పార్టీ సుముఖంగా ఉందని లేఖలో తెలిపారు. అయితే ఈ జాబితాలో అత్యంత విలువైన వీడియో కాన్ఫరెన్సు వ్యవస్థ ఊసే లేకుండా జాబితా పంపించేయటంపై విస్మయం వ్యక్తం అవుతోంది.