DY CM Bhatti Vikramarka On New PCC Chief : నూతన పీసీసీ చీఫ్ ఎంపికపై కసరత్తు కొనసాగుతోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. త్వరలోనే రైతు రుణమాఫీ చేస్తామని ఆయన తెలిపారు. మంత్రివర్గ(కేబినెట్) విస్తరణపై పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్పై పలు విమర్శలు గుప్పించారు.
త్వరలోనే రైతు రుణమాఫీ : అనుకున్న సమయం కంటే ముందే గ్యారంటీలు అమలు చేశామని భట్టి విక్రమార్క తెలిపారు. త్వరలోనే రైతు రుణమాఫీ చేస్తామన్నారు. రూ.లక్ష రుణమాఫీ చేస్తామని ఐదేళ్లలో కూడా గత ప్రభుత్వం చేయలేదని ఎద్దేవా చేశారు. రుణమాఫీ ఎప్పుడు చేస్తారని తమని అడుగుతున్నారన్నారన్నారు. ప్రజలు కట్టిన పన్నులతోనే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్న భట్టి, వారు కట్టిన ప్రతీ పైసా రాష్ట్రాభివృద్ధికి ఉపయోగపడాలన్నారు. ప్రజల అభిప్రాయాలు తీసుకుని పథకాలపై విధివిధానాలు రూపొందిస్తామని తెలిపారు. అన్ని వర్గాలతో మాట్లాడి వచ్చిన రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెడతామని వివరించారు.
రైతు ఆత్మహత్యకు పాల్పడటం బాధాకరం : ఖమ్మం జిల్లాలో రైతు ఆత్మహత్య పాల్పడటం బాధాకరమన్న భట్టి, పుట్టింది బతకడానికే కానీ చావడానికి కాదని స్పష్టం చేశారు. రైతు ఆత్మహత్య వెనుక ఎవరున్నారనే దానిపై దర్యాప్తు కొనసాగుతుందన్నారు. ఆత్మహత్యకు కారణమైంది ఎంతటివారనప్పటికీ వదిలిపెట్టేది లేదని ఆయన స్పష్టం చేశారు. త్వరలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని వెల్లడించారు.
"ఐదేళ్లు పూర్తయినా కూడా లక్షరూపాయల రుణమాఫీ చేయని బీఆర్ఎస్ నాయకత్వం, కాంగ్రెస్ ప్రభుత్వ ఇంకా రుణమాఫీ చేయట్లేదని అరిచి గీ పెడుతున్నారు. మీరేమి అరవాల్సిన అవసరం లేదు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని తూచ తప్పకుండా అమలు చేయాలనే అంకిత భావంతో మేమున్నాం తప్పనిసరిగా ఆ శుభవార్త కూడా వింటారు. బీఆర్ఎస్ చెప్పే కల్లబొల్లి కబుర్లు ఎవరూ నమ్మాల్సిన అవసరం లేదు"- భట్టి విక్రమార్క, ఉపముఖ్యమంత్రి
Bhatti Vikramarka On KCR : 15 ఏళ్లు తామే అధికారంలో ఉంటామని చెబుతున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్వి ఉత్తమాటలేనని భట్టి ఆరోపించారు. కేసీఆర్ తప్పిదాలే అయన్ను వెంటాడుతున్నాయని ధ్వజమెత్తారు. ఏడు మండలాలు ఏపీకి పోవడానికి కారణం బీఆర్‌ఎస్, బీజేపీలేనని ఆరోపించారు. ఏపీ సీఎం చంద్రబాబు, రేవంత్ రెడ్డిలు సహచరులని పేర్కొన్నారు. పదేళ్ల పెండింగ్ సమస్యలను ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చిస్తారన్నారు.
విభజన చట్టంలో ఏడు మండలాల ప్రస్తావన లేదని, బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆర్డినెన్స్ ద్వారా ఏపీలో కలిపారని విమర్శించారు. ఏడు మండలాల కోసం పోరాటం చేస్తానని అసెంబ్లీలో చెప్పిన కేసీఆర్ ఏమయ్యాడని భట్టి ప్రశ్నించారు.
రైతుభరోసాపై మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటు - ఛైర్మన్‌గా డిప్యూటీ సీఎం భట్టి
మహిళలను మహారాణులుగా తీర్చిదిద్దడమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యం : డిప్యూటీ సీఎం భట్టి