Deepadas Munshi Calls MLC Jeevan Reddy to Delhi : రాష్ట్ర నాయకత్వంపై అలకబూనిన ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, దిల్లీ పర్యటన అనంతరం మెత్తబడ్డారు. కేసీ వేణుగోపాల్‌తో భేటీ అనంతరం ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మనసు మార్చుకున్నారు. తన రాజీనామా నిర్ణయాన్ని ఉపసంహరించుకుని, పార్టీ ముఖ్యమని వ్యాఖ్యానించారు. రాజకీయ పరిణామాలు, పరిస్థితుల వల్ల కొన్ని నిర్ణయాలు తప్పవని ఆయన పేర్కొన్నారు.
మొదటి నుంచి ఉన్నవారికే ప్రాధాన్యత ఉంటుందని చెప్పారని, కార్యకర్తలను కాపాడుకోవడం చాలా ముఖ్యమని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి తెలిపారు. ఏ పార్టీకైనా కార్యకర్తలే ముఖ్యమని, లోక్‌సభ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు వచ్చాయన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ అమలుచేస్తోందని, బీఆర్ఎస్ పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయలేదని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరిక వ్యవహారంపై ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి జగిత్యాల పంచాయతీ దిల్లీకి చేరిన విషయం తెలిసిందే. సంజయ్ కుమార్ చేరికను కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. గత మూడు రోజులుగా జీవన్ రెడ్డి అలకబూనడంతో బుజ్జగించే కార్యక్రమం సైతం కొనసాగింది.
జీవన్ రెడ్డిని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్షణ్, ఎమ్మెల్యేలు రాజ్ ఠాకూర్, ప్రేమసాగర్ రావు తదితరులు బుజ్జగించారు. అయినా ఆయన మెట్టు దిగలేదు. తన ప్రమేయం లేకుండా పార్టీ మార్పు జరిగిందని జీవన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేసారు. పార్టీని వీడేది లేదని స్పష్టం చేస్తున్నప్పటికీ ఇవాళ తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు.
దిల్లీకి చేరిన జగిత్యాల పంచాయతీ : ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పార్టీ అధిష్ఠానం, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్ మున్సీ జీవన్ రెడ్డిని బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఇవాళ ఉదయం ఉప ముఖ్యమంత్రి భట్టి, మంత్రి ఉత్తమ్‌కుమార్ దిల్లీ వెళ్లారు. ఆ వెంటనే భట్టి , శ్రీధర్ బాబులతో మాట్లాడిన తర్వాత జీవన్ రెడ్డిని దిల్లీకి రావాల్సిందిగా ఆహ్వానించారు. అక్కడ పార్టీ పెద్దలైన కేసీ వేణుగోపాల్‌తో సమావేశమయ్యారు. ఈ భేటీలో జీవన్ రెడ్డి మనసు మార్చుకున్నారు. తరువాత మీడియాతో ఇదే విషయాన్ని వెల్లడించారు.
ఎమ్మెల్యే సంజయ్ చేరిక పట్ల జీవన్ రెడ్డి అసహనం! - జగిత్యాలలో ఆసక్తికర పరిణామాలు