Criminal Case on Sajjala Ramakrishna Reddy: సజ్జల రామకృష్ణారెడ్డి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు నిన్నటి దాకా వైసీపీ ప్రభుత్వంలో అన్నీ ఆయనే. ముఖ్యమంత్రిగా జగన్‌తో పాటు అన్నీ శాఖలకు మంత్రులు ఉన్నా, సర్వాధికారాలు తనవేనన్నట్లు వ్యవహరించారు. ప్రతి విషయంపై మాట్లాడటం ద్వారా సకలశాఖ మంత్రిగా ముద్ర వేసుకున్నారు. పోలీస్ శాఖ పైనా పూర్తిస్థాయిలో పెత్తనం చేశారు. నియామకాలు, బదిలీల నుంచి అరెస్టుల వరకూ తన కనుసన్నల్లోనే జరిగాయి. కానీ ఇప్పుడు ఆయనపైనే పోలీసు కేసు నమోదైంది. అప్రకటిత పోలీస్ బాస్‌గా ఉన్న సజ్జలపైనే పోలీసులు కేసు నమోదు కావటం, రాష్ట్రంలో మారబోతున్న పరిణామాలకు నిదర్శనంగా కనిపిస్తోంది.
బాధ్యత గల ప్రభుత్వ సలహాదారు పదవిలో ఉంటూ సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. కౌంటింగ్ కేంద్రాల్లో ప్రతిపక్షాల ఏజెంట్లతో వైఎస్సార్సీపీ ఏజంట్లను గొడవలకు ఉసిగొల్పేలా సజ్జల వ్యాఖ్యలున్నాయని (Sajjala Provocative Comments ) తెలుగుదేశం లీగల్ సెల్ తరఫున న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ, మాజీమంత్రి దేవినేని ఉమ తాడేపల్లి పోలీసు స్టేషన్‌లో గురువారం నాడు ఫిర్యాదు చేశారు. సజ్జల వ్యాఖ్యలు ఓట్ల లెక్కింపు రోజున రెండు వర్గాల మధ్య గొడవలకు దారి తీసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ మేరకు తాడేపల్లి సీఐ బత్తుల కల్యాణ్ రాజు కేసు నమోదు చేశారు. ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద క్రిమినల్ కేసు నమోదు చేశారు.
సకల శాఖా మంత్రిగా, అప్రకటిత పోలీస్ బాస్‌గా ఐదేళ్లుగా పోలీసు శాఖలో నియామకాలు, బదిలీల నుంచి అరెస్టుల వరకు అన్నీ దగ్గరుండి నడిపించిన సజ్జలపైనే పోలీసు కేసు నమోదు కావడం చర్చనీయాంశమైంది. తాడేపల్లి అనేది రాజధాని పరిధిలోకి వస్తుంది. ముఖ్యమంత్రి జగన్ అక్కడే నివసిస్తున్నారు. వైకాపా ప్రధాన కార్యాలయం కూడా అక్కడే ఉంది. అంటే ఇది జగన్‌కి పులివెందుల తర్వాత మరో ఇలాకా లాంటిది. అలాంటి చోటే జగన్ సన్నిహితుడు సజ్జలపై కేసు నమోదు కావడంతో తీవ్ర చర్చ జరుగుతోంది. పేరుకే సలహాదారు అయినా, ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల కంటే ప్రభుత్వ కార్యక్రమాల్లో సజ్జలకే అధిక ప్రాధాన్యం దక్కేది. సజ్జల ఎక్కడ ఏ కార్యక్రమానికి వెళ్లినా కారు దిగేసరికి పోలీసులు సెల్యూట్ చేసేవారు.
ఐతే పోలీసుల పక్షపాత వైఖరిని గతంలో కోర్టులు తప్పుపట్టడం, ఎన్నికల సంఘం కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం, రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వస్తుందనే ఊహాగానాలు చెలరేగుతున్న వేళ, వైఎస్సార్సీపీకి కొమ్ముకాస్తే ఇబ్బందులు తప్పవని గ్రహించిన పోలీసులు, చట్టాన్ని అమలు చేసే పనిలో పడ్డారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాక ఉన్నతాధికారులు కూడా కేసు నమోదు విషయంలో పచ్చజెండా ఊపినట్లు సమాచారం. అందుకే తాడేపల్లి పోలీసులు కూడా ధైర్యంగా ముందుడుగు వేశారని తెలుస్తోంది. పోలీసు శాఖలో మార్పునకు ఇదే నిదర్శనమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.