Election counting : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అధికార పీఠం ఎవరకి దక్కబోతుంది? ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ఇద్దర్ని కదిలించినా ఇదే ప్రశ్న. నరాలు తెగే ఉత్కంఠతో ఎప్పుడెప్పుడు ఫలితాలు వెలువడతాయా అని ప్రతి ఒక్కరు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. వారి నిరీక్షణకు మరికాసేపట్లో తెరపడనుంది. E.V.M పెట్టెల్లో నిక్షిప్తమైన ఓటర్ల తీర్పు మరికాసేపట్లో వెలువడనుంది. ఏపీలోని 175 శాసనసభ నియోజకవర్గాలు, 25 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించిన ఫలితాల లెక్కింపు ప్రక్రియ... ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. ఎన్నికల అనంతరం జరిగిన హింసాత్మక ఘటనల దృష్ట్యా సాయుధ పారామిలటరీ బలగాలతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది. కౌంటింగ్ కేంద్రాల పరిధిని ఎన్నికల కమిషన్ రెడ్ జోన్ గా పరిగణించి 144 సెక్షన్ అమలు చేస్తోంది.
నేడే కౌంటింగ్- ఫలితాల కోసం పకడ్బందీ ఏర్పాట్లు - AP Election Votes Counting
సార్వత్రిక ఎన్నికల్లో లోక్ సభ, శాసనసభ నియోజకవర్గాలకు పోటీ పడిన అభ్యర్థుల భవితవ్యం కొద్ది గంటల్లో తేలనుంది. EVMలలో నిక్షిప్తమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. దీనికోసం రాష్ట్రవ్యాప్తంగా 33 చోట్ల 401 కౌంటింగ్ హాళ్లను సిద్ధం చేశారు. 25 వేల మంది సిబ్బంది కౌంటింగ్ ప్రక్రియలో భాగం కానున్నారు. 25 పార్లమెంటు నియోజకవర్గాలకు పోటీ పడిన 454 మంది అభ్యర్థుల భవితవ్యం కాసేపట్లో వెల్లడి కానుంది. అలాగే 175 శాసనసభ నియోజకవర్గాలకు పోటీపడిన 2వేల387 మందిలో ఎవరు విజేతలుగా నిలువనున్నారనే ఉత్కంఠకు కొద్ది గంటల్లో తెరపడనుంది. అంతిమంగా ఏ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకోనుందన్న అంశాన్ని ఓట్ల లెక్కింపు అనంతరం వెల్లడించనుంది.
రాష్ట్రంలో మే 13 తేదీన జరిగిన పోలింగ్ లో మొత్తం 3.33 కోట్ల మంది ఓటు వేశారు. ఎన్నికల విధుల్లో ఉన్న 4లక్షల 61వేల 945 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ఓటును వినియోగించుకున్నారు. అలాగే హోమ్ ఓటింగ్ ద్వారా 26,473 మంది, సర్వీసు ఓటర్లు 26,721 మంది ఓట్లు వేశారు. పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి E.V.M లెక్కింపునకు 2వేల443 టేబుళ్లు, పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు కోసం 443 టేబుళ్లను సిద్ధం చేశారు. ఇక అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 2వేల446 టేబుళ్లు, పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి 557 టేబుళ్లను లెక్కింపునకు ఏర్పాటు చేశారు.
ఓట్ల లెక్కింపు ప్రక్రియలో భాగంగా 13 రౌండ్లు ఉన్న నర్సాపురం, రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గాల ఫలితం ముందుగా వెలువడనుంది. అలాగే కొవ్వూరు, నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితాలు మధ్యాహ్నం 1 కల్లా వెల్లడయ్యే అవకాశముంది. ఇక అమలాపురం పార్లమెంటు నియోజకవర్గం, భీమిలి, పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితాలు ఆఖరున వెల్లడయ్యే అవకాశముంది. 111 నియోజకవర్గాల ఫలితాలు మధ్యాహ్నం 1 గంటకే వెలువడే అవకాశమున్నట్టు ఇప్పటికే ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం స్పష్టం చేస్తోంది. అలాగే 61 నియోజకవర్గాల్లో 21 నుంచి 24 రౌండ్ల మధ్య ఫలితం వెల్లడయ్యే అవకాశముంది. 3 నియోజకవర్గాల్లో 25 రౌండ్ల తర్వాత ఫలితాలు వచ్చే అవకాశముంది. పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి 2 రౌండ్లలోపు 102 నియోజకవర్గాలు, 48 నియోజకవర్గాల్లో 3 రౌండ్లు, 25 నియోజకవర్గాల్లో 4 రౌండ్ల మేర కౌంటింగ్ ప్రక్రియ జరుగనుంది.
మొత్తం 119 మంది అబ్జర్వర్ల పర్యవేక్షణలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగనుంది. కౌంటింగ్ కేంద్రాలను రెడ్ జోన్ గా ప్రకటించినట్టు ఈసీ స్పష్టం చేసింది. కౌంటింగ్ కేంద్రాల్లో ఎలాంటి అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నించినా తక్షణమే ఏజెంట్లను బయటకు పంపి కేసు నమోదు చేసి జైల్లో పెడతామని ఈసీ హెచ్చరికలు జారీ చేసింది. కౌంటింగ్ కేంద్రాల లోపల పూర్తి వీడియో గ్రఫీ చేయిస్తున్నట్టు ఈసీ తెలిపింది. కౌంటింగ్ కేంద్రాల్లోకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఫోన్లను అనుమతించబోమని స్పష్టం చేసింది. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతా వ్యవస్థ కొనసాగుతుందని C.E.O. ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. సీసీ కెమెరాలు, కంట్రోల్ రూమ్ లు, డ్రోన్ల సాయంతో అన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రతను పర్యవేక్షించనున్నట్టు తెలిపారు. పోలింగ్ రోజు, అనంతరం జరిగిన హింసాత్మక ఘటనల దృష్ట్యా అన్ని కౌంటింగ్ కేంద్రాలతో పాటు సున్నితమైన ప్రాంతాల్లో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్టు ఈసీ స్పష్టం చేసింది. ఏపీకి అదనంగా 67 కంపెనీల సాయుధ పోలీసు బలగాలను రప్పించి మొహరించినట్టు తెలిపింది. 45 వేల మంది రాష్ర్ట పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటన జరక్కుండా విధుల్లో ఉన్నారని C.E.O స్పష్టం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా 1985 సున్నితమైన ప్రాంతాల్లో పోలీసు పికెట్ ఏర్పాటు చేసినట్టు ఈసీ తెలిపింది. 83 అసెంబ్లీ నియోజకవర్గాల్లో హింస జరగొచ్చన్న సమాచారం మేరకు బందోబస్తు ఏర్పాట్లు చేశామని 12639 మందిని బైండోవర్ చేసినట్టు సీఈఓ వెల్లడించారు. అదనపు డీజీపీ స్థాయి నుంచి సబ్ ఇనస్పెక్టర్ స్థాయి వరకూ వేర్వేరు ప్రాంతాల్లో అధికారులను మొహరించి భద్రతను పర్యవేక్షిస్తున్నట్టు స్పష్టం చేశారు. 26 జిల్లాల్లోనూ అన్ని చోట్లా కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేసి వాటి ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు తెలిపారు.
https://www.etvbharat.com/te/andhra-pradesh/!elections/ap-assembly-election-results-2024