Congress on New PCC Members in Telangana : రాష్ట్రంలో కాంగ్రెస్‌ను బలోపేతం చేసే దిశగా స్థానిక నాయకత్వం చర్యలు చేపడుతోంది. ఇప్పటికే గాంధీభవన్‌లో "మంత్రులతో ప్రజల ముఖాముఖి" కార్యక్రమం చేపట్టిన హస్తం పార్టీ జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తోంది. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల నేతలతో పార్టీ స్థితిగతులపై ఆరా తీసిన మహేశ్‌కుమార్ గౌడ్, మిగిలిన జిల్లాల్లోనూ సమీక్ష నిర్వహించేలా కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు. మరోవైపు రాష్ట్రంలోని 25 నియోజకవర్గాల్లో పార్టీ నాయకుల సయోధ్య లేదని గుర్తించారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన స్థానాల్లో కార్యకర్తల మధ్య విభేదాలు తీవ్రంగా ఉన్నట్లు పీసీసీ సారథి దృష్టికి వచ్చింది.
బాల్కొండ, స్టేషన్ ఘన్‌పూర్, గద్వాల్, ఖైరతాబాద్, గోషామహల్ నియోజకవర్గాల్లో సమస్య తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. దిద్దుబాటు చర్యలు చేపట్టిన సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ నియోజకవర్గ నేతలను పిలిచి సర్దిచెబుతున్నట్లు సమాచారం. కాంగ్రెస్ అధిష్ఠానం హరియాణా, జమ్మూకశ్మీర్ ఎన్నికల్లో మునిగి ఉండటంతో పీసీసీ కార్యవర్గం ఏర్పాటు ఆలస్యం కావొచ్చనే పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈసారి పరిమిత సంఖ్యలోనే కార్యనిర్వాహక అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శి పదవులుంటాయని పీసీసీ ఛైర్మన్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. ప్రచార కమిటీ ఛైర్మన్‌గా ఇప్పటి వరకు మధుయాస్కీ గౌడ్ ఉండగా కొత్తగా మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి నియామకం అయ్యే అవకాశం ఉంది.
ఎక్కువ మంది డీసీసీలను మార్చే అవకాశం : ఇక జిల్లాల వారీగా డీసీసీ అధ్యక్షులు చురుగ్గా లేరని పరిశీలనలో తేల్చిన రాష్ట్ర నాయకత్వం, ఎక్కువ మందిని మార్చాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. బలమైన నాయకులు లేని చోట్ల ఎమ్మెల్యేలనే జిల్లా పార్టీ అధ్యక్షులు నియమించనున్నట్లు సమాచారం. అన్ని జిల్లాల నుంచి సమాచారం తెప్పించుకున్న మహేశ్ కుమార్ గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఇతర సీనియర్లతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారని పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వచ్చే నెల 4న అమెరికా పర్యటన నుంచి వచ్చిన తర్వాత పార్టీకి చెందిన అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
త్వరలోనే పూర్తిస్థాయిలో పీసీసీ కార్యవర్గ ప్రక్షాళన - మహేశ్‌కుమార్ గౌడ్ - Mahesh Kumar Goud Chit Chat