CM Revanth on BJP and BRS : గత ప్రభుత్వంలో పేదలకు రెండుపడక గదుల ఇళ్లు ఇస్తానని చెప్పి కేసీఆర్ మోసం చేశారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగాలు వస్తాయని తెలంగాణ యువత రాష్ట్రం కోసం పోరాటం చేస్తే పేదల ఉద్యోగాల గురించి కేసీఆర్ పదేళ్ల పాటు పట్టించుకోలేదని మండిపడ్డారు. కుమారుడు, కుమార్తె, అల్లుడు, బంధువులకు మాత్రమే కేసీఆర్ ఉద్యోగాలు ఇచ్చారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎల్బీ స్టేడియంలో 25 వేల మందికి నియామక పత్రాలు ఇచ్చామని గుర్తు చేశారు.
రిజర్వేషన్లు రద్దు చేయాలని మోదీ, అమిత్‌షా తలుచుకున్నారని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం మార్చాలని బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. రిజర్వేషన్లు రద్దు చేసి దేశాన్ని కార్పొరేట్ వ్యాపారుల చేతిలో పెట్టాలని మోదీ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్‌కు కాంగ్రెస్ ప్రభుత్వం ఈసీఐఎల్, బీహెచ్ఈఎల్, డీఆర్‌డీవో వంటి ఎన్నో సంస్థలను ఇచ్చిందని, ఈ పదేళ్లలో హైదరాబాద్‌కు మోదీ ఒక్క పరిశ్రమ అయినా ఇచ్చారా అని ప్రశ్నించారు. ఇవాళ సంగారెడ్డి జిల్లాలోని పెద్దశంకరంపేటలో నిర్వహించిన కాంగ్రెస్ బహిరంగ సభ సీఎం రేవంత్ ప్రసంగించారు.
కేసీఆర్ కబంధహస్తాల్లో తెలంగాణ చిక్కుకుంది : కాంగ్రెస్ ఇచ్చిన సంస్థలను మోదీ, అమిత్‌షా కలిసి అంబానీ, అదానీలకు అమ్ముతున్నారని, ఇప్పటికే రూ.60 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ సంస్థలను మోదీ అమ్మేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. కొన్ని ఎంపీ సీట్లలో బీజేపీని గెలిపించాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. రిజర్వేషన్లు పోవాలంటే బీజేపీ ఓటు వేయండని, రిజర్వేషన్లు ఉండాలంటే కాంగ్రెస్‌ను గెలిపించండని కోరారు.
తెలంగాణ ఇస్తే ఏపీలో కాంగ్రెస్కు నష్టమని తెలిసినా సోనియాగాంధీ రాష్ట్రాన్ని ఇచ్చారని సీఎం రేవంత్ తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చాలని ఆమె రాష్ట్రాన్ని ఇచ్చారని, కానీ తెలంగాణ పదేళ్లపాటు కేసీఆర్ కబంధహస్తాల్లో చిక్కుకుందని విమర్శించారు. పేదలకు కూడా కార్పొరేట్ వైద్యం అందాలని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ తెచ్చిందని, దాన్ని కూడా కేసీఆర్ ప్రభుత్వంలో నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రాగానే ఆరోగ్యశ్రీ పరిధిని రూ.10 లక్షలకు పెంచామని పేర్కొన్నారు.
'బీజేపీ అంటే నేను అదేదో భారతీయ జనతా పార్టీ అనుకున్నా. కానీ బీజేపీ నేత ఒకరు చెబుతున్నారు. మాది బీజేపీ అంటే బ్రిటీష్ జనతా పార్టీ అని. మా విధానం మా ఆలోచన బ్రిటీష్ వాళ్ల ఆలోచన అని. దేశాన్ని దోచుకోవాలనే బీజేపీ 400 సీట్లు అడుగుతోంది'- రేవంత్ రెడ్డి, సీఎం