CM Revanth Assembly Speech Today : తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ఇవాళ్టి సమావేశాల్లో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ పదేళ్లుగా కేంద్రంలోని బీజేపీకి అండగా నిలిచిందని ఆరోపించారు. కేంద్రం తెచ్చే అన్ని బిల్లులకు బీఆర్ఎస్ మద్దతు పలికిందని అన్నారు.
CM Revanth On BRS BJP Relation : బీఆర్ఎస్, బీజేపీ నేతలు కలిసి పలుమార్లు చాలా విషయాలపై చర్చించుకున్నారని రేవంత్ రెడ్డి చెప్పారు. సీఎంను మార్చుకునే విషయం కూడా తమతో కేసీఆర్ చర్చించినట్లు ప్రధాని మోదీ తెలంగాణకు వచ్చినప్పుడు చెప్పారని గుర్తు చేశారు. కేసీఆర్ తమ పార్టీ నేతలకు కొన్ని చెబుతారని, కొన్ని దాస్తారని పేర్కొన్నారు. బీఆర్ఎస్, బీజేపీది ఫెవికాల్ సంబంధం అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ఆటో డ్రైవర్లకు ఏటా రూ.12 వేల ఆర్థిక సాయం - అసెంబ్లీ సాక్షిగా మంత్రి శ్రీధర్‌బాబు ప్రకటన
"పార్లమెంటులో బీఆర్ఎస్ ఎంపీలు బీజేపీకి అనుకూలంగా పలు బిల్లులకు ఓటు వేశారు. అప్పుడే వీరి బంధం బాహ్యప్రపంచానికి తెలిసిపోయింది. బీఆర్ఎస్‌లో ఉన్న అప్పటి కొందరు మంత్రులు ఆ సమయం లో సీఎంగా ఉన్న కేసీఆర్‌ను గద్దె దించాలని, ఆయన స్థానంలో కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయాలనుకున్నారు. ఈ క్రమంలోనే కేసీఆర్‌పై అవిశ్వాస తీర్మానం చేయాలని నిర్ణయించారు కూడా."
"విషయం తెలుసుకున్న కేసీఆర్ మోదీ వద్దకు వెళ్లారు. నన్ను మా పార్టీలో సీఎం పదవి నుంచి తప్పుకోమంటున్నారు. నా కుమారుడిని సీఎం చేయాలనుంటున్నారు. అందుకే నేను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుంటాను. కేటీఆర్‌ను సీఎం చేయడానికి నాకు అనుమతి ఇవ్వండని కేసీఆర్ మోదీని అనుమతి అడిగారు. తాను వారసత్వ రాజకీయాలను సమర్థించను అని మోదీ కేసీఆర్ విజ్ఞప్తిని పట్టించుకోలేదని ప్రధాని మోదీ ఇటీవల రాష్ట్రానికి వచ్చినప్పుడు స్వయంగా చెప్పారు." అని అసెంబ్లీలో రేవంత్ ఆరోపించారు.
ఆ విషయంలో సీఎం క్షమాపణలు చెప్పాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీల పట్టు - మండలిలో గందరగోళం
దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. సీఎంను మార్చేందుకు తమకు ఎవరి అనుమతీ అక్కర్లేదని స్పష్టం చేశారు. బీజేపీతో బీఆర్ఎస్‌కు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్న విషయం తమకు తెలుసని వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయాలు తెలుసుకుని మాట్లాడితే బాగుండేదని పోచారం వ్యాఖ్యానించారు.
"మేం కేసీఆర్‌ను ఎప్పుడూ మార్చాలనుకోలేదు. మా నాయకుడు ఆయనే ఉండాలని అనుకున్నాం. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ ఆయనే మా నాయకుడు. మాకు సీఎంను మార్చాల్సిన అవసరం రాలేదు. ఒకవేళ మార్చాలనే అనుకుంటే మేమే 100 మంది ఎమ్మెల్యేలం ఉన్నాం. ఆ పని మాతోనే సులువుగా అయ్యేది. దానికి ప్రధాని మోదీ అనుమతి అవసరం లేదు." - పోచారం శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే